Published : 21/11/2022 19:41 IST

మస్కారా.. ఇవి గుర్తు పెట్టుకోండి!

కళ్లు, ప్రత్యేకించి కనురెప్పలు మరింత అందంగా కనిపించడం కోసం మస్కారా వాడడం తెలిసిందే. అయితే నిత్యం క్రమం తప్పకుండా దీనిని ఉపయోగించడం మాత్రం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఒకవేళ వాడాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దంటున్నారు.

⚜ కనురెప్పలకు పోషణనందించడానికి, అవి పొడిబారకుండా చేయడానికి మస్కారా పెట్టుకునే ముందు మస్కారా ప్రైమర్‌ కూడా అప్లై చేయచ్చు. ఫలితంగా రెప్పలు ఒత్తుగా, అందంగా కనిపిస్తాయి.

⚜ ఫార్మాల్డిహైడ్‌, సింథటిక్‌, టార్‌ డైస్‌.. వంటి పదార్థాలు ఉపయోగించి తయారుచేసిన మస్కారాలు అస్సలు వాడకూడదు.

⚜ సాధారణంగా మేకప్‌ ఉత్పత్తుల్ని ఏడాదికోసారి మార్చాల్సి ఉంటుంది. అదే మస్కారానైతే ఆరు నెలలకోసారి మార్చమంటున్నారు నిపుణులు. అందుకే కొనే ముందే అవి ఎప్పుడు తయారయ్యాయి.. గడువు ఎప్పటి వరకు ఉంది.. వంటి విషయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాల్సి ఉంటుంది.

⚜ కనురెప్పలు ఒత్తుగా పెరగాలన్నా, మస్కారా ప్రభావం వాటిపై పడకుండా ఉండాలన్నా.. చక్కటి పోషకాహారం తీసుకోవడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ‘డి’, ‘ఇ’ విటమిన్లు అధికంగా లభించే చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు.. వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవాలి.

⚜ మస్కారా కండిషనర్లు కూడా ప్రస్తుతం బయట దొరుకుతున్నాయి. వాటిలో నాణ్యమైనది ఎంచుకుంటే కనురెప్పల్ని తేమగా ఉంచుకోవచ్చు.. ఒత్తుగా పెరిగేలా చేయచ్చు.

⚜ కేవలం మస్కారా మాత్రమే అప్లై చేసుకున్నప్పటికీ రాత్రి పడుకునే ముందు తొలగించుకోవడం మర్చిపోవద్దు.

⚜ అలాగే మస్కారా బ్రష్‌లను కూడా వాడిన ప్రతిసారీ శుభ్రం చేయాల్సిందే! ఇదేం పెద్ద పని కాదు.. సింపుల్‌గా వాటిని టిష్యూతో తుడిచేస్తే సరిపోతుంది.

వీటితో పాటు విటమిన్లు ‘డి’, ‘ఇ’, బయోటిన్‌.. వంటి సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు. అయితే అది కూడా నిపుణుల సలహా తీసుకున్నాకే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని