Published : 02/01/2023 18:05 IST

ఆయిలీ స్కిన్.. చిట్కాలివిగో!

ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా కొంతమంది చర్మం జిడ్డుగా ఉంటుంది. సెబేషియస్ గ్రంధులు అధికంగా స్రావాల్ని ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం. అయితే ఇది కేవలం జిడ్డుదనానికి మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే ఆయిలీ స్కిన్‌ ఉన్నట్లయితే మొటిమలు, మచ్చలు.. వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఈక్రమంలో ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

టోనింగ్, స్క్రబ్బింగ్, ఫేస్‌ప్యాక్

వెనిగర్, రోజ్ వాటర్‌ల మిశ్రమం ఒక చక్కటి టోనర్‌లా పని చేస్తుంది. జిడ్డుచర్మం మురికిని ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. చర్మంపై పేరుకుపోయే మృతకణాలను తొలగించుకోవడం వల్ల చర్మ గ్రంధులు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాయి.

జిడ్డు చర్మాన్ని స్క్రబ్ చేయడానికి బాదం పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఇంకా కలబంద గుజ్జు కూడా బాగా పనిచేస్తుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిని, కలబంద గుజ్జుతో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో కొద్ది నిమిషాల పాటు ముఖానికి మర్దన చేసి, చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇది కూడా చాలా సహజంగానే చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది.

ఇలా నీట్‌గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అప్త్లె చేయాలి. గుడ్డు తెల్లసొనలో ఒక చెంచా తేనె, శెనగపిండి కలిపి ప్యాక్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పూసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా పాటించండి!

ఆయిలీ స్కిన్ ఉన్నవారు మేకప్ వేసుకునేటప్పుడు లిక్విడ్ ఐటమ్స్‌ను ఎక్కువగా ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం.

రోజూ ఉపయోగించే సబ్బులు లేదా లిక్విడ్‌లు కూడా ఆయిల్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.

ఆయిల్‌ని గ్రహించే ఫేస్‌మాస్క్స్, ఫేస్‌ప్యాక్స్ రెగ్యులర్‌గా వేసుకుంటూ ఉండాలి.

పోషకాహారం తీసుకుంటూ నూనె ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం వల్ల హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించాలి.

ఈ చిట్కాలన్నీ పాటిస్తూ.. జాగ్రత్తగా ఉంటే ఆయిలీస్కిన్ సమస్య దూరమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని