Updated : 21/11/2022 15:40 IST

Amrit Mahotsav: వక్షోజాలపై కత్తెర పెట్టినా బెదరలేదు!

‘ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం..’ అన్నాడో కవి. 75 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది.. మనం అనుభవిస్తోన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల వెనుక ఎంతోమంది వీరులు, వీర నారీమణుల త్యాగం ఉంది. యుద్ధంలో తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యజించడమే కాదు.. బ్రిటిష్‌ వారికి తొత్తులుగా, దేశానికి చీడపీడగా మారిన తమ కుటుంబ సభ్యుల్ని హతమార్చడానికీ వెనకాడలేదు కొందరు నారీమణులు. అలాంటి వారిలో నీరా ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్ ఫౌజ్‌’ సైన్యంలో చేరిన ఆమె.. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. ‘దేశ తొలి మహిళా గూఢచారి’గానూ పేరుపొందారు. ఒకానొక దశలో దేశద్రోహిగా మారిన తన భర్తను హతమార్చడానికీ వెనకాడలేదామె. ఆఖరికి బ్రిటిష్‌ వారి చేతికి చిక్కి నరకయాతన అనుభవించిన ఆమె చేసిన స్వాతంత్ర్య పోరాటం గురించి తెలిసిన వారు చాలా తక్కువమందే! ఈ ‘అమృత మహోత్సవాల’ వేళ ఈ ధీర వనిత నాటి పోరాటాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం..!

మన దేశంలో బ్రిటిష్‌ వారు పరిపాలన సాగిస్తున్న రోజులవి! అదే సమయంలో పుట్టింది నీరా ఆర్య. 1902, మార్చి 5న ఉత్తరప్రదేశ్‌లోని ఖేక్రా అనే గ్రామంలో జన్మించిందామె. అయితే ఆమెకు ఐదేళ్లున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు మరణించడంతో.. కోల్‌కతాకు చెందిన పేరుమోసిన వ్యాపారి సేత్‌ ఛాజుమాల్‌ నీరాను దత్తత తీసుకున్నారు. దీంతో అప్పట్నుంచి ఆమె కూడా కోల్‌కతాలోనే ఉంటూ చదువు కొనసాగించింది.

దేశభక్తి అపారం!

తండ్రి వ్యాపారరీత్యా ఆయనతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేది నీరా. దీంతో హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ.. వంటి భాషల్ని ఒంటబట్టించుకుంది. చిన్న వయసు నుంచే ఆమెలో దేశభక్తి ఉప్పొంగేది. దీనికి తోడు.. ఆ రోజుల్లో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొంటున్న సమరయోధుల్ని చూసి స్ఫూర్తి పొందిందామె. ఎప్పటికైనా తానూ స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకోవాలని కాంక్షించింది. కానీ ఆమె తండ్రి సేత్‌కి మాత్రం తన కూతురు ఇలా ఆలోచించడం నచ్చకపోయేది. అందుకే ఆమె ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టేలా.. త్వరగా పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అనుకున్నట్లుగానే బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలో విచారణ అధికారి అయిన శ్రీకాంత్‌ జైరంజన్‌ దాస్‌తో నీరా పెళ్లి జరిపించాడు.

‘తొలి మహిళా గూఢచారి’గా..!

పెళ్లైనా, తన భర్త బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలో పనిచేస్తున్నా.. తన ఆలోచన మాత్రం మార్చుకోలేదు నీరా. దేశ స్వాంతంత్ర్యం వైపే మొగ్గు చూపింది. ఈ మక్కువే ఆమెను నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్ ఫౌజ్‌’కు చెందిన ఝాన్సీ రెజిమెంట్‌లో సైనికురాలిగా చేరేలా ప్రోత్సహించింది. దేశ రక్షణ, స్వాతంత్ర్యంపై ఆమెకున్న ఆసక్తి అనతి కాలంలోనే ఆమెను బ్రిటిష్‌ రహస్యాలు తెలుసుకునే గూఢచారిగా నియమించేలా చేశాయి. అందుకే నీరాకు ‘దేశ తొలి మహిళా గూఢచారి’గానూ పేరుంది. అయితే తన భార్య నేతాజీ సైన్యంలో చేరిందని తెలుసుకున్న శ్రీకాంత్‌ ఆమెను వారించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం నేతాజీని హత్య చేయాల్సిందిగా శ్రీకాంత్‌ను ఆదేశించింది. అయినా వెన్ను చూపలేదు నీరా. ‘ఏదేమైనా నేతాజీని కాపాడుకుంటా’నని భర్త ఎదుట ప్రతినబూనింది.

నేతాజీ ప్రాణాలకు భర్త ప్రాణాలు అడ్డేసి..!

అయితే ఓరోజు నేతాజీ ఆచూకీ తెలుసుకున్న నీరా భర్త శ్రీకాంత్.. ఆయనపై కాల్పులు జరిపాడు. తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న నేతాజీ ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో బుల్లెట్లు నేతాజీ డ్రైవర్‌కు తగిలాయి. అక్కడే ఉన్న నీరా దీని వెనకున్న అసలు నిజం తెలుసుకుంది. ‘ఎప్పటికైనా నా భర్తతో నేతాజీ ప్రాణాలకు ముప్పే!’ అని గ్రహించి.. అక్కడికక్కడే భర్త ప్రాణాలు తీసింది. అయితే ఈ పనిని నేతాజీ సమర్థించలేదు.. కాగా, హత్యా నేరం కింద బ్రిటిష్‌ ప్రభుత్వం నీరాను అరెస్ట్‌ చేసి ఎర్రకోటపై విచారించింది. ఆపై ఆమెను అండమాన్‌ జైలు (కాలాపాని జైలు)కు తరలించారు. అక్కడే ఆమెకు జీవిత ఖైదు విధించారు.

జైలులో నరకయాతన!

రాక్షసుల చెరకు చిక్కిన లేడి పిల్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో.. అండమాన్‌ జైల్లో బ్రిటిష్‌ సైనికుల చేతుల్లో నీరా పడిన నరకయాతన అంతకు ఎన్నో రెట్లు ఎక్కువని చెప్పచ్చు. ఈ క్రమంలో తాను అనుభవించిన చేదు అనుభవాల్ని, కష్టాల్ని ఉర్దూ కవి ఫర్హాన్‌ తాజ్‌తో పంచుకోగా.. ఆయన వాటితో ఓ నవలనే రాశారు. ఇందులో భాగంగా.. తనకెదురైన ఓ హృదయ విదారక ఘటన గురించి నీరా ఇలా పంచుకుంది..

‘విచారణ ముగిశాక నన్ను అండమాన్‌ జైలుకి తీసుకెళ్లారు. అక్కడ నాలా ఎంతోమందిని గాలి, వెలుతురు లేని చిన్న గదిలో గొలుసులతో బంధించారు. అయినా అందుకు నేను బాధపడలేదు. నా ఆలోచనంతా ‘సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపం నుంచి బయటపడి తిరిగి స్వాంతంత్ర్య పోరాటంలో పాలుపంచుకునేదెలా?’ అన్న దానిపైనే ఉండేది. చలికి వణుకుతున్న నాపై ఇద్దరు గార్డులు రెండు బ్లాంకెట్స్‌ విసిరేశారు. కానీ వాటిని తీసుకొని కప్పుకునే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే నా చేతులు, కాళ్లు, మెడకు బలమైన సంకెళ్లు వేసి బంధించారు. అదే సమయంలో ఓ కమ్మరి నా వద్దకు రావడం కాస్త ఊరట కలిగించింది. అతను నా చేతి గొలుసులను కత్తిరించే క్రమంలో నా చర్మం కూడా కొంత కట్‌ అయింది.. కాలి గొలుసులు తొలగించే యత్నంలో కావాలనే రెండుమూడుసార్లు సుత్తితో నా ఎముకలపై బలంగా కొట్టాడు. ఆ నొప్పిని ఇసుమంతైనా ఓర్చుకోలేకపోయా. అక్కడ నేనో బానిసనని నాకు అర్థమైంది.

వక్షోజాలపై కత్తెర పెట్టినా..!

ఈ తతంగమంతా అక్కడే ఉన్న జైలర్‌ చూశాడు. నా వద్దకొచ్చి.. ‘నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు.. నిన్ను వదిలేస్తాం.. నీకు ఈ బాధల నుంచి విముక్తి కల్పిస్తాం..’ అన్నాడు. ‘నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారు.. ఈ విషయం అందరికీ తెలుసు.. నీకు తెలియదా?’ అని బదులిచ్చా. అయినా నా మాటలు నమ్మక మరోసారి అదే ప్రశ్న వేశాడు. ‘అవును.. నేతాజీ బతికే ఉన్నాడు.. ఎక్కడో కాదు.. నా గుండెల్లో.. నా ఆలోచనల్లో!’ అని ఆక్రోశంతో జవాబిచ్చా. అయితే నీ గుండెల్లోంచి అతడిని శాశ్వతంగా తొలగిస్తామని.. నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నా కుడి వక్షోజం కత్తిరించే ప్రయత్నం చేశారు. కత్తెర పదునుగా లేకపోవడం వల్ల వాళ్ల ప్రయత్నం విఫలమైంది. కానీ ఆ నొప్పిని మాత్రం నేను భరించలేకపోయా. ఆ తర్వాత జైలర్‌ అక్కడే ఉన్న ఓ పరికరంతో నన్ను బలంగా కొట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయారు..’ అంటూ తన విషాద జైలు జీవితం గురించి పంచుకుంది నీరా.

ఇలా రోజుకో గండాన్ని దాటుకుంటూ వచ్చిన ఆమెకు.. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత విముక్తి లభించింది. ఆపై హైదరాబాద్‌కు చేరుకున్న నీరా.. ఇక్కడే పువ్వులమ్ముతూ జీవితం సాగించింది. అయితే ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుందన్న నెపంతో.. ఆపై ఆమె ఇంటిని ప్రభుత్వం కూల్చివేసింది. 1998, జులై 26న తుది శ్వాస విడిచిందీ ధీర. చైనాకు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత ఝాంగ్‌ హుయ్‌హువాంగ్‌ నీరా జీవితకథ ‘ఫస్ట్‌ లేడీ స్పై’ అనే పుస్తకం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు గతంలో ఓ ప్రకటన చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని