Breast Cancer: చికిత్స తర్వాత త్వరగా కోలుకోవాలంటే..

రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత ఈ మహమ్మారి బారి నుంచి బయటపడ్డామన్న ఆనందం కంటే.. జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధే చాలామందిలో కనిపిస్తుంటుంది. కానీ ఈ సమయంలో అలాంటి ప్రతికూల ఆలోచనలు తగవంటున్నారు నిపుణులు. పాజిటివిటీని పెంచుకొని, ఆరోగ్యకరమైన జీవనశైలిని....

Published : 18 Oct 2022 12:41 IST

రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత ఈ మహమ్మారి బారి నుంచి బయటపడ్డామన్న ఆనందం కంటే.. జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధే చాలామందిలో కనిపిస్తుంటుంది. కానీ ఈ సమయంలో అలాంటి ప్రతికూల ఆలోచనలు తగవంటున్నారు నిపుణులు. పాజిటివిటీని పెంచుకొని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా త్వరగా కోలుకోవడంతో పాటు మరోసారి ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అక్టోబర్‌ను ‘ప్రపంచ రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌ చికిత్స తర్వాత తిరిగి త్వరగా కోలుకోవాలంటే, జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.

రొమ్ము క్యాన్సర్‌.. చాపకింద నీరుగా విస్తరిస్తూ చాలామంది మహిళలపై విషం చిమ్ముతోందీ మహమ్మారి. మహిళల అందంలో ప్రధాన పాత్ర పోషించే వక్షోజాలపై ప్రతికూల ప్రభావం చూపే ఈ క్యాన్సర్‌ కారణంగా ఒక్కోసారి వాటిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం కూడా ఏర్పడచ్చు. ఈ చికిత్సనే మ్యాస్టెక్టమీగా పిలుస్తున్నారు. అదీ తొలి దశల్లో క్యాన్సర్ కణితిని గుర్తించినప్పుడే ఈ చికిత్స సాధ్యపడుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఒక శరీర అవయవాన్ని కోల్పోయి మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అయితే క్యాన్సర్‌ మళ్లీ రాకుండా చేయడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన చికిత్స అని.. శరీరంలో ఓ భాగాన్ని కోల్పోవడం బాధాకరమే అయినా, అంతకు మించి ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యమని క్యాన్సర్‌ను జయించిన మహిళల్లో ధైర్యం నింపుతున్నారు నిపుణులు.

బలవంత పెట్టద్దు!

క్యాన్సర్‌ చికిత్స తర్వాత అలసట, నీరసం.. వంటివి సహజంగా ఎదురయ్యేవే! అలాంటి సమయంలో ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు అంటే కష్టమే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో కొంతమంది మహిళలు ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయా పనులు చేయడానికి తమ శరీరాన్ని బలవంత పెడుతుంటారు. దానివల్ల మరింత నీరసించిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.. కాబట్టి క్యాన్సర్‌ చికిత్స తర్వాత ఏ పనైనా శరీరంపై ఒత్తిడి పడకుండా నెమ్మదిగా ప్రారంభించాలని చెబుతున్నారు. ఇలా రోజురోజు కొద్దికొద్దిగా పనిని పెంచుకుంటూ, ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఒత్తిడి లేకుండా సాఫీగా పనులన్నీ పూర్తవుతాయి.. తద్వారా కొన్ని రోజులకు గతంలోలాగే అన్ని పనులు చకచకా చేసుకోగలుగుతారు. జీవితం కూడా ఒక గాడిలో పడుతుంది.

ఆహారంతో పునరుత్తేజం!

ఎలాంటి అనారోగ్యం నుంచైనా బయటపడేసే శక్తి ఆహారానికి ఉందనడంలో సందేహం లేదు. అందుకే ఆయా చికిత్సల తర్వాత త్వరగా కోలుకోవడానికి పోషకాహార ఛార్ట్‌ని పేషెంట్స్‌కి అందిస్తుంటారు వైద్యులు. మ్యాస్టెక్టమీ, లంపెక్టమీ (రొమ్ములో ఏర్పడిన క్యాన్సర్ కణితిని తొలగించే చికిత్స).. వంటి క్యాన్సర్‌ చికిత్సల తర్వాత త్వరగా కోలుకోవడంలో కూడా ఆహారపుటలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో టొమాటో, బ్లూబెర్రీ, వాల్‌నట్స్, బ్రకలీ, ఆకుకూరలు.. వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే ఆహార పదార్థాల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచూ మెనూలో చేర్చుకుంటే తిరిగి క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తపడడంతో పాటు క్యాన్సర్‌ చికిత్స వల్ల తగ్గిన శరీర బరువును సైతం తిరిగి పొందచ్చు.

ఎలాంటి వ్యాయామాలు మంచివి?

కారణమేదైనా.. నీరసించిపోయిన శరీరాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలంటే అందుకు వ్యాయామం చక్కగా దోహదం చేస్తుంది. అందులోనూ క్యాన్సర్‌ చికిత్స తర్వాత వర్కవుట్‌ని తమ రొటీన్‌లో భాగం చేసుకున్న వారిలో మళ్లీ రొమ్ము క్యాన్సర్‌ తలెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పలు పరిశోధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి శ్వాస సంబంధిత వ్యాయామాలు, భుజాలు-చేతులతో చేసే చిన్న పాటి వ్యాయామాలు ఈ సమయంలో చేయడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే శారీరక శక్తిని తిరిగి పొందడానికి జుంబా లాంటి వర్కవుట్స్‌ చేయడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు. అయితే క్యాన్సర్‌ సర్జరీ తర్వాత వ్యాయామాలు ఎప్పుడు ప్రారంభించాలి? కుట్లపై ప్రభావం పడకుండా ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలు మాత్రం మీ ఆరోగ్య స్థితిని బట్టి ముందుగానే నిపుణులను అడిగి తెలుసుకొని ఆపై ఆచరించడం మంచిది. లేదంటే ఇతర ఇబ్బందులు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు.

లైంగికాసక్తి తగ్గకుండా!

ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు లైంగికాసక్తి తగ్గిపోవడం అనేది చాలామందిలో సహజంగా జరిగేదే! క్యాన్సర్‌ చికిత్స తర్వాత కూడా కొంతమంది మహిళల్లో ఇలాంటి సమస్యే వస్తుందంటున్నారు నిపుణులు. అందుకు ఆ చికిత్స వల్ల సుదీర్ఘకాలం పాటు అలసట-నీరసం వేధించడం, శారీరక మార్పులనే తలచుకుంటూ ఒత్తిడికి గురవడం.. వంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అయితే వీటిని అధిగమించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే అందుకు శృంగారం చక్కటి సాధనం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో దంపతులిద్దరూ మరింత సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించాలి. క్యాన్సర్‌ చికిత్స వల్ల శరీరమంతా పొడిబారిపోతుంది.. దీని ప్రభావం వెజైనాపై కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలో కలయిలో పాల్గొన్నప్పుడు నొప్పి లేకుండా లూబ్రికెంట్స్‌, మాయిశ్చరైజర్స్‌ వాడచ్చు.

ఎలా ఉన్నా అంగీకరించండి!

మ్యాస్టెక్టమీ చికిత్సలో భాగంగా క్యాన్సర్‌ బారిన పడిన రొమ్మును పూర్తిగా తొలగించడంతో కొంతమంది తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. శరీరంలో ఓ భాగాన్ని కోల్పోయామన్న బాధతో; సిగ్గు-బిడియంతో నలుగురిలోకీ వెళ్లడానికి జంకుతారు. ఇలాంటప్పుడే మన శరీరాన్ని మనం అంగీకరించాలని, ప్రేమించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్రాణాంతక మహమ్మారిని జయించే క్రమంలో ఇది సర్వసాధారణమే అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే శరీరంలో, జీవితంలో వచ్చిన మార్పుల్ని స్వీకరించాలి. అప్పుడే మన ఆలోచనలు సానుకూలత వైపు మళ్లుతాయి. మానసిక ఒత్తిడీ తగ్గుతుంది. ఇది తిరిగి కొత్త జీవితానికి బాటలు పరుస్తుంది.. జీవితంపై కొత్త ఆశలు చిగురించేలా, సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేలా చేస్తుంది.

ఇలా వక్షోజాన్ని తిరిగి పొందచ్చు!

క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా వక్షోజం కోల్పోయిన వారు దాని స్థానంలో తాత్కాలిక రొమ్మును అమర్చుకోవచ్చు. దీన్ని ‘బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీ’ అంటారు. ఇందులోనూ రెండు ఆప్షన్లున్నాయి. ఒకటి - ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా వక్షోజం ఆకృతి వచ్చేలా చేయడం.. రెండోది - బ్రెస్ట్ ప్రోస్థసిస్ ఉపయోగించడం. వైద్య నిపుణులను సంప్రదించి వారు సూచించే పద్ధతిని ఎంచుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని