ఇలా చేస్తే రోజంతా పాజిటివ్‌గా గడిపేయచ్చు!

నిద్ర లేవగానే హడావిడిగా, టెన్షన్‌గా రోజును ప్రారంభిస్తే.. ఇక ఆ రోజంతా ఎప్పుడు గడిచిపోతుందా అన్నట్లుగా ఉంటుంది.. అదే హ్యాపీగా, పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో మొదలుపెట్టామంటే సమయమే తెలియకుండా....

Published : 25 Jun 2023 12:32 IST

నిద్ర లేవగానే హడావిడిగా, టెన్షన్‌గా రోజును ప్రారంభిస్తే.. ఇక ఆ రోజంతా ఎప్పుడు గడిచిపోతుందా అన్నట్లుగా ఉంటుంది.. అదే హ్యాపీగా, పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో మొదలుపెట్టామంటే సమయమే తెలియకుండా ఆ రోజులోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేయచ్చు. అందుకు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

మొబైల్‌ మొహం చూడద్దు!

నిద్ర లేవగానే దేవుడి పటాన్ని చూడడమో లేదంటే మన ముఖమే అద్దంలో చూసుకోవడమో.. చేస్తుంటాం. కానీ కొందరు కళ్లు తెరవగానే మొబైల్‌ పట్టుకుంటారు. రాత్రి నుంచి ఎవరి నుంచి ఏయే సందేశాలొచ్చాయి? వాట్సప్‌ మెసేజెస్‌ ఏంటి? ఈ రోజు వార్తలేంటి? వంటివన్నీ చెక్‌ చేస్తున్నారు. దీంతో ఏదో ఒక చేదు వార్త కంట పడడం, తీవ్ర ఒత్తిడికి లోనవడం.. ఇక ఆ రోజంతా ఆ కలవరంతోనే గడిచిపోతుంది. కాబట్టి ఉదయం లేవగానే మొబైల్‌ పక్కన పెట్టేసి.. లేలేత సూర్యకిరణాలు పడే చోట కాసేపు పచ్చగడ్డిపై అలా నడవడం.. నచ్చిన వర్కవుట్‌ చేయడం.. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం.. వంటివి చేయమంటున్నారు నిపుణులు. ఫలితంగా మనసులో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది. ఇదే ఆ రోజంతా మనల్ని సంతోషంగా, సానుకూల దృక్పథంతో ముందుకు నడిపిస్తుంది.

నిమ్మరసంతో షురూ!

శరీరం యాక్టివ్‌గా ఉన్నప్పుడే మనసులో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. అయితే ఆ యాక్టివ్‌నెస్‌ అనేది రోజులో మనం తీసుకునే తొలి ఆహారం/పానీయంపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో టీ/కాఫీలకు బదులు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందంటున్నారు. టీ/కాఫీ తాగే అలవాటున్న వారు నిమ్మరసం తాగిన తర్వాత ఓ అరగంట/గంట వ్యవధిలో వాటిని తాగచ్చు. ఇలా నిద్ర లేచి బ్రష్‌ చేసుకున్న వెంటనే నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రోజంతా పాజిటివ్‌గా, సంతోషంగా గడిపేయచ్చు.

ఒళ్లు విరవాల్సిందే!

రాత్రిళ్లు పడుకోవడం ఆలస్యం.. నిద్ర లేవడమూ లేటే! దాంతో హడావిడిగా రోజువారీ పనుల్లోకి దూరిపోవడం.. ఇది చాలామందికి అలవాటే! దాంతో ఉదయం పనులన్నీ పూర్తయ్యే సరికి నీరసం వచ్చేస్తుంది. ఏదో నెగెటివిటీ మన మనసును చుట్టేస్తుంది.. ఇంకేముంది.. ఆ అలసటతోనే రోజంతా గడిచిపోతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. లేచీ లేవగానే ఒళ్లు విరవమంటున్నారు నిపుణులు. తద్వారా మనలో ఉన్న బద్ధకం వదిలిపోయి యాక్టివ్‌నెస్‌ మన దరి చేరుతుందట! ఇలా శారీరకంగా ఉత్సాహంగా ఉంటే మనసూ పాజిటివ్‌గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

నోట్‌ చేసుకుంటే ఈజీ అవుతుంది!

రోజులో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు బోలెడుంటాయి.. దీనికి తోడు ఇంటి పనులు! నిద్ర లేవగానే ఇవన్నీ తలచుకున్నామంటే ‘ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయో.. ఏమో!’ అన్న టెన్షన్‌ వచ్చేస్తుంది. దాంతో ఏ పని ఎప్పుడు పూర్తిచేయాలో అర్థం కాక ఆ రోజంతా అదే నెగెటివిటీతో గడిచిపోతుంది. అలాకాకుండా ఆ రోజులో చేయాల్సిన పనులేంటో, వాటిలో ముందుగా పూర్తిచేయాల్సినవేంటో నోట్‌ చేసుకుంటే పని సులభమవుతుంది. ఇలా పనుల్ని ఫిల్టర్‌ చేసుకోవడం వల్ల మనసుపై భారం కూడా తగ్గుతుంది. ఫలితంగా పాజిటివిటీతో ముందుకు సాగచ్చు.

వీటితో పాటు మనకు నచ్చినట్లుగా రడీ అయి ఆఫీసుకెళ్తే.. మరింత ఉత్సాహంగా పనిపై శ్రద్ధ పెట్టచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి పని హడావిడిలో ఏదో రడీ అయ్యామా అన్నట్లుగా కాకుండా.. కాస్త సమయం కేటాయించి అందానికీ ప్రాధాన్యమివ్వడం ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని