ఫుడ్ పాయిజనింగ్ నుంచి ఉపశమనమిలా..!
శరీరతత్వానికి నప్పని ఆహార పదార్థం తిన్నా లేదా తినుబండారాల్లో ఉన్న రసాయనాల కారణంగా కూడా పదార్థాలు విషపూరితంగా మారి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా ఎక్కువరోజులు ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇందుకు ఆహార పదార్థాల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్.. వంటి సూక్ష్మక్రిములు కూడా కారణం కావచ్చు....
శరీరతత్వానికి నప్పని ఆహార పదార్థం తిన్నా లేదా తినుబండారాల్లో ఉన్న రసాయనాల కారణంగా కూడా పదార్థాలు విషపూరితంగా మారి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా ఎక్కువరోజులు ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇందుకు ఆహార పదార్థాల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్.. వంటి సూక్ష్మక్రిములు కూడా కారణం కావచ్చు. ఇక ఇలాంటి పదార్థాలు తిన్నప్పుడు వాంతులు, విరేచనాలు.. వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే కొన్ని సహజసిద్ధ పదార్ధాల గురించి తెలుసుకుందాం...
సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చర్మంపై దద్దుర్లు- దురద వంటివి రావడం, అలసిపోయినట్లు అనిపించడం.. మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వాటి తీవ్రతను బట్టి ఫుడ్ పాయిజనింగ్‌కు తగిన చికిత్స తీసుకోవాలి. అయితే ఇంట్లో లభ్యమయ్యే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
తులసి
తులసి ఆకుల్లో యాంటీమైక్రోబియల్ గుణాలు ఉండడం వల్ల అవి సూక్ష్మక్రిములతో పోరాడి సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో బాగా ఉపకరిస్తాయి. ఈ క్రమంలో కొన్ని తులసి ఆకులు మెత్తగా చేసి వాటి నుంచి రసం తీసుకోవాలి. ఆ మిశ్రమానికి చెంచా తేనె జత చేసి రోజుకు ఒకసారి తరచూ తీసుకోవడం వల్ల కడుపునొప్పి, వికారం... మొదలైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. తేనె అంటే ఇష్టపడని వారు దానికి బదులుగా కొత్తిమీర రసం కూడా ఇందులో చెంచా చొప్పున కలుపుకొని తాగచ్చు.
నిమ్మరసం
నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు కూడా సూక్ష్మక్రిములతో పోరాడి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన బ్యాక్టీరియా నశించేలా చేస్తాయి. ఇందుకోసం రెండు లేదా మూడు నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకోవాలి. అందులో చిటికెడు చక్కెర వేసి తాగాలి. బ్లాక్ టీ తాగే అలవాటు ఉన్నవారు అందులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
అల్లం
ఫుడ్ పాయిజనింగ్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారా?? అయితే అల్లం దానికి సరైన మందు. కొద్దిగా అల్లం రసం తీసుకొని దానికి చెంచా తేనె జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల కడుపులో తిప్పడం, నొప్పి.. వంటి సమస్యలు తగ్గడంతో పాటు వాపు కూడా తగ్గుముఖం పడుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్‌కు ఆల్కలీన్ లక్షణాలు ఉండడం వల్ల అది జీర్ణాశయంలో ఒక పలుచని పొర ఏర్పడేలా చేస్తుంది. దాని వల్ల బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు సులభంగా నశించి ఫుడ్ పాయిజనింగ్ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఈ పండ్లు..
ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందకుండా అరికట్టే స్వభావం యాపిల్‌కు ఉంటుంది. అలాగే అరటిపండులో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి యాపిల్, అరటిపండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల సమస్య తగ్గుముఖం పట్టడమే కాకుండా డయేరియా, కడుపునొప్పి, ఉబ్బరం.. మొదలైన సమస్యల నుంచి కూడా బయటపడచ్చు.
వీటికి దూరంగా..
ఫుడ్ పాయిజనింగ్ తీవ్రత తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి వరకు ఉన్నప్పుడు కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. పాల సంబంధిత పదార్థాలు, ఫ్యాటీ ఫుడ్స్.. మొదలైనవి తీసుకోకపోవడమే ఉత్తమం. కొద్దిరోజుల పాటు తాజా పండ్లు, కూరగాయలు, సూప్స్.. మొదలైన ఆహారం తీసుకోవాలి.
చూశారుగా.. ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు సహజసిద్ధమైన పదార్థాలతో ఎలా ఉపశమనం పొందచ్చో.. మీరు కూడా వీటిని గుర్తుపెట్టుకోండి. అనుసరించి సమస్య నుంచి బయటపడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.