కాటుక.. ఇంట్లోనే ఇలా!

మేకప్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా సింపుల్‌గా కాటుకతో తమ లుక్‌ని పూర్తి చేయడం చాలామంది అమ్మాయిలకు అలవాటు! కంటిని ఇంపుగా తీర్చిదిద్దడంతో పాటు సహజసిద్ధమైన అందాన్ని అందించడం దీని ప్రత్యేకత. అయితే బయట దొరికే కాటుక కొంతమందికి పడకపోవచ్చు..

Published : 13 Sep 2021 15:07 IST

మేకప్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా సింపుల్‌గా కాటుకతో తమ లుక్‌ని పూర్తి చేయడం చాలామంది అమ్మాయిలకు అలవాటు! కంటిని ఇంపుగా తీర్చిదిద్దడంతో పాటు సహజసిద్ధమైన అందాన్ని అందించడం దీని ప్రత్యేకత. అయితే బయట దొరికే కాటుక కొంతమందికి పడకపోవచ్చు.. మరికొంతమంది ఇంట్లోనే కాటుకను తయారుచేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ విభిన్న కాటుక రెసిపీలు!

నువ్వుల నూనెతో..

కావాల్సినవి

* నువ్వుల నూనె/నెయ్యి - కొద్దిగా

* చిమ్నీ దీపం

* కాపర్‌ ప్లేట్‌

* వత్తి

తయారీ

* ముందుగా చిమ్నీ దీపంలో వత్తి సెట్‌ చేసి నూనె పోసి వెలిగించాలి.

* ఇప్పుడు దీపం పైభాగంలో కాపర్‌ ప్లేట్‌ను ఉంచాలి. ఇలా రాత్రంతా నూనె అయిపోయినకొద్దీ పోస్తుండాలి. తద్వారా ఉదయానికల్లా ప్లేట్‌ అడుగు భాగంలో మందపాటి లేయర్‌లా మసి పేరుకుపోతుంది.

* ఇప్పుడు దీనిపై నువ్వుల నూనె/నెయ్యి వేసి నిమిషం పాటు రుద్దాలి. తద్వారా ఈ మిశ్రమం చిక్కటి పేస్ట్‌ మాదిరిగా తయారవుతుంది.

* దీన్ని గాలి చొరబడని ఒక చిన్న డబ్బాలో వేసి నాలుగ్గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టేస్తే సరి.

బాదం కాటుక..

కావాల్సినవి

* బాదం పప్పులు - నాలుగైదు

* కొబ్బరి నూనె

* కాపర్‌ ప్లేట్‌

* ఒక బౌల్‌

తయారీ

* ముందుగా ఒక బౌల్‌లో బాదం పప్పుల్ని వేసి మండించాలి. దీనికి కాస్త ఎత్తులో ప్లేట్‌ బోర్లించేలా అమర్చుకోవాలి.

* కాసేపటి తర్వాత ప్లేట్‌పై నల్లటి మసి పేరుకుపోవడం గమనించచ్చు. ఇప్పుడు దీనిపై కొబ్బరి నూనె వేసి నిమిషం పాటు రుద్దుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న డబ్బాల్లో పెట్టి భద్రపరచుకోవచ్చు.

ఇదే పద్ధతిలో కర్పూరంను మండించి కూడా కాటుక తయారుచేసుకోవచ్చు.

చార్‌కోల్‌ కాటుక..

కావాల్సినవి

* చార్‌కోల్‌ క్యాప్సూల్స్‌ - 4

* కొబ్బరి నూనె - కొద్దిగా

తయారీ

ముందుగా చార్‌కోల్‌ క్యాప్సూల్స్‌లోని పొడిని ఒక చిన్న బౌల్‌లో వేసుకోవాలి. ఇందులో రెండు మూడు చుక్కల చొప్పున కొబ్బరి నూనె వేసుకుంటూ చార్‌కోల్‌ పౌడర్‌ కాస్తా చిక్కటి పేస్ట్‌ అయ్యే దాకా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఓ చిన్న డబ్బాలో నిల్వ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

ఇలా ఇంట్లో తయారుచేసుకున్న కాటుకలో వాడినవన్నీ సహజసిద్ధమైన పదార్థాలే కాబట్టి ఇవి కళ్లకు చల్లదనాన్ని అందిస్తాయి. అలాగే కళ్లలోని ఉప్పు నిక్షేపాల్ని తొలగించి కళ్ల కింద నల్లటి వలయాలు రాకుండా చేస్తాయి.

* కాటుక ఇంట్లో తయారుచేసుకున్నా, బయటి నుంచి తెచ్చుకున్నా.. రాత్రి పడుకునే ముందు పెట్టుకోకూడదు.

* కాటుకను తొలగించుకోవడానికి సబ్బు-నీరుకు బదులుగా మేకప్‌ రిమూవర్‌/క్రీమ్‌ని వాడడం ఉత్తమం.

* ఇంట్లో తయారుచేసుకున్న కాటుకలో వాడినవన్నీ సహజసిద్ధమైన పదార్థాలే అయినా.. వాడే ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో మంట, దురద.. వస్తే దాన్ని వాడకపోవడమే మంచిది.

అలాగే కాటుక వల్ల కళ్లు మంట పుట్టడం, ఎరుపెక్కడం.. వంటి సమస్యలు ఎదురైతే వెంటనే నిపుణుల్ని సంప్రదించడం మర్చిపోవద్దు. అలాగే ఇంట్లో తయారుచేసుకునే కాటుకకు సంబంధించిన మీకేమైనా సందేహాలున్నా నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్