Published : 11/12/2021 18:09 IST

చలికాలంలో మృదువైన అధరాల కోసం..

చలికాలం వచ్చిందంటే చాలు పెదవులు పొడిబారిపోయి.. అందవిహీనంగా తయారవుతాయి. కొన్నిసార్లు పెదవుల చర్మం పగిలి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి కాపాడుకోవడానికి లిప్ బామ్, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొంత సమయం మాత్రమే అధరాలు నిగారింపుగా కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్లీ మామూలే. దీంతో మళ్లీ మళ్లీ వాటిని అప్త్లె చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా వాటిలోని రసాయనాల ప్రభావం పెదవులపై పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రోజంతా అధరాల్లో తేమ సహజసిద్ధంగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..

కలబందతో..

ఆరోగ్యం.. అందం.. రెండింటినీ కాపాడటంలో కీలకపాత్ర పోషించే కలబంద పెదవుల అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని పెదవులకు అప్త్లె చేసి కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే పెదవులకు తగినంత తేమ అంది పొడిబారకుండా ఉంటాయి.


నెయ్యితో..

ఇంట్లో అమ్మమ్మ, నాన్నమ్మల తరానికి చెందినవారు మన పెదవులు పొడిబారినట్లు గమనిస్తే 'నెయ్యి రాసుకో' అని సలహా ఇస్తూ ఉంటారు. ఆ క్షణం దాన్ని మనం పట్టించుకోకపోయినా.. పెదవుల మృదుత్వాన్ని కాపాడే వాటిలో నెయ్యి ముందు వరుసలో ఉంటుంది. అందులో ఉండే కొవ్వు పదార్థాలు అధరాలు పొడిబారకుండా కాపాడతాయి. ఈ ఫలితాన్ని పొందాలంటే రోజూ రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా పెదవులకు నెయ్యి రాసుకుంటూ ఉండాలి.


ఆవనూనెతో..

కొంతమందికి పెదవులు పొడిబారడంతో పాటు.. పగిలి నొప్పి పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆవనూనెను ఉపయోగించడం మంచిది. కొద్దిగా ఆవనూనె తీసుకొని పెదవులకు రాసుకోవాలి. దీన్ని అప్త్లె చేసుకున్నప్పుడు పెదవులు కొంత సమయం మంట పెడతాయి. కాస్త ఓపిక పడితే మాత్రం మంచి ఫలితం కనిపిస్తుంది. అధరాలు తేమ సంతరించుకుని మృదువుగా తయారవడంతో పాటు నొప్పి కూడా తగ్గిపోతుంది.


తేనెతో..

రోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు కొద్దిగా తేనె రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చలి కారణంగా పొడిబారి నల్లగా మారిన పెదవులు తిరిగి తేమను సంతరించుకుంటాయి. ఫలితంగా పెదవులు మృదువుగా మారడంతో పాటు గులాబీ రంగుతో మరింత అందంగా కనిపిస్తాయి.


గులాబీ రేకులతో..

కొన్ని గులాబీ రేకులు తీసుకొని పచ్చిపాలలో కొన్ని గంటలపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తని ముద్దలా చేసుకోవాలి. లిప్ బామ్ కి బదులుగా ఈ మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజులో మూడు నుంచి నాలుగు సార్లు ఈ గులాబీ పేస్ట్ ని అప్త్లె చేసుకోవడం ద్వారా పెదవుల మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా పెదవులు గులాబీ రంగుని సైతం సంతరించుకుంటాయి.


పాలమీగడతో..

పాలమీగడలో ఉండే కొవ్వు పదార్థాలు పెదవులకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. అలాగే పగిలిన అధరాలను తిరిగి మామూలుగా అయ్యేలా చేస్తాయి. ఈ ఫలితాన్ని పొందడం కోసం పాలమీగడను పెదవులకు రాసుకొని కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచేస్తే సరిపోతుంది.


ఇవి కూడా..

* తొక్క తీసిన కీరాదోస ముక్క తీసుకొని మెత్తగా చేసుకోవాలి. దీన్ని పెదవులకు రాసుకొని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.

* అధరాలను రోజూ కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటూ ఉంటే పొడిబారకుండా ఉంటాయి.

* ఆముదంలో మూడు నుంచి ఐదు చుక్కల చొప్పున గ్లిజరిన్, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని పెదవులకు అప్త్లె చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

* నిద్రపోయే ముందు తాజా వెన్న రాసుకోవడం ద్వారా పెదవులు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.

* సమపాళ్లలో గ్లిజరిన్, రోజ్ వాటర్ తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని నిద్రపోయే ముందు పెదవులకు అప్త్లె చేసుకోవాలి. ఇలా ఐదు రోజుల పాటు చేస్తే.. పెదవుల అందం రెట్టింపవుతుంది.

శీతాకాలంలో పెదవులు పొడిబారకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారుగా.. మీరు కూడా వీటిని పాటించి అధరాల అందాన్ని కాపాడుకోండి మరి..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని