చరిత్ర సృష్టించారు!

ఒకటేమో పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మరొకటేమో లింగ వ్యత్యాసం అత్యల్పంగా ఉన్న దేశం... ఈ రెండు చోట్లా తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు నమ్మి పగ్గాలు అప్పజెప్పింది మహిళలకే. ఈ ఘనతను సాధించడంలో వారి పాత్ర ఏంటో? వారెవరో తెలుసుకుందామా! 

Published : 04 Jun 2024 01:05 IST

ఒకటేమో పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మరొకటేమో లింగ వ్యత్యాసం అత్యల్పంగా ఉన్న దేశం... ఈ రెండు చోట్లా తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు నమ్మి పగ్గాలు అప్పజెప్పింది మహిళలకే. ఈ ఘనతను సాధించడంలో వారి పాత్ర ఏంటో? వారెవరో తెలుసుకుందామా! 

నోబెల్‌ శాంతి బహుమతి అందుకుని... 

మెక్సికో... లాటిన్‌ ఆమెరికాలో అతిపెద్ద దేశం. అది ఎదుర్కొంటోన్న ముఖ్యమైన సవాళ్లలో మహిళా భద్రత ఒకటి. ఏ మూల చూసినా... స్త్రీలపై హింస, అఘాయిత్యాలు, దాడులే. అలాంటి ఇక్కడ... మొదటిసారి ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమే క్లాడియా షేన్‌బామ్‌. తనని తాను స్త్రీవాదిగా అభివర్ణించుకుంటారామె. క్లాడియా రాజకీయ నాయకురాలు కాకముందు విద్యావేత్త, పర్యావరణ శాస్త్రవేత్త కూడా. నేషనల్‌ అటానమస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెక్సికో నుంచి ఎనర్జీ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారామె. ఎనర్జీ, పర్యావరణం, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ మీద 100కు పైగా ఆర్టికల్స్‌ రాశారు. అంతేనా, 2007లో ఆమె ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై ఏర్పడిన ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(ఐపీసీసీ)లో చేరారు. ఈ బృందమే ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అయితే, ఇవన్నీ ఒకెత్తయితే 2018లో క్లాడియా రాజకీయాల్లో అడుగు  పెట్టిన నాటి నుంచీ తనదైన శైలిలో పాలనపై పట్టు సాధించారు. నేరాల కట్టడి, జోనింగ్‌ చట్టాలను అమలు చేయడం, విద్య,  పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాల్లో ఆమె విజయం సాధించారు. ఇవన్నీ ఆమె గెలుపునకు సోపానాలయ్యాయి. వామపక్ష భావజాలం ఉన్న మోరేనా ఫ్రంట్‌ తరఫున పోటీ చేసిన క్లాడియా షేన్‌బామ్, నేషనల్‌ యాక్షన్‌ పార్టీ అభ్యర్థి సోచిల్‌ గాల్వెజ్‌పై గెలిచారు. మెక్సికోకు తొలి మహిళా అధ్యక్షురాలిగానే కాదు... ఈ అవకాశం  అందుకున్న తొలి యూదు  వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. 


సంక్షోభం నుంచి బయటపడేసి...

లింగ సమానత్వ సూచీలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఐస్‌ల్యాండ్‌. ఈ దేశానికి మరోసారి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు హల్లా టోమస్‌ డోత్తిర్‌. ఆమె వ్యాపారవేత్త కూడా. 1980లో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షురాలిగా ఎన్నికై... ప్రపంచంలో తొలి మహిళగా గుర్తింపు పొందిన ఫిన్‌బోగాడోత్తిర్‌ తరవాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ ఈమె. ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఉందీ ద్వీపదేశం. నైతిక సూత్రాలతో కూడిన నూతన జాతీయ అసెంబ్లీ ఏర్పాటు చేస్తాననే హామీతో ఈ గెలుపు సాధించుకున్నారు హల్లా టోమస్‌. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న సమయంలో టోమస్‌డోత్తిర్‌ ఈ పదవిని అందుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ఒడర్‌ క్యాపిటల్‌ కోఫౌండర్‌. ఐస్‌ల్యాండ్‌ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయపడిన పెట్టుబడి సంస్థల్లో ఇదీ ఒకటి. టోమస్‌డోత్తిర్‌ మల్టీనేషనల్‌ ఎన్‌జీవో బీటీమ్‌ సీఈవోగానూ వ్యవహరిస్తున్నారు. 2016లో ఐస్‌ల్యాండ్‌ అధక్ష్యపదవికి పోటీ చేసి 27.9శాతం స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచారామె.  యువత మానసిక ఆరోగ్యంపై సోషల్‌ మీడియా ప్రభావం, పర్యటక కేంద్రంగా ఐస్‌ల్యాండ్‌ అభివృద్ధి, ఏఐ ప్రభావం వంటి విషయాల్లో ఆమె చేసిన ప్రసంగాలూ ప్రజలను ఆకట్టుకోవడంతో ఆవిడకీ పీఠం దక్కింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్