దంత సమస్యలకు ఇంటి చిట్కాలు!
నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సరే.. కొన్నిసార్లు వివిధ దంత సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మరి, వీటిని తగ్గించుకోవాలంటే...
నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సరే.. కొన్నిసార్లు వివిధ దంత సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మరి, వీటిని తగ్గించుకోవాలంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరి!
ఉసిరి
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి నోటిలోని హానికారక బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడి చిగుళ్లను కాపాడతాయి. ఉసిరి సహజ క్లెన్సర్‌లా పనిచేసి నోటి దుర్వాసనను పోగొడుతుంది. కాబట్టి రోజూ ఓ ఉసిరిని తినేయండి. లేదా పావు చెంచా ఉసిరి పొడిని అరకప్పు నీటిలో కలిపి తాగినా ఫలితం ఉంటుంది.
వేపాకు
వేపలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందిస్తాయి. అంతేకాదు.. దంతాలకు, చిగుళ్లకు బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కొన్ని చుక్కల వేపరసాన్ని మీ పళ్లు, చిగుళ్లపై మృదువుగా రాయాలి. కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
లవంగం
ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. చిగుళ్ల సమస్యలు పెరగకుండా నియంత్రిస్తాయి. పావు చెంచా నువ్వుల నూనెలో కొన్ని చుక్కల లవంగం నూనె కలిపి, అందులో దూది ఉండను ముంచి పంటినొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. బుగ్గన రెండు లవంగ మొగ్గలు పెట్టుకున్నా ఉపశమనం లభిస్తుంది.
వంట సోడా
దీనిలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నోటిలో ఎక్కువైన ఆమ్లాలను పీల్చుకుంటాయి. దంత క్షయానికి, చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే ఆమ్లాలను వంటసోడాలోని ఆల్కలైన్ సమ్మేళనాలు నియంత్రిస్తాయి. దాంతో నోటిలో ఆమ్లాల తీవ్రత తగ్గుతుంది. అయితే ఇది తరచూ వాడడం వల్ల పంటి ఎనామిల్‌కు హాని జరగొచ్చని మరవకూడదు. ఇలాంటి చిట్కాలు ఒకట్రెండు రోజులు ప్రయత్నించి చూడొచ్చు. అప్పటికీ తగ్గకపోతే దంత వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.