21 సార్లు ఐవీఎఫ్‌ విఫలమైనా.. అలా తల్లైంది!

అమ్మతనంతోనే మహిళల జీవితం పరిపూర్ణమవుతుంది. కానీ కొంతమంది ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల రీత్యా సహజంగా ఆ అదృష్టానికి నోచుకోలేకపోతారు. ఈ క్రమంలోనే వివిధ రకాల వైద్య చికిత్సల్ని ఆశ్రయించి.. ఎట్టకేలకు మాతృత్వంలోకి....

Published : 06 Jun 2023 12:04 IST

(Photos: Instagram)

అమ్మతనంతోనే మహిళల జీవితం పరిపూర్ణమవుతుంది. కానీ కొంతమంది ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల రీత్యా సహజంగా ఆ అదృష్టానికి నోచుకోలేకపోతారు. ఈ క్రమంలోనే వివిధ రకాల వైద్య చికిత్సల్ని ఆశ్రయించి.. ఎట్టకేలకు మాతృత్వంలోకి అడుగుపెడుతుంటారు. స్కాట్లాండ్‌కు చెందిన హెలెన్‌ డల్‌గ్లిష్‌ అనే మహిళ కూడా అలా ఒకటి కాదు, రెండు కాదు.. పాతికేళ్ల పాటు సంతానం కోసం ఎదురుచూసింది.. తల్లికావాలని 21 సార్లు ఐవీఎఫ్‌ చేయించుకుంది.. ఇలా చేసిన ప్రతిసారీ ఫలితం ఆమెకు ప్రతికూలంగానే వచ్చింది. అయినా తన మనసులో ఏదో మూల కచ్చితంగా తల్లినవుతానన్న చిన్న ఆశ! ఆ కలే ఫలించి 53 ఏళ్ల వయసులో అమ్మైంది హెలెన్‌. ‘ఐవీఎఫ్‌ ఫెయిలైన ప్రతిసారీ అంతులేని మానసిక క్షోభ అనుభవించానంటో’న్న ఆమె మాతృత్వపు జర్నీ.. సంతానం కోసం పరితపించే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం!

హెలెన్‌ది స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం. కెరీర్‌ దృష్ట్యా తన 20 ఏళ్ల వయసులో సైప్రస్‌కు వెళ్లిపోయిన ఆమె.. అక్కడే ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక ఏ మహిళ అయినా పిల్లల కోసం ఆరాటపడుతుంది. వివాహం తర్వాత హెలెన్‌ కూడా తన భర్తతో కలిసి సంతానం కోసం ప్లాన్‌ చేసుకుంది. అయితే ఎంత ప్రయత్నించినా పిల్లలు కాకపోయే సరికి భార్యాభర్తలిద్దరూ సంబంధిత పరీక్షలన్నీ చేయించుకున్నారు. కానీ వారికి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలేంటో ఆ పరీక్షల్లో వెల్లడి కాలేదు.

ఐవీఎఫ్‌తోనూ ఫలించని ఆశలు..!

దీంతో మరో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది హెలెన్‌. అక్కడే ఆమె గర్భసంచి స్థానంలో తేడాలున్నాయన్న విషయం తెలిసింది. ఆపై నాలుగుసార్లు ఐయూఐ ప్రయత్నించినా.. సక్సెస్‌ కాకపోయే సరికి ఐవీఎఫ్‌ పద్ధతికి మారాలని నిర్ణయించుకున్నారు హెలెన్‌ దంపతులు. ఇలా తన 28 ఏళ్ల వయసులో మొదలైన సంతాన ప్రయత్నాలకు గతేడాది తన 53 ఏళ్ల వయసులో ఓ పాపకు జన్మనివ్వడంతో తెరపడింది. అయితే ఈ మధ్యలో పలుమార్లు గర్భస్రావాలు, 21 సార్లు ఐవీఎఫ్‌ ఫెయిలైనా.. ఆశను మాత్రం వదులుకోలేదంటోంది హెలెన్‌.

‘ఎంత త్వరగా అమ్మను కావాలనుకునేదాన్నో.. నా ప్రయత్నాలు అంతగా విఫలమవుతూ వచ్చాయి. ఒక్కోసారి ఐవీఎఫ్‌ ఫెయిలవుతున్నప్పుడల్లా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో కుంగిపోయాను. కొన్నిసార్లు డాక్టర్ల సలహా మేరకు ఏడాది, రెండేళ్ల పాటు సంతాన ప్రయత్నాలకు విరామం ఇవ్వాల్సి వచ్చేది. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనల్ని అధిగమించడానికి యోగా, ధ్యానం, ఆరోగ్యంపై దృష్టి పెట్టేదాన్ని. విఫలమైన ప్రతిసారీ ఏదో ఒక రోజు కచ్చితంగా అమ్మనవుతానన్న ఆశ నన్ను ముందుకు నడిపించేది. గత వైఫల్యానికి సంబంధించిన బాధను అధిగమించి మరో ఐవీఎఫ్‌కు సన్నద్ధమయ్యేదాన్ని. ఇక ఈ ప్రక్రియలో ఎంత నొప్పిని భరించానో నాకే తెలుసు! అయితే ఈ క్రమంలో 21 సార్లు ఐవీఎఫ్‌ చేయించుకుంటే.. మూడుసార్లు గర్భవతినయ్యా. దురదృష్టవశాత్తూ మూడుసార్లూ అబార్షన్‌ అయింది..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

అలా అమ్మైంది!

ఇలా పిల్లల కోసం ఎంతో శారీరక, మానసిక క్షోభను అనుభవించిన హెలెన్‌.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ తల్లినవ్వాలన్న ఆశను మాత్రం వదులుకోలేదు. ఆఖరి ప్రయత్నంగా సైప్రస్‌ నగరంలోని కైరెనియాలో ఉన్న ‘దున్యా ఫెర్టిలిటీ సెంటర్‌’ను సందర్శించిందామె. ఈ క్రమంలో ‘దాత అండాలతో మీరు తల్లయ్యే అవకాశాలున్నాయ’న్నారు అక్కడి వైద్యులు. ఆశలన్నీ సన్నగిల్లిన ఆ తరుణంలో డాక్టర్ల నిర్ణయానికి ఒప్పుకుంది హెలెన్‌. ఈసారి ప్రయత్నం సఫలమైంది. తన 53 ఏళ్ల వయసులో గతేడాది దైసీ గ్రేస్‌ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిందామె. ఇలా ఇన్నేళ్ల ప్రెగ్నెన్సీ చికిత్సల కోసం సుమారు కోటికి పైగా ఖర్చు చేసిందామె. అయితే తల్లినైన ఆ క్షణం ఇన్నేళ్లుగా తాను పడిన బాధనంతా మర్చిపోయానంటోంది హెలెన్‌.

‘పిల్లల కోసం 25 ఏళ్లుగా నేను చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది. గర్భవతినయ్యాక రోజురోజుకీ పెరుగుతోన్న నా పొట్టను నిమురుతూ నన్ను నేనే మైమరచిపోయేదాన్ని. ఇప్పటికీ నా బిడ్డను చూసినప్పుడల్లా నేను తల్లినయ్యానన్న విషయం నన్ను మరింత ఆనందానికి గురిచేస్తోంది. నా పాపాయి కోసం ఇన్నేళ్లు నేను పడిన కష్టమంతా క్షణాల్లో మర్చిపోగలుగుతున్నా..’ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది హెలెన్‌. ఇలా ఇటీవలే ఓ సందర్భంలో ఆమె తన ప్రెగ్నెన్సీ జర్నీని పంచుకోగా.. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీ పట్టుదల, ఆశావహ దృక్పథం.. సంతానం కోసం ఎదురుచూస్తోన్న ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి..!’ అని హెలెన్‌ను ప్రశంసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్