Published : 06/12/2022 18:18 IST

కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే..!

కళ్ల కింద నల్లటి వలయాలు.. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది కూడా ఒకటి. వ్యక్తిగత పనులు లేదా ఇతర అవసరాల కోసం కంప్యూటర్‌/మొబైల్‌కు గంటల కొద్దీ కళ్లప్పగించడం కూడా ఈ సమస్యకు ఓ కారణమే. అయితే ఈ నల్లటి వలయాలను కొన్ని సహజ చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. మరి, అవేంటో చూద్దామా...

కారణాలేమిటి? 

నిద్రలేమి, అలసట, కంప్యూటర్‌/మొబైల్ ఎక్కువసేపు వాడడం, ఒత్తిడి, పోషకాహారం, తగినన్ని నీళ్లు తీసుకోకపోవడం.. ఇలా చాలా అంశాలు కళ్ల కింద నల్లటి వలయాలకు కారణమవుతాయి. అదేవిధంగా హైపర్‌ పిగ్మెంటేషన్‌, వృద్ధాప్యం, ఎగ్జిమా, కొన్ని రకాల ఎలర్జీలు, ఎండలో ఎక్కువ తిరగడం, మేకప్‌ సరిగా తొలగించుకోకపోవడం తదితర కారణాల వల్ల కూడా కళ్ల కింద చర్మం నల్లగా మారుతుంది.

ఈ మార్పులు తప్పనిసరి!

ఇది చాలామందికి చిన్న సమస్యగా అనిపించవచ్చు. అయితే నిర్లక్ష్యం చేస్తే మరిన్ని కంటి సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ కనీసం 7-8 గంటలు కంటి నిండా నిద్ర పోవాలి. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల వినియోగాన్ని తగ్గించాలి. ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరంగా ఉండాలి. ఇందుకోసం ధ్యానం, యోగాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలి.

ఈ సహజ చిట్కాలతో..

అల్లం, తులసి, కుంకుమ పువ్వు... ఈ మూడింటితో తయారుచేసిన టీని రోజుకోసారైనా తాగాలి. తియ్యదనం కోసం ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు.

ఆహార కోరికలను అదుపు చేసుకునేందుకు గాను హెల్దీ స్నాక్స్‌ను తీసుకోవాలి. వేరుశెనగ, బెల్లం, కొబ్బరి... ఈ మూడింటిని కలిపి సాయంత్రం పూట కొద్దికొద్దిగా తీసుకోవాలి.

పాలు, శెనగపిండిని కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. పాలలోని ఎ, బి6-విటమిన్లు చర్మంలోని మృత కణాలను తొలగించడంతో పాటు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా కళ్ల కింద నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి.

ముఖాన్ని శుభ్రపరచుకోవడం కోసం సబ్బులు, ఫేస్‌ వాష్‌ క్రీంల వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలి.

మధ్యాహ్నం లంచ్‌ తర్వాత చాలామందికి నిద్ర ముంచుకొస్తుంటుంది. అయితే పని వల్లో, ఇతర కారణాల వల్లో ఆ నిద్రను ఆపుకోవడం, లేదా కాఫీ, టీలతో నిద్రను దూరం చేసుకోవడం చేస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. ఇంట్లో ఉండేవారు వీలైతే మధ్యాహ్న సమయంలో కాసేపు కునుకు తీయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే అది అరగంటకు మించకుండా చూసుకోవడం మంచిది.

అర్ధరాత్రి వరకు మేల్కొనకుండా 11 గంటల్లోపే నిద్రకు ఉపక్రమించాలి. దీనివల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

ఒత్తిడి, ఆందోళన కలిగించే వ్యక్తులు, వస్తువులకు పూర్తి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్ల వాడకాన్ని తగ్గించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని