Published : 16/11/2022 21:34 IST

చుండ్రును తగ్గించే హెయిర్ ప్యాక్స్!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మామూలే! ప్రత్యేకించి కొంతమందిలో శీతాకాలంలో చుండ్రు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. మరి, ఈ సమస్యకు హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్ ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

పెరుగు, నిమ్మరసంతో..

చుండ్రు సమస్యను తగ్గించడంలో పెరుగు, నిమ్మరసం పాత్ర కూడా కీలకమే. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. ఆపై ఆ మిశ్రమంలో పెరుగు వేస్తూ పేస్ట్ అయ్యేంత వరకు ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారం లేదా పదిహేను రోజులకోసారి పాటించడం వల్ల క్రమంగా చుండ్రు తగ్గుముఖం పడుతుంది.

మందారంతో..

మందార ఆకులు, పువ్వులలో ఉండే గుణాలు జుట్టు సమస్యల్ని తగ్గించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో ఎండబెట్టి పొడి చేసిన మందార ఆకులు, పువ్వుల పొడిని కొద్దిగా వేసి, ఈ మిశ్రమానికి కాస్త ఉసిరి పొడి, మెంతుల పొడి కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ మృదువైన పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. అలాగే ఈ హెయిర్‌ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలోనూ దోహదం చేస్తుంది.

మెంతులతో..

జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వీటిని కొన్ని హెయిర్ ప్యాక్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. చుండ్రును తగ్గించడానికి తయారుచేసుకొనే ప్యాక్‌లలో భాగంగా కూడా మెంతుల్ని వాడతారు. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగుతో పాటు ఒక్కో టేబుల్‌స్పూన్ చొప్పున ఆలివ్ నూనె, వెనిగర్, మెంతిపొడి.. వీటన్నింటినీ బాగా కలుపుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకొని రెండుమూడు గంటల పాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే బయటపడే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని