గెలిచిన ఆనందం నాన్నతో పంచుకోవాలనుకుంది.. కానీ అంతలోనే..!

ఓవైపు తండ్రికి తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ప్రపంచకప్‌ ఫైనల్‌.. ఇలాంటి పరిస్థితిలో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడడానికే నిర్ణయించుకుందామె. అలాగని నామమాత్రంగా కాదు.. తన జట్టును విశ్వవిజేతగా నిలపాలని సంకల్పించుకుంది.. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితమివ్వాలనుకుంది.

Published : 22 Aug 2023 12:26 IST

(Photos: Instagram)

ఓవైపు తండ్రికి తీవ్ర అనారోగ్యం.. మరోవైపు ప్రపంచకప్‌ ఫైనల్‌.. ఇలాంటి పరిస్థితిలో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడడానికే నిర్ణయించుకుందామె. అలాగని నామమాత్రంగా కాదు.. తన జట్టును విశ్వవిజేతగా నిలపాలని సంకల్పించుకుంది.. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితమివ్వాలనుకుంది. అనుకున్నట్లుగానే.. తన జట్టుకు, దేశానికి మరపురాని విజయాన్నైతే అందించింది.. కానీ ఈ గెలుపు సంబరాన్ని తన తండ్రితో పంచుకోలేకపోయిందామె. అదే సమయంలో ఆయన ఈ లోకంలోనే లేడన్న చేదు నిజం తెలుసుకొని భోరున విలపించింది. ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో తన ఏకైక గోల్‌తో స్పెయిన్‌కు మరపురాని విజయాన్నందించిన ఓల్గా కార్మోనా కన్నీటి గాథ ఇది! తానే కాదు.. తన ఈ పరిస్థితి తెలుసుకున్న ఆమె అభిమానులూ శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా.. ఆత్మవిశ్వాసంతో జట్టును గెలిపించిన ఆమె అంకితభావాన్ని ప్రపంచమంతా ప్రశంసిస్తోంది.

ఒక్క గోల్‌.. రెండు రికార్డులు!

సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌-స్పెయిన్‌ల మధ్య జరిగిన ఫిఫా మహిళల ప్రపంచకప్‌ తుది పోరులో నమోదైంది ఒకే ఒక్క గోల్‌. అది కూడా ఆఖరి నిమిషంలో స్పెయిన్‌ కెప్టెన్‌ ఓల్గా కొట్టిన గోల్‌! ఈ ఏకైక గోల్‌తో జట్టుకు మరపురాని విజయాన్ని అందించడమే కాదు.. ఫుట్‌బాల్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుందీ స్పానిష్‌ ప్లేయర్‌. ‘ఫిఫా మహిళల ప్రపంచకప్‌’ ఒకే సీజన్లో సెమీస్‌, ఫైనల్‌.. రెండు మ్యాచుల్లోనూ గోల్స్‌ నమోదు చేసిన రెండో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది ఓల్గా. అంతకుముందు అమెరికన్‌ సాకర్‌ క్రీడాకారిణి అలెక్స్‌ మోర్గాన్‌ ఈ ఫీట్‌ నమోదు చేసింది. ఇక ‘సీనియర్‌ ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌’లో గోల్‌ చేసిన రెండో స్పానిష్‌ ప్లేయర్‌గానూ రికార్డులకెక్కింది ఓల్గా. తద్వారా ఇదే దేశానికి చెందిన ఆండ్రెస్‌ ఇనియెస్టా సరసన చేరిందామె.

కూతురి విజయం చూడకముందే..!

సాధారణంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే.. పనులన్నీ మానుకొని వాళ్ల పక్కనే ఉండాలనుకుంటాం. కానీ తన తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి బెడ్‌పై ఉన్నా.. టోర్నీకే ప్రాధాన్యమిచ్చింది ఓల్గా. మరోవైపు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా తోడవడంతో.. బాధను దిగమింగుకొని ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో పాల్గొందామె. టోర్నీ ఆసాంతం కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాదు.. సెమీస్‌, ఫైనల్లో గోల్స్‌ సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇలా పూర్తి అంకితభావంతో ఆమె సాధించిన గెలుపు సంబరాల్ని తన తండ్రితో పంచుకోవాలనుకుందామె. మ్యాచ్‌ ముగిసిన అనంతరం తన టీషర్ట్‌పై ‘MERCHI’ అని రాసున్న సందేశాన్ని చూపించి.. ఇటీవలే తల్లిని కోల్పోయిన తన స్నేహితురాలిని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆపై మైదానంలో ప్రపంచకప్‌ అందుకుంటూ, జట్టుతో కలిసి సంబరాలు చేసుకున్న తర్వాత తన తండ్రి మరణవార్త ఓల్గా చెవిన పడింది. దాంతో ఒక్కసారిగా భోరున విలపించిందామె. నిజానికి ఆమె తండ్రి ఫైనల్‌కు రెండ్రోజుల ముందే చనిపోయారట! కానీ టోర్నీ ముగిశాకే ఈ చేదు నిజం ఓల్గాతో చెప్పాలని నిర్ణయించుకున్నారట ఆమె కుటుంబ సభ్యులు.

‘మ్యాచ్‌ ప్రారంభానికి ముందే నా మనసు కీడు శంకించింది. ఎందుకో అప్పుడు నాకు అర్థం కాలేదు. నాన్నా.. నువ్విచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ ప్రత్యేకమైన గెలుపు నా సొంతమైంది. నువ్వెక్కడున్నా ఫైనల్‌ మ్యాచ్‌లో నా క్రీడా ప్రదర్శన చూశావని, గర్వపడి ఉంటావని నా మనసు చెబుతోంది.. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ డాడ్‌!’ అంటూ తన తండ్రికి అశ్రునయనాలతో వీడ్కోలు పలికింది ఓల్గా. ఇలా ఆమె కన్నీటి కథ ఎంతోమందిని భావోద్వేగానికి గురి చేస్తోంది. బాధను దిగమింగుకొని మరీ ఆమె చేసిన అద్భుత ప్రదర్శనను, ఆమె అంకితభావాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.

అన్నయ్య స్ఫూర్తితో..!

స్పెయిన్‌లోని సెవిల్ నగరంలో పుట్టి పెరిగింది ఓల్గా. తన అన్నయ్య ఫ్రాన్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. ఆయన స్ఫూర్తితోనే ఈ క్రీడపై మక్కువ పెంచుకున్న ఓల్గా.. ఆరేళ్ల వయసులోనే ఇందులో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. అయితే ఈత, టెన్నిస్‌, ఫ్లామెన్సో డ్యాన్సింగ్‌.. అన్నా ఆమెకు ప్రాణమట! చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఈ మూడింట్లోనే ఏదో ఒకదాన్ని ఓల్గా కెరీర్‌గా ఎంచుకుంటుందని అనుకున్నారట! కానీ వీటిని కాదని సాకర్‌ను ఎంచుకున్న ఆమె.. తొలుత ‘సెవిల్ సి’ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో చేరింది. 2020లో ‘రియల్‌ మ్యాడ్రిడ్‌’ మహిళల ఫుట్‌బాల్‌ క్లబ్‌కు మారిన ఈ స్పానిష్‌ సాకర్‌ ప్లేయర్‌.. 2018లో జాతీయ జట్టులోకి ప్రవేశించింది. అదే ఏడాది జరిగిన అండర్‌-19 ‘యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌’ టోర్నీలో గెలుపొంది.. మొత్తం పది మ్యాచుల్లో నాలుగు గోల్స్‌తో ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందీ ఫిఫా క్వీన్‌. ఆపై అండర్‌-23 ‘యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌’, ఇటీవలే ముగిసిన ‘ఫిఫా మహిళల ప్రపంచకప్‌’ల్లోనూ సత్తా చాటింది ఓల్గా. ఇలా ఆటతోనే కాదు.. తన అందచందాలతోనూ కట్టిపడేసే ఈ చక్కనమ్మకు.. ట్రావెలింగ్‌, బీచ్‌లంటే ఇష్టమట! ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. లక్షల కొద్దీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుందీ స్పెయిన్‌ బ్యూటీ.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని