ఆమె పోరాటం హాస్టల్‌పై...

ఎటైనా వెళ్లి ఆలస్యంగా వస్తే తిట్లు... ఎటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు... ఎదుటివారి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా

Updated : 22 Nov 2022 15:58 IST
ఎటైనా వెళ్లి ఆలస్యంగా వస్తే తిట్లు... ఎటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు... ఎదుటివారి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా నిబంధనలు...  ఎన్నో ఆశలతో కళాశాలలో చేరిన ఆమెకు... ఆ సమస్యల్నీ ఎదురయ్యాయి. దాంతో పోరాటం మొదలుపెట్టింది. హైకోర్టు వరకూ వెళ్లి అబ్బాయిలతో సమానంగా హక్కులు కావాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఆమే కేరళకు చెందిన   అంజిత కే జోస్‌. ఆ విశేషాలేంటంటే...

అంజిత కే జోస్‌ది మధ్యతరగతి కుటుంబం. స్వస్థలం కేరళలోని వాయనాడ్‌. తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. వాయనాడ్‌లోనే ఇంటరు చదివింది. డిగ్రీ కోసం త్రిశూర్‌లోని కేరళవర్మ కళాశాలలో చేరింది. ఇది ఎయిడెడ్‌ కళాశాల. త్రిశూర్‌ నగరం కేరళ సాంస్కృతిక రాజధాని. ఇక్కడ అనేక సాహిత్య, ఇతర సామాజిక కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కేరళవర్మ కళాశాలలో విద్యార్థులను తరగతి నుంచి 3.30 గంటలకు వదిలేవారు. హాస్టల్‌ నిబంధనల ప్రకారం వారందరూ కచ్చితంగా 4.30గంటలకు హాస్టల్‌లో ఉండాలి. కొన్ని రోజుల్లో ఆరు గంటలకు హాస్టల్‌ గేట్‌ మూసేస్తారు. ఆదివారం కూడా విద్యార్థినులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు. దీంతో త్రిశూర్‌లో జరిగే చాలా కార్యక్రమాలకు వాళ్లు వెళ్లేవారు కాదు. ఒకవేళ ఎటైన వెళ్లి ఆలస్యంగా వస్తే... గేటు దగ్గర వాచ్‌మెన్‌ను ప్రాధేయపడాలి. ఆయన తలుపు తెరిచి వారిని వార్డెన్‌ గదిలోకి తీసుకెళ్లేవాడు. వార్డెన్‌ నుంచి తిట్లు. కానీ అదే కళాశాలలో చదివే అబ్బాయిలకు మాత్రం ఈ నిబంధనలు లేవు. అంజిత ఒకసారి అనారోగ్యానికి గురైనప్పుడు తరగతి గది నుంచి ఆస్పత్రికి వెళ్లింది. చెప్పకుండా వెళ్లిందని వార్డెన్‌ తిట్టింది. ఇటువంటి చేదు అనుభవాలు చాలా మంది విద్యార్థినులకు ఎదురయ్యాయి. పైగా విద్యార్థినులను రాజకీయ సమావేశాలు, చర్చల్లో పాల్గొనడం కూడా నిషేధమే. ‘ఎంతో నేర్చుకుందామని కేరళవర్మ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఈ నిబంధనలతో ఎప్పుడూ  నిరాశే మిగిలిందిత’ అని చెబుతుంది అంజిత.

పోరాడినా ఫలితం లేదు...
వీటన్నింటినీ ఎదిరించాలని ఎన్నోసార్లు తన మిత్రులతో చర్చించింది. ఆ నిబంధనలు సామాజికంగా ఎదగకుండా అడ్డుపడతాయని కళాశాల యాజమాన్యంతో రెండేళ్లపాటు పోరాడింది. అయినా ఫలితం లేదు. దీంతో ఆమె డిగ్రీ చివరి సంవత్సరంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం జాతీయ న్యాయ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న తన మిత్రుడు అర్జున్‌ ఆజాద్‌ సహాయం తీసుకుంది. అలా సూర్య బినాయ్‌ అనే న్యాయవాది సహాయంతో 2017లో ‘వసతి గృహాల్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు సమాన హక్కులు కల్పించాలని, క్రమశిక్షణ పేరుతో హక్కులకు భంగం కలిగించే నిబంధనలను తొలగించాలి’ అని కోరుతూ కేరళ హైకోర్టులో నాలుగు నిబంధనలపై వ్యాజ్యం దాఖలు చేసింది. రెండేళ్ల పాటు న్యాయస్థానం చుట్టూ తిరిగింది. చివరకు కోర్టు ఆ నాలుగింటిలో రెండింటిని కొట్టివేస్తూ ఇటీవలే తీర్పునిచ్చింది. విద్యార్థులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేలా, ఎప్పుడైనా సినిమాలకు వెళ్లేలా తీర్పు వెలువరించింది. ‘నేనిప్పటికీ విజయం సాధించానని అనుకోవడం లేదు. కేవలం రెండింటినే రద్దుచేసింది కోర్టు. హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్‌ కొన్ని సార్లు నాకు ఇబ్బంది కలిగించాలని చూసింది. కానీ వాటికి భయపడలేదు...’ అని చెప్పే అంజిత ప్రస్తుతం పుదుచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సోషల్‌ వర్క్‌లో పోస్ట్‌ గ్యాడ్యుయేషన్‌ చేస్తోంది.

 

‘నేనిప్పటికీ విజయం సాధించానని అనుకోవడం లేదు. కేవలం రెండింటినే రద్దుచేసింది కోర్టు. హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్‌ కొన్ని సార్లు నాకు ఇబ్బంది కలిగించాలని చూసింది. కానీ వాటికి భయపడలేదు...’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్