Published : 26/09/2021 10:15 IST

పనికి తగ్గ ప్రతిఫలం.. ఆశించడంలో తప్పేముంది?!

అభిరుచితోనైనా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికైనా.. ఇలా కారణమేదైనా మనమంతా ఉద్యోగం చేసేది అంతిమంగా నెల జీతం కోసమే! అయితే మనకు అప్పగించిన బాధ్యతలు, వాటిని మనం సమర్థంగా నిర్వర్తించే విధానాన్ని బట్టే మన కెరీర్‌ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకొనే ఉద్యోగి పదోన్నతులు, జీతం పెంచడం.. వంటివి ఆయా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. అయితే కొన్ని సంస్థలు ఈ విషయాన్ని విస్మరించినా, ఆశించిన స్థాయిలో జీతం పెంచకపోయినా.. తిరిగి వారిని అడగడానికి మొహమాట పడుతుంటారు కొందరు ఉద్యోగులు. కానీ అలాంటి మొహమాటం, భయం అక్కర్లేదంటున్నారు నిపుణులు. నిజంగా మీ పనితనంతో మీరు సంతృప్తి పడితే.. ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టి తీసుకెళ్లి.. పనికి తగ్గ ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదంటున్నారు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

అంచనాల్ని అందుకోవాలి!

సంస్థలు ప్రతి ఉద్యోగిపై కొన్ని అంచనాలు పెట్టుకుంటాయి. వారి నైపుణ్యాలు, పనితనం, అనుభవాన్ని బట్టి వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూ పైఅధికారుల అంచనాల్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అయితే కొంతమంది ఉద్యోగులు తమ శక్తి మేర కష్టపడినప్పటికీ పనిలో ప్రాధాన్యతలపై దృష్టి పెట్టకుండా, పైఅధికారులు/బృంద సభ్యులు/టీమ్‌ లీడర్‌ని సంప్రదించకుండా తమకు నచ్చిన పని చేసుకుంటూ పోతుంటారు. ఇది కూడా ఒకరకంగా సంస్థ అంచనాల్ని అందుకోకపోవడమే అంటున్నారు నిపుణులు. ఫలితంగా మీరు ఎంత కష్టపడినా, పనిలో మెరుగైన ఫలితాలు సాధించినా ఆ సమయంలో అవి వారికి వృథాగా కనిపించచ్చు. ఇలాంటప్పుడు ‘మేము కష్టపడ్డాం.. అందుకు తగ్గ ప్రతిఫలం కావాలి’ అని అడగడం కూడా సరికాదు. కాబట్టి ముందుగా కంపెనీ మీపై పెట్టుకున్న అంచనాల్ని, మీకు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా, నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి చూడండి.. ఆ తర్వాత జీతం పెంచమని, పదోన్నతి కల్పించమని వారికో ప్రపోజల్‌ పెట్టినా దాన్ని వారు పరిగణనలోకి తీసుకునే అవకాశాలుంటాయి.

ఆతృత పనికి రాదు!

సహోద్యోగులకు పదోన్నతులు రావడం, జీతం పెరగడం కొంతమంది ఉద్యోగులు జీర్ణించుకోలేరు. ‘మేమూ వాళ్లతో సమానంగా పనిచేశాం.. అలాంటప్పుడు ఎందుకింత పక్షపాతం’ అన్న ధోరణి వాళ్లలో ఉంటుంది. అయితే వాళ్లలా మీకు జీతం పెరగకపోవడానికి/పదోన్నతి రాకపోవడానికి మీరు చేసే పనిలో, మీ ప్రవర్తనలో ఎక్కడో ఏదో ఒక లోపం ఉండి ఉండచ్చన్న విషయం అర్థం చేసుకోమంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. తద్వారా అది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. అలాగే ఈ విషయంలో తొందర పడకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకునే దిశగా ముందుకు సాగాలి. ఇందుకోసం ఓ ఏడాది సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఈ క్రమంలో మీ పనికి సంబంధించిన కొన్ని లక్ష్యాల్ని పెట్టుకొని వాటిని సమర్థంగా నిర్వర్తించగలగాలి. అవసరమైతే ఈ క్రమంలో మీ సీనియర్స్‌/పైఅధికారుల సహకారం కూడా తీసుకోవచ్చు. ఎలాగూ దాదాపు అన్ని కంపెనీలు కనీసం ఏడాదికోసారైనా ఎంతో కొంత శాతం జీతం పెంచుతాయి కాబట్టి.. ఇలా మీరు చేసే పనిని, దానికి సంబంధించిన రిపోర్ట్‌ను పైఅధికారులకు సమర్పించి మీకు శాలరీ హైక్‌ ఇవ్వాల్సిందిగా కోరచ్చు.

అడగడానికీ ఓ పద్ధతుంది!

నిజంగా మీరు చేస్తోన్న పని, సంస్థ అభివృద్ధి విషయంలో నిర్వర్తిస్తోన్న బాధ్యతలు మీకు సంతృప్తినిస్తే మీకు జీతం పెంపు కావాలని, పదోన్నతి కల్పించాలని అడగడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అయితే అందుకూ ఓ పద్ధతుందంటున్నారు. ఇతరులకు జీతం పెంచారు.. మాకు పెంచలేదన్న కోపాన్ని ప్రదర్శించడం, పైఅధికారులతో కస్సుబస్సులాడడం.. అస్సలు సరికాదు. పైగా ఇలాంటి మీ ప్రవర్తన వల్ల మీ కెరీర్‌కే మచ్చ రావచ్చు. అందుకే కాస్త ఓపిక వహించి మీరు చేసిన పనికి సంబంధించి ఎప్పటికప్పుడు పొందుపరిచిన రిపోర్టులు, ఉత్పాదకతకు సంబంధించిన రుజువుల్ని మర్యాద పూర్వకంగా మీ పైఅధికారులకు సమర్పించండి. తద్వారా మీ ప్రొఫెషనలిజాన్ని, మీ ప్రవర్తనను, మీ పనితనాన్ని బట్టి తప్పకుండా మీకు శాలరీ హైక్‌/ ప్రమోషన్‌.. వంటివి అందించే అవకాశాలుంటాయి.

వాటిని ఎరగా వేయద్దు!

కొంతమంది తమ కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడానికి, ఆర్థిక అవసరాలకు వచ్చే జీతం సరిపోకపోవచ్చు. ఇలాంటప్పుడు జీతం పెంచమని అడిగే క్రమంలో ఈ విషయాలను అధికారుల వద్ద ప్రస్తావించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల వారికి మీపై నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడచ్చు. అంతేకాదు.. మీరున్నది సమస్యల్లోనే అయినా.. వీటినే ఎరగా వేసి పదోన్నతి కొట్టేయాలని/జీతం పెంచుకోవాలని మీరు చూస్తున్నట్లుగా వాళ్లు భావించే అవకాశమూ లేకపోలేదు. దీని ప్రభావం అంతింగా పడేది మీ కెరీర్‌పైనే! కాబట్టి వృత్తిపరమైన జీవితంలోకి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను లాగకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

* జీతం పెంపు, పదోన్నతుల గురించి అర్జీ పెట్టుకునే ముందు సంస్థ నియమనిబంధనల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. అంటే.. మీరు పనిచేసే సంస్థలో ఎన్నేళ్లకోసారి శాలరీ హైక్‌, పదోన్నతులు కల్పిస్తున్నారు వంటివి తెలుసుకోవడం ముఖ్యం.

* ఒక్కోసారి మీ పనితనం బాగున్నా, మీరు పైఅధికారుల అంచనాల్ని అందుకున్నా.. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశ పడకుండా, మీ పనిలో నాణ్యతను తగ్గించుకుండా ముందుకు సాగితే మరోసారి తప్పకుండా ఇంతకంటే విలువైన ఫలితం పొందగలుగుతారు.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి