ఈ చిప్స్‌ని కరకరలాడించేయండి..!

వానాకాలం.. అలా వాన పడుతుంటే సాయంకాలం కారంకారంగా ఏదైనా తినాలనిపించడం సహజం. కొంతమంది ఇంట్లోనే పకోడీలో, సమోసాలో చేసుకుంటే.. మరికొందరు ప్రతిసారీ ఏం చేస్తాంలే అంటూ బయట నుంచి చిప్స్ తెచ్చుకుంటుంటారు.

Updated : 27 Sep 2021 20:00 IST

వానాకాలం.. అలా వాన పడుతుంటే సాయంకాలం కారంకారంగా ఏదైనా తినాలనిపించడం సహజం. కొంతమంది ఇంట్లోనే పకోడీలో, సమోసాలో చేసుకుంటే.. మరికొందరు ప్రతిసారీ ఏం చేస్తాంలే అంటూ బయట నుంచి చిప్స్ తెచ్చుకుంటుంటారు. అందులోనూ ఇలాంటి చిప్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కూడానూ..! మరి ఎప్పుడూ బంగాళాదుంపతోనే కాకుండా.. వివిధ రకాలుగా.. కాస్త ఆరోగ్యకరంగా చిప్స్ తయారుచేసుకోవడమెలాగో తెలుసుకుందాం రండి..

కీరా చిప్స్

కావాల్సినవి

కీర దోసకాయలు - రెండు

ఆలివ్ నూనె - టేబుల్ స్పూన్

పార్మేసన్ ఛీజ్ - పావు కప్పు

ఉప్పు - కొద్దిగా

మిరియాల పొడి - కొద్దిగా

తయారీ

ముందుగా ఒవెన్‌ని 450 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద ప్రిహీట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ షీట్స్‌కి నూనె రుద్ది పక్కన ఉంచాలి. కీరాని బాగా కడిగి, తుడిచి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు ఓ గిన్నెలో ఛీజ్, ఉప్పు, మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి. ప్రతి కీరా ముక్కనూ ఈ మిశ్రమంలో ముంచి కోటింగ్ అతుక్కునేలా చేయాలి. ఆ తర్వాత వీటన్నింటినీ బేకింగ్ షీట్‌పై పేర్చి ఒవెన్‌లో పెట్టుకోవాలి. ఇవన్నీ రెండువైపులా కాలి, క్రిస్పీగా తయారయ్యేవరకూ దాదాపు 20-30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. వీటిని చల్లార్చి భద్రపర్చుకోవచ్చు. అయితే ఇవి కొద్దిరోజులు మాత్రమే నిల్వ ఉంటాయి.


కార్న్ టోర్టిలా చిప్స్ విత్ స్పినాచ్

కావాల్సినవి

కార్న్‌ఫ్లోర్ - కప్పు

గోధుమ పిండి - కొద్దిగా

పాలకూర - కప్పు

వేడి నీళ్లు - ముప్పావు కప్పు

ఉప్పు - అర టీస్పూన్

తయారీ

ముందుగా పాలకూరను ఉడికించుకొని పెట్టుకోవాలి. కార్న్‌ఫ్లోర్, గోధుమ పిండి, ఉప్పు ఓ బౌల్‌లో వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులో పాలకూర మిశ్రమం వేసి.. వేడి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలి. ఆపై పిండిని ఎనిమిది సమాన భాగాలుగా చేసుకొని పెట్టుకోవాలి. వీటిపై తడిగుడ్డ కప్పి గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పూరీ ప్రెస్సింగ్ మెషీన్ మధ్యలో ఓ ప్లాస్టిక్ షీట్ వేసి.. దాని సాయంతో వీటిని వత్తుకోవాలి. ఆ తర్వాత నాన్‌స్టిక్ ప్యాన్‌పై వీటిని వేసి నిమిషం పాటు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని ఆరు త్రిభుజాలుగా కట్ చేసుకోవాలి. వీటిని రాత్రంతా అలా ఆరనిచ్చి.. మరుసటిరోజు ఉదయాన్నే నూనె రుద్దిన బేకింగ్ షీట్‌లో వేసి 350 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద ఐదు నిమిషాల పాటు బేక్ చేస్తే సరి.. టోర్టిలాస్ సిద్ధం. వీటిని సాస్‌తో పాటు తింటే బాగుంటాయి.


చిలగడదుంప చిప్స్

కావాల్సినవి

చిలగడదుంపలు - రెండు (కాస్త లావుగా ఉండాలి)

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

ఉప్పు - పావు టీస్పూన్

కారం - పావు టీస్పూన్

తయారీ

ముందుగా ఒవెన్‌ని 250 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద ప్రిహీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిలగడదుంపలను బాగా కడిగి, తుడవాలి. కావాలంటే తొక్క కూడా తీసేయవచ్చు. ఆ తర్వాత స్త్లెసర్ సాయంతో చిలగడ దుంప నుంచి వీలైనంత సన్నని ముక్కలను కట్ చేసుకోవాలి. ఆపై వీటికి నూనె అద్ది, ఉప్పు, కారం చల్లాలి. ఇప్పుడు వీటన్నింటినీ నూనె రాసిన ఓ బేకింగ్ షీట్‌లో కాస్త గ్యాప్ ఉండేలా పేర్చుకొని ఈ షీట్‌ని ఒవెన్‌లో పెట్టి బేక్ చేసుకోవాలి. అరగంట కాగానే వీటిని మరోవైపుకి తిప్పి.. రెండువైపులా వేగి క్రిస్పీగా తయారయ్యే వరకూ అలా బేక్ చేసుకోవాలి. అంతే చిలగడదుంప చిప్స్ రడీ.. కారంకారంగా, తియ్యతియ్యగా ఉండే వీటిని చల్లార్చుకొని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.


టారో చిప్స్

కావాల్సినవి

నూనె - తగినంత

చేమ దుంపలు - రెండు (పెద్దవి)

ఉప్పు- కొద్దిగా

మిరియాల పొడి - కొద్దిగా

హమ్ముస్ - కొద్దిగా (ఇది సూపర్ మార్కెట్లలో లభిస్తుంది..)

తయారీ

ముందుగా ఒవెన్‌ని 400 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద వేడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ షీట్‌పై ఆలివ్ ఆయిల్‌ని రుద్దుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు చేమ దుంపలను తీసుకొని వాటి తొక్క చెక్కేయాలి. స్త్లెసర్ సాయంతో అతి సన్నని స్త్లెసులుగా చేసుకోవాలి. వీటిని బేకింగ్ పేపర్‌పై ఒక్కొక్కటిగా పరిచి వాటిపై బ్రష్ సాయంతో నూనెను రుద్దుకోవాలి. ఆపై ఉప్పు, మిరియాల పొడి చల్లి, హమ్ముస్ కూడా వేసి పన్నెండు నిమిషాల పాటు బేక్ చేయాలి. ఆ తర్వాత బయటకు తీసి, చల్లారనిచ్చి డబ్బాలో భద్రపర్చుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్