తలనొప్పి వేధిస్తోందా?
ఈ ఉరుకులు పరుగుల జీవనశైలితో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి.. వంటివి సహజం. ఇవి తలనొప్పికి దారితీస్తాయి. ఫలితంగా ఏ పనీ చేయాలనిపించదు. అలాగని ఓ మాత్ర వేసేసుకుంటే నిమిషాల్లో ఉపశమనం....
ఈ ఉరుకులు పరుగుల జీవనశైలితో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి.. వంటివి సహజం. ఇవి తలనొప్పికి దారితీస్తాయి. ఫలితంగా ఏ పనీ చేయాలనిపించదు. అలాగని ఓ మాత్ర వేసేసుకుంటే నిమిషాల్లో ఉపశమనం పొందచ్చు.. కానీ ప్రతిసారీ ఇలాగే చేస్తే మాత్రం దుష్ప్రభావాలతో పాటు పలు ఆరోగ్య సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు. అలా జరగకుండా ఉండాలంటే.. ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
⚛ తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్ కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. శరీరంలో నీటిస్థాయిలు తగ్గడం వల్ల మైగ్రెయిన్ లాంటి సమస్యలొస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డీహైడ్రేషన్ కారణంగా ఏకాగ్రత దెబ్బతిని ఏ పనీ చేయాలనిపించదు. కాబట్టి తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే సరిపడా నీళ్లు తాగడం, నీటి స్థాయులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.
⚛ ఇతరులతో పోల్చుకుంటే మెగ్నీషియం లోపం ఉన్న వారిలో తరచూ మెగ్రెయిన్ వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, డార్క్ చాక్లెట్.. వంటివి ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే మెగ్నీషియం సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో డయేరియా లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని నిపుణుల సలహా మేరకు తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
⚛ ఛీజ్, బర్గర్లు, స్మోక్డ్ ఫిష్, మాంసం.. వంటి పదార్థాల్లో హిస్టమైన్ అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామందిలో మైగ్రెయిన్ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు తరచూ తలనొప్పి బారిన పడుతుంటే ఈ పదార్థాలను దూరం పెట్టడం మేలు. అయితే కొన్ని చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తలనొప్పిని తగ్గించడంలో బాగా సహకరిస్తాయట!
⚛ నిద్రలేమి ఆరోగ్యంపై వివిధ రకాలుగా దుష్ప్రభావం చూపుతుంది. అందులో తలనొప్పి కూడా ఒకటి. కాబట్టి రోజుకు కనీసం ఏడెనిమిది గంటలు సుఖంగా నిద్ర పోవడం మంచిది.
⚛ మార్కెట్లో దొరికే కొన్ని రకాల నూనెలతో తలనొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. ప్రత్యేకించి పెప్పర్‌మింట్ ఆయిల్, లావెండర్ నూనెల్లో తలనొప్పిని నివారించే గుణాలు అధికంగా ఉంటాయి. విపరీతమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా తలనొప్పి వచ్చినప్పుడు కొద్దిగా పెప్పర్‌మింట్ ఆయిల్‌ను తీసుకుని నుదుటిపై సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇక మైగ్రెయిన్ తీవ్రతను తగ్గించడంలో లావెండర్ నూనె సమర్థంగా ఉపయోగపడుతుంది.
⚛ ఐస్‌ప్యాక్‌ని నుదురుపై ఉంచి కాసేపు అద్దుతూ ఉంటే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ ఐస్‌ప్యాక్ అందుబాటులో లేకపోయినా ఫ్రోజెన్ జెల్ రాసుకోవడమో లేదంటే చల్లటి నీళ్లలో ముంచిన గుడ్డను తలపై వేసుకోవడమో.. వంటివి చేసినా చక్కటి ఫలితం ఉంటుంది.
⚛ కాఫీ, టీలలో ఉండే కెఫీన్‌కి తలనొప్పిని తగ్గించే శక్తి ఉంది. కాబట్టి తలనొప్పి ఉన్న సమయంలో చాలామంది వీటి మీద ఆధారపడుతుంటారు. అయితే త్వరగా తగ్గాలని వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి తాగకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.