Published : 09/01/2023 15:32 IST

ఇవి ఉంటే కిచెన్‌లో పని ఈజీ!

ఎంత చేసినా కిచెన్‌లో పని ఓ పట్టాన పూర్తవదు. అలాగని ఇతర పనులు వదులుకొని ఎక్కువ సమయం వంటగదిలోనే ఉండిపోలేం. అయితే కొన్ని చిన్న చిన్న వస్తువులు/యాక్సెసరీస్‌ని అందుబాటులో ఉంచుకుంటే కిచెన్‌లో పని చకచకా పూర్తవుతుందంటున్నారు నిపుణులు. తద్వారా సమయమూ ఆదా అవుతుంది. అలాంటి కిచెన్‌ టూల్సే ఇవి!

పదార్థాలు అమర్చిన కవర్లను ప్యాక్‌ చేయడానికి లేదా సీల్‌ చేయడానికి చాలామంది రబ్బర్లను ఉపయోగిస్తుంటారు. అయితే పెద్ద పెద్ద ప్యాకింగ్‌ల కోసం ఇవి సరిపోకపోవచ్చు. కాబట్టి వాటికి బదులుగా కొన్ని సీలింగ్‌ క్లిప్స్‌ని హ్యాండీగా ఉంచుకుంటే పని సులువవుతుంది. వీటితో పాటు ప్యాకెట్‌ని పూర్తిగా సీల్‌ చేయడానికి ఓ ‘మినీ బ్యాగ్‌ సీలర్‌’ కూడా ఉపయోగపడుతుంది.

కొలతల స్పూన్లు, మిక్సింగ్‌ బౌల్స్‌ని అందుబాటులో ఉంచుకుంటే అవసరమున్నప్పుడు వెంటనే వాడుకోవచ్చు. తద్వారా కొలత సరిగ్గా సరిపోతుంది. తక్కువ పదార్థాల కోసం పెద్ద బౌల్స్‌ని వాడి పని పెంచుకోకుండా జాగ్రత్తపడచ్చు.

ఉడికించిన కాయగూరలు/పాస్తా/నూడుల్స్‌ వంటివి వడకట్టుకోవడానికి, చింతపండు రసం నుంచి గుజ్జును వేరు చేయడానికి.. చిన్న చిన్న రంధ్రాలున్న ఓ జల్లెడ లాంటి బౌల్‌ని అందుబాటులో ఉంచుకుంటే సరి! అయితే అది కూడా ప్లాస్టిక్‌ కంటే స్టీల్‌ది ఎంచుకోవడం మంచిది.

చిన్న చిన్న సీసాల దగ్గర్నుంచి పెద్ద క్యాన్ల దాకా సీల్‌ చేసిన మూత ఓపెన్‌ చేయాలంటే కాస్త కష్టపడాల్సిందే! అదే ఓ క్యాన్‌ ఓపెనర్ని చేతికి అనువుగా ఉంచుకున్నారంటే పని సులువవుతుంది. ప్రస్తుతం అన్ని రకాల మూతల్ని తెరవడానికి ‘మల్టీ-ఫంక్షన్‌ క్యాన్‌ ఓపెనర్లు’ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

వాడుతున్న కొద్దీ కిచెన్‌ కత్తులు పదును కోల్పోతాయి. అలాగని పదే పదే కత్తులు/కత్తెరలు పదును పెట్టే వాళ్ల దగ్గరికి వాటిని తీసుకెళ్లలేం. అదే ఇంట్లోనే ఓ ‘నైఫ్‌ షార్ప్‌నర్‌’ ఉంటే ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు.

కాయగూరలు, ఉల్లిపాయలు కట్‌ చేయడం పెద్ద పని. అదే ఓ ‘వెజిటబుల్‌ చాపర్‌’ ఉంటే ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా వాటిని తరుక్కోవచ్చు. అంతేనా.. టొమాటో ప్యూరీ వంటివి కూడా ఇదే చాపర్‌లో తయారుచేసుకోవచ్చు.

కొన్ని రకాల పదార్థాలు కలుపుకోవడానికి విస్క్‌/బీటర్‌ని ఉపయోగించడం మనకు అలవాటే! అయితే దీనివల్ల పని సులువే అయినా ఆ పిండి మిశ్రమాన్ని వదిలించడం మాత్రం కాస్త కష్టమే అని చెప్పచ్చు. అలాంటప్పుడు దాన్ని ఉపయోగించడానికి ముందే ‘విస్క్‌ వైపర్‌’ని తొడగాలి. విస్క్‌ని పట్టి ఉంచే ఈ వైపర్‌ని పని పూర్తయ్యాక తొలగించి.. ఆపై మరోసారి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

బేకింగ్‌ ప్యాన్స్‌, కుకీ షీట్స్‌, సలాడ్స్‌పై కొద్ది మొత్తంలో నూనెను స్ప్రే చేసుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఇందుకోసం ప్రస్తుతం ‘టేబుల్‌ టాప్‌ ఆయిల్‌ మిస్టర్లు’ మార్కెట్లో దొరుకుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని