Published : 27/06/2022 20:23 IST

రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే..

నిద్ర లేవగానే హడావిడిగా, టెన్షన్‌గా రోజును ప్రారంభిస్తే ఇక ఆ రోజంతా ఎప్పుడు గడిచిపోతుందా అన్నట్లుగా ఉంటుంది.. అదే హ్యాపీగా, పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో మొదలుపెట్టామంటే సమయమే తెలియకుండా ఆ రోజులోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేయచ్చు. అందుకు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

మొబైల్‌ మొహం చూడద్దు!

నిద్ర లేవగానే దేవుడి పటాన్ని చూడడమో లేదంటే మన ముఖమే అద్దంలో చూసుకోవడమో అదీ కాదంటే కుటుంబ సభ్యుల మొహం చూడడమో.. ఇలా చేయడం చాలామందికి అలవాటు! అయితే రోజులు మారే కొద్దీ ఈ అలవాటు కూడా మారిపోతోంది. ఈ రోజుల్లో అయితే చాలామంది కళ్లు తెరవగానే పక్కనున్న మొబైల్‌ ఫోన్‌నే చూస్తున్నారు. రాత్రి నుంచి ఎవరి నుంచి ఏయే సందేశాలొచ్చాయి? వాట్సప్‌ మెసేజెస్‌ ఏంటి? ఈ రోజు వార్తలేంటి? వంటివన్నీ చెక్‌ చేస్తున్నారు. దీంతో ఏదో ఒక చేదు వార్త కంట పడడం, దాంతో తీవ్ర ఒత్తిడికి లోను కావడం.. ప్రస్తుతం చాలామందిలో ఇలాంటి ఆందోళనే నెలకొందంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం లేవగానే మొబైల్‌ పక్కన పెట్టేసి.. లేలేత సూర్యకిరణాలు పడే చోట కాసేపు పచ్చగడ్డిపై అలా నడవడం.. నచ్చిన వర్కవుట్‌ చేయడం.. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం.. ఇలా ఇవన్నీ మనలో పాజిటివిటీ నింపే అంశాలే అంటున్నారు! ఫలితంగా మనసుకు ఏదో తెలియని ఉత్సాహం కలిగి.. ఆ రోజంతా సంతోషంగా గడిపేయచ్చంటున్నారు.

నిమ్మరసంతో షురూ!

శరీరం యాక్టివ్‌గా ఉన్నప్పుడే మనసులో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అయితే ఆ యాక్టివ్‌నెస్‌ అనేది రోజులో మనం తీసుకునే తొలి ఆహారం/పానీయంపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో టీ/కాఫీలకు బదులు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందంటున్నారు. టీ/కాఫీ తాగే అలవాటున్న వారు నిమ్మరసం తాగిన తర్వాత ఓ అరగంట/గంట వ్యవధిలో వాటిని తాగచ్చు. ఇలా నిద్ర లేచి బ్రష్‌ చేసుకున్న వెంటనే నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదురవకుండా రోజంతా పాజిటివ్‌గా, సంతోషంగా గడిపేయచ్చు.

ఒళ్లు విరవాల్సిందే!

రాత్రిళ్లు పడుకోవడం ఆలస్యం.. నిద్ర లేవడమూ లేటే! దాంతో హడావిడిగా రోజువారీ పనుల్లోకి దూరిపోవడం.. ఇది చాలామందికి అలవాటే! దాంతో ఉదయం పనులన్నీ పూర్తయ్యే సరికి నీరసం వచ్చేస్తుంది. ఏదో నెగెటివిటీ మన మనసును చుట్టేస్తుంది.. ఇంకేముంది.. ఆ అలసటతోనే రోజంతా గడిచిపోతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. లేచీ లేవగానే ఒళ్లు విరవమంటున్నారు నిపుణులు. తద్వారా మనలో ఉన్న బద్ధకం వదిలిపోయి యాక్టివ్‌నెస్‌ మన దరి చేరుతుందట! ఇలా శారీరకంగా ఉత్సాహంగా ఉంటే మనసూ పాజిటివ్‌గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

నోట్‌ చేసుకుంటే ఈజీ అవుతుంది!

రోజులో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు బోలెడుంటాయి.. దీనికి తోడు ఇంటి పనులు! నిద్ర లేవగానే ఇవన్నీ తలచుకున్నామంటే ‘ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయో.. ఏమో!’ అన్న టెన్షన్‌ వచ్చేస్తుంది. దాంతో ఏ పని ఎప్పుడు పూర్తిచేయాలో అర్థం కాక ఆ రోజంతా అదే నెగెటివిటీతో గడిచిపోతుంది. అలాకాకుండా ఆ రోజులో చేయాల్సిన పనులేంటో, వాటిలో ముందుగా పూర్తిచేయాల్సినవేంటో నోట్‌ చేసుకుంటే పని సులభమవుతుంది. ఇలా పనుల్ని ఫిల్టర్‌ చేసుకోవడం వల్ల మనసుపై భారం కూడా తగ్గుతుంది. ఫలితంగా పాజిటివిటీతో ముందుకు సాగచ్చు.

ముస్తాబవడమూ ముఖ్యమే!

ఆఫీసుకు వెళ్లినా, ఇంటి నుంచి పని చేసినా- చక్కగా స్నానం చేసి, నీట్‌గా ముస్తాబైతే.. మన మనసులోకి ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. చేసే పనిపై శ్రద్ధ పెట్టగలుగుతాం.. పనులన్నీ చకచకా పూర్తవుతాయి.

సో.. ఇవండీ! రోజంతా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలంటే నిద్ర లేవగానే చేయాల్సిన, చేయకూడని కొన్ని పనులు! మరి, రోజంతా పాజిటివ్‌గా ఉండడానికి మీరేం చేస్తున్నారు? ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి.. మీరిచ్చే సలహాలు తోటివారికి ఉపయోగపడచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని