Published : 17/01/2023 20:43 IST

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!

ప్రత్యేకించి మహిళలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నెలసరి సమస్యల్ని తగ్గించుకోవడం, పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

వ్యాయామం ఎలాంటి సమస్యకైనా విరుగుడుగా పనిచేస్తుంది. ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే క్రమం తప్పకుండా వర్కవుట్‌ను రొటీన్‌లో భాగం చేసుకోవడం మంచిది. రోజూ కనీసం పది వేల అడుగులు వేయడం, మెట్లెక్కడం, భోజనం తర్వాత కాసేపు నడవడం.. ఇలా శరీరానికి కాస్త శ్రమ కలిగించినా చక్కటి ఫలితం ఉంటుంది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా కీలకమే. ఈ క్రమంలో ఎత్తును బట్టి ఎంత బరువు (బీఎంఐ) ఉండాలో నిర్ధారించుకోవాలి. మీ బీఎంఐ ఎంతో తెలుసుకొని.. మీరు బరువు పెరగాలా, తగ్గాలా, దానికోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలన్నీ నిపుణులను అడిగి తెలుసుకుంటే మంచిది. ఇలా బీఎంఐని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం 32 శాతం తగ్గుతుందట!

రక్తంలో చక్కెర స్థాయులు, బీపీ ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం వల్ల ఏమైనా హెచ్చుతగ్గులుంటే డాక్టర్‌ సలహా మేరకు వాటిని అదుపు చేసుకోవచ్చు.

చిరుతిండ్లు, నూనె సంబంధిత పదార్థాలంటే ఎవరికైనా ఇష్టమే! కానీ వాటిని అమితంగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగిపోయి తద్వారా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం లేదా వీటిని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిదంటున్నారు నిపుణులు.

శరీరానికి తగిన పని చెప్పకుండా గంటల తరబడి ఒకేచోట కూర్చుండిపోయే వారిలో గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. కాబట్టి శరీరానికి తగినంత వ్యాయామం అందేలా జాగ్రత్తపడాలి.

మానసిక సమస్యలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు సహకరిస్తాయి.

ఇలా మనం తీసుకునే జాగ్రత్తలన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు.. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, నెలసరి సమస్యలు, ఇతర అనారోగ్యాల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని పాటిస్తే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని