Published : 28/01/2023 20:18 IST

Lip Pigmentation: పెదాలు నల్లబడుతున్నాయా?

దొండపండు లాంటి ఎర్రటి పెదాలు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే చాలామంది విషయంలో అధరాలు తమ చిన్నతనంలో ఉన్నంత మృదువుగా, గులాబీ వర్ణంలో ఉండవనే చెప్పాలి. కొంతమందికి పెదాలు నల్లగా మారడం, పొడిబారిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీన్నే ‘లిప్‌ పిగ్మెంటేషన్‌’ అంటారు. మరి, ఈ సమస్య ఎందుకొస్తుంది? దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? రండి.. తెలుసుకుందాం..!

కారణాలివే!

లిప్‌ పిగ్మెంటేషన్‌కి మనం పాటించే అనారోగ్యపూరిత లైఫ్‌స్టైల్‌తో పాటు వివిధ రకాల కారణాలున్నాయంటున్నారు నిపుణులు. కెఫీన్‌ అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, రసాయనాలుండే సౌందర్య ఉత్పత్తుల్ని వాడడం, అతినీలలోహిత కిరణాల ప్రభావం, శరీరంలో మెలనిన్‌ ఉత్పత్తి అధికమవడంతో పాటు కొంతమంది గర్భిణుల్లోనూ ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇంట్లో లభించే కొన్ని సహజ పదార్థాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు.

ఈ చిట్కాలతో..!

SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిప్‌బామ్‌ను రోజూ బయటికి వెళ్లే ముందు పెదాలకు రాసుకోవాలి. తద్వారా అతినీల లోహిత కిరణాల ప్రభావం అధరాలపై పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పెదాలకు అడ్డుగా మాస్క్‌ ధరించడం లేదా స్కార్ఫ్‌తో కవర్‌ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం మంచిది.

విటమిన్‌-ఎ పిగ్మెంటేషన్‌ సమస్యను తగ్గించడంలో సహకరిస్తుంది. అందుకే ఈ పదార్థం ఉన్న లిప్‌బామ్‌లు, లిప్‌క్రీమ్‌లు తరచూ ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే ‘ఎ’ విటమిన్‌ నిండి ఉన్న చిలగడదుంప, క్యారట్‌, పాలకూర, బ్రకలీ.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడమూ ముఖ్యమే.

లిప్‌ పిగ్మెంటేషన్‌ని దూరం చేసుకొని పెదాలకు సహజసిద్ధమైన రంగును అందించాలంటే ఈ మిశ్రమం చక్కగా పనిచేస్తుంది. కొబ్బరినూనె, నిమ్మరసం కొద్ది మొత్తాల్లో తీసుకొని కలుపుకోవాలి. దీన్ని పెదాలపై అప్లై చేసుకొని కొన్ని నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు కొన్ని రోజుల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది.

రాత్రి పడుకునే ముందు పెదాలకు ఆలివ్‌ ఆయిల్‌ రాసుకున్నా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇది పొడిబారిపోయి పాలిపోయిన పెదాలకు తేమనందిస్తుంది. తద్వారా అధరాలు మృదువుగా మారడంతో పాటు మంచి రంగులోకి వస్తాయి.

మెలనిన్‌ స్థాయుల్ని అదుపు చేసే శక్తి కలబందకు ఉందని చెబుతోంది ఓ అధ్యయనం. అందుకే కలబంద గుజ్జును రోజూ రాత్రి పూట పెదాలపై రాసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. తద్వారా చర్మానికి తేమ అంది పెదాలు మృదువుగా మారతాయి.

కొంతమందికి పదే పదే పెదాలను నాలుకతో అద్దడం, పంటితో కొరకడం అలవాటు! దీనివల్ల కూడా పెదాలు పొడిబారి రంగు మారిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ అలవాటును పూర్తిగా మానుకోవడం మంచిదంటున్నారు.

తేనెను పెదాలపై రాసుకొని ఆరే వరకు అలాగే ఉంచుకోవాలి.. లేదంటే పడుకునే ముందు అప్లై చేసుకొని రాత్రంతా ఉంచుకొని మరుసటి రోజు చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా సమస్య తగ్గే వరకూ క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.

పెదాలకు తాత్కాలికంగా రంగులద్దడానికి లిప్‌స్టిక్‌ని ఉపయోగిస్తుంటాం. నిజానికి ఇందులో బోలెడన్ని రసాయనాలుంటాయి. అందుకే వాటికి బదులు ఇలా ఇంట్లోనే లిప్‌స్టిక్‌ని తయారుచేసుకోవచ్చు.

ఇందుకోసం.. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ సమపాళ్లలో తీసుకొని దీనికి కొద్దిగా కలబంద గుజ్జు చేర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచూ పెదాలకు రాస్తుంటే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. పైగా పెదాలు దొండపండులా తయారవుతాయి కూడా!

నిమ్మరసం, బీట్‌రూట్‌ రసం.. వంటివి పెదాలపై నేరుగా ఉపయోగించడం వల్ల లిప్‌ పిగ్మెంటేషన్‌ని దూరం చేసుకోవచ్చు.

పడుకునే ముందు బీస్‌వ్యాక్స్‌, షియా బటర్‌.. వంటి సహజసిద్ధమైన ఉత్పత్తుల్ని అప్లై చేసుకోవడం వల్ల పెదాలకు పోషణ లభిస్తుంది.. సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

ఇలా సహజసిద్ధమైనవి కాకుండా బయటి నుంచి ఎలాంటి క్రీమ్‌లు, లిప్‌బామ్‌/లిప్‌ జెల్‌.. వంటివి వాడాలనుకున్నా.. ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని