Hina Khan: అటు నుంచి అటే.. కీమోథెరపీకి వెళ్లా!

క్యాన్సర్‌.. ఈ పేరే మనల్ని సగం చంపేస్తుంది. అలాంటిది ఈ వ్యాధిని సానుకూల దృక్పథంతో, ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటోంది బాలీవుడ్‌ నటి హీనా ఖాన్‌.

Published : 04 Jul 2024 21:19 IST

(Photos: Instagram)

క్యాన్సర్‌.. ఈ పేరే మనల్ని సగం చంపేస్తుంది. అలాంటిది ఈ వ్యాధిని సానుకూల దృక్పథంతో, ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటోంది బాలీవుడ్‌ నటి హీనా ఖాన్‌. ప్రస్తుతం తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవలే వెల్లడించిన ఆమె.. తాజాగా తన తొలి కీమోథెరపీ సెషన్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. జీవితం విసిరిన ఈ సవాలును ఎదుర్కొనేందుకు పాజిటివిటీనే అస్త్రంగా చేసుకున్నట్లు వెల్లడించిన ఈ ముద్దుగుమ్మ ధైర్యానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఇటీవలే ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంది హీనా. ఇరువైపులా స్లిట్స్‌ ఉన్న తెలుపు రంగు బాడీకాన్‌ డ్రస్‌లో రెడ్‌కార్పెట్‌పై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. విభిన్న యాంగిల్స్‌లో కెమెరాకు పోజిచ్చింది. నిజానికి అప్పటికే తనకు మూడో దశ రొమ్ము క్యాన్సర్‌ అని నిర్ధారణ అయినట్లు హీనాకు తెలుసు! అయినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, పాజిటివిటీతో, నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చిందామె.

ఇది సవాలు కాదు.. అవకాశం!

అయితే ఈ కార్యక్రమంలో తానూ ఓ కేటగిరీలో అవార్డు అందుకున్న హీనా.. వేడుక ముగిశాక అటు నుంచి అటే కీమోథెరపీ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ షార్ట్‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ చక్కనమ్మ.. తన భావోద్వేగాల్ని ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో పంచుకుంది.

‘ఈ అవార్డుల వేడుకకు ముందే నాకు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. అయితే ఇది విని బెంబేలెత్తిపోకుండా.. దీన్ని నార్మలైజ్‌ చేయాలనుకున్నా.. కేవలం నాకోసమే కాదు.. నాలాంటి ఎంతోమంది కోసం! నిజానికి నా జీవితాన్నే మార్చేసిన రోజు ఇది. నా జీవితం నాకు విసిరిన అత్యంత క్లిష్టమైన సవాళ్లలో రొమ్ము క్యాన్సర్‌ కూడా ఒకటి. అయితే దీన్ని నేను సవాలుగా కంటే నన్ను నేను కొత్తగా నిరూపించుకునేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నా. పాజిటివిటీతోనే ఈ సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా. కీమోథెరపీ, దీని తాలూకు అనుభవాల్నీ అత్యంత సాధారణంగా చూసేలా చేయాలనుకుంటున్నా.. అలాగే నేను కోరుకున్న ఫలితాన్నీ చేరుకోగలననే నమ్మకం నాకుంది. నా దృష్టిలో నా కెరీర్‌కు ఎంత ప్రాధాన్యమిస్తానో, వ్యక్తిగత జీవితాన్నీ అంతే ఇష్టపడతా. అంతేకానీ ఎక్కడా రాజీ పడను.. వెనక్కి తగ్గను. క్యాన్సర్‌ విషయంలోనూ అంతే! నా తొలి కీమో సెషన్‌కు ముందు నేను అందుకున్న ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. నేను ఏర్పరచుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతున్నానన్న భరోసానూ నాకు అందించింది. ఈవెంట్‌ ముగియగానే నేరుగా అటు నుంచి అటే నా తొలి కీమో సెషన్‌ కోసం ఆస్పత్రికి వెళ్లాను. నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సాధారణంగా చూడండి.. జీవితంలో మీకంటూ కొన్ని లక్ష్యాల్ని ఏర్పరచుకోండి.. వాటిని చేరుకోవడానికి కృషి చేయండి.. ఈ క్రమంలో ఆశల్ని వదులుకోవద్దు.. వెనక్కి తగ్గొద్దు..’ అంటూ తన మాటలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపిందీ బాలీవుడ్‌ బ్యూటీ.

హీనా.. నువ్వో వారియర్‌వి!

మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ.. ఈ క్లిష్టమైన దశని కూడా హీనా ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటోన్న తీరు ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అటు సెలబ్రిటీలతో పాటు ఇటు సామాన్యులూ స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘రాక్‌స్టార్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక హీనా పోస్ట్‌ చేసిన వీడియోపై టాలీవుడ్‌ బ్యూటీ సమంత కూడా స్పందించింది. ఈ వీడియోను, ఆమె పోస్ట్‌ను ట్యాగ్‌ చేసిన సామ్‌.. ‘హీనా.. నువ్వో వారియర్‌వి! నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా..’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది. దీనిపై స్పందించిన హీనా.. ‘సామ్‌.. జీవితం విసిరే సవాళ్లను సానుకూల దృక్పథంతో నువ్వు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం..’ అంటూ రాసుకొచ్చింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్