మృతకణాలు పోవాలంటే...

ప్రకాశవంతమైన చర్మం కావాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? అయితే కొన్ని సందర్భాల్లో చర్మం ఛాయ తగ్గి జీవం కోల్పోయినట్లుగా తయారవుతుంది. దీనికి కారణం చర్మంపై మృతకణాలు పేరుకుపోవడమే. మరి వీటిని తొలగించుకోవాలంటే బ్యూటీపార్లర్‌కే వెళ్లాల్సిన పనిలేదు. వంటింట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో....

Published : 26 Oct 2022 19:22 IST

ప్రకాశవంతమైన చర్మం కావాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? అయితే కొన్ని సందర్భాల్లో చర్మం ఛాయ తగ్గి జీవం కోల్పోయినట్లుగా తయారవుతుంది. దీనికి కారణం చర్మంపై మృతకణాలు పేరుకుపోవడమే. మరి వీటిని తొలగించుకోవాలంటే బ్యూటీపార్లర్‌కే వెళ్లాల్సిన పనిలేదు. వంటింట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసుకున్న ప్యాక్‌లు, స్క్రబ్‌లు ఉపయోగిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.

ముఖానికి ఇవి!

ముఖంపై పేరుకున్న మృతకణాల్ని ఈ ప్యాక్స్‌ ద్వారా తొలగించుకోవచ్చు.

⚛ సమాన పాళ్లలో చందనం, బియ్యప్పిండి, శెనగపిండి తీసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు, రోజ్‌వాటర్ కలిపి చిక్కటి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత మృదువుగా చర్మాన్ని రుద్దుతూ ప్యాక్‌ని తొలగించి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

⚛ పది బాదం గింజల్ని తీసుకొని రాత్రంతా పాలల్లో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం తొక్క తీసి గింజలను మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు పూర్తిగా పేస్ట్‌గా మారిపోకుండా కాస్త బరకగా ఉండేలా జాగ్రత్తపడాలి. దీనికి రెండు టీస్పూన్ల తేనె కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్త్లె చేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

⚛ నారింజ తొక్కల పొడి, పెరుగు సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లాగా వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతివేళ్లను కొద్దిగా తడిచేసుకొని గుండ్రంగా, మృదువుగా రుద్దుకుంటే ముఖంపై పేరుకొన్న మృతకణాలు తొలగిపోతాయి.

మేని మెరుపుకి..

పంచదారతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగించి చర్మంపై చేరిన మృతకణాలను సులభంగా తొలగించుకోవచ్చు. దీనికోసం అరకప్పు చక్కెరలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, అంతే పరిమాణంలో తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని చర్మానికి రాసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటిస్తే చర్మంపై పేరుకున్న మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవచ్చు. అయితే ఈ మిశ్రమాన్ని తయారుచేయడానికి ఉపయోగించే పంచదార చాలా సన్నగా ఉండేలా చూసుకోవాలి.

అధరాలకు..

కొన్ని సందర్భాల్లో గులాబీ రంగులో ఉండే పెదవులు సైతం నల్లగా, పొడిబారినట్లుగా తయారవుతాయి. దీనికి కారణం కూడా మృతకణాలే. దానిమ్మ గింజలను ఉపయోగించడం ద్వారా పెదవులను తిరిగి పూర్వపు స్థితికి తెచ్చుకోవచ్చు.

⚛ దీనికోసం కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని మెత్తగా చేసుకోవాలి. దీనికి కొంచెం మిల్క్‌క్రీంను కలిపి పెదవులకు రాసుకొని మృదువుగా మర్దన చేసుకొంటే మృతకణాలు తొలగిపోతాయి.

⚛ కొన్ని దానిమ్మ గింజలను తీసుకొని పంచదార, కొద్దిగా ఆలివ్ నూనెతో మిశ్రమంగా చేసి దాంతో పెదవులను మర్దన చేసుకోవడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.

ఈ చిట్కాలను పాటించిన అనంతరం చల్లటి నీటితో పెదవులను శుభ్రం చేసుకొని ఆరిన తర్వాత లిప్‌బామ్ రాసుకోవాలి.

పాదాల విషయంలో ఇలా..

మృతకణాలు పేరుకుపోవడం వల్ల పాదాలు సైతం మృదుత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. అయితే కాస్త సమయం కేటాయిస్తే పాదాలను తిరిగి మృదువుగా తయారుచేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గోరువెచ్చని నీళ్లలో పాదాలను ఉంచాలి. అరగంట తర్వాత అరచెక్క నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీనితో పాదాలను పావుగంట పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగి పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. స్క్రబ్ చేసుకోవడానికి ఉపయోగించిన మిశ్రమం పాదాలపై చేరిన మృతకణాలు, మురికిని తొలగించడంతో పాటు తేమను అందిస్తుంది. ఈ పద్ధతిని వారానికోసారి పాటించడం ద్వారా పాదాల్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

చేతులు..

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ముందుగా చేతులను నీటితో శుభ్రం చేసుకొని ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లాగా వేసుకోవాలి. ఆ తర్వాత మృదువుగా రుద్దుతూ ప్యాక్‌ని తొలగించుకోవాలి. ఈ చిట్కాను అప్పుడప్పుడూ పాటించడం ద్వారా చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్