Updated : 11/09/2021 19:34 IST

ఓర్పు ఉంటే ఈ చెట్టులాగే 90 అడుగులు ఎదగొచ్చు..!

ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు సహజం. ఓర్పు వహిస్తే వాటిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అంత ఓర్పు ఈరోజుల్లో ఎవరికుంది చెప్పండి?? ఈ క్రమంలో ప్రతి మనిషీ తన జీవితంలో ఓర్పు, సహనం అలవరచుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేసే కథ ఒకటుంది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వేదికలపై ఓర్పుకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఈ కథనే ఎక్కువగా చెప్పుకుంటారు. అదేంటో మీరూ చూడండి..

కొన్నేళ్ల కిత్రం చైనాలో ఒక రైతు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోతాడు. వెదురు మొక్కల విత్తనాలు నాటితే అవి కొద్ది రోజుల్లోనే 90 అడుగుల ఎత్తుకి పెరుగుతాయని, వాటిని అమ్మితే మంచి లాభాలొస్తాయని ఒక వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఆ విత్తనాలు నాటుతాడు. వాటితోపాటు మరికొన్ని కాయగూరల విత్తనాలతో కూడా పంటలు పండిస్తాడు. వయసు పెద్దదైనా ఓపికతో వాటికి రోజూ నీళ్లు పోయడం, ఎరువులు అందించడం.. వంటివి చేస్తూ వాటిని జాగ్రత్తగా సంరక్షించాడు. కొన్ని వారాల వ్యవధి తర్వాత కాయగూరల విత్తనాలు మొలకలు వచ్చాయి కానీ వెదురు విత్తనాల దగ్గర ఒక్క మొలక కూడా రాలేదు. అయినా ఓర్పుతో రోజూ విత్తనాలు నాటిన చోట నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అతను ఆశించిన వెదురు మొక్కలు మొలకెత్తకపోయినా కాయగూరల పంటలు చేతికి రావడంతో కుటుంబ పోషణ అలాఅలా గడిచిపోయేది.

అయితే 90 అడుగుల వెదురు చెట్లు పెంచి, కుటుంబాన్ని పోషించాలనుకునే అతని ఆశకి కాలం మరింత పరీక్ష పెట్టసాగింది. ఫలితంగా విత్తనాలు నాటి సంవత్సరం గడిచినా ఒక్క మొలక కూడా రాదు. కానీ ఆ రైతు మాత్రం రోజూ నీళ్లు పోస్తూ వాటిని సంరక్షిస్తూనే ఉన్నాడు. దీంతో చుట్టూ ఉన్న గ్రామప్రజలు అతనిని హేళన చేయడం ప్రారంభించారు. అయినా సరే.. ఆ రైతు విత్తనాలకు నీళ్లు పోయడం, ఆ గుంతల్ని సంరక్షించడం మాత్రం మానలేదు. అలా రెండు కాదు.. మూడు కాదు.. నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోయింది. దీంతో వయసు పెరుగుతున్న కొద్దీ ఆ రైతులో నిరాశ, నిస్పృహలు ఆవహించడం మొదలుపెట్టాయి. 'ఇక కుటుంబాన్ని పోషించాలనుకునే నా కల కలగానే మిగిలిపోతుందే'మోనని చాలా నిరుత్సాహపడతాడు. అయినా లోపల ఎంత బాధ ఉన్నా, అవతలి వాళ్లు హేళన చేస్తున్నా వాటికి నీళ్లు పోస్తూ తన పని తాను చేసుకుంటూ పోతాడు. కొన్నిసార్లు ఇన్నేళ్లు దీని కోసం ఎదురుచూసి పొరపాటు చేశానేమోనని నిరాశపడుతుంటాడు. అలా ఐదో సంవత్సరం కూడా గడిచిపోతుంది.

*****

ఆ తర్వాత రైతుకి విత్తనాలకు నీళ్లు పోసే ఓపిక కూడా క్రమంగా సన్నగిల్లుతుంది. ఈ క్రమంలోనే ఓ రోజు వాటికి నీళ్లు పోసి అక్కడే నిలబడి, 'నేను విత్తనాలు సరిగా నాటలేదేమో, నీళ్లు లోపలకి వెళ్లలేదేమో, ఒకవేళ నీరు ఎక్కువకావడం వల్ల విత్తనం కుళ్లిపోయిందా'.. అనుకుంటూ తన అంతరంగలో ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాడా రైతు..! విలువైన సమయాన్ని, శక్తిని వృధా చేసుకున్నాననుకుంటూ ఆ రైతు తనని తాను నిందించుకుంటూ ఇంటికెళ్లిపోయాడు. మరుసటి రోజు యథావిధిగా విత్తనాలు నాటిన చోటుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూసి ఆనందంతో ఎగిరి గంతేశాడు. పొలం నుంచి గట్టిగా నవ్వుతూ ఇంటికి పరుగెత్తుకెళ్లాడు. ఇంట్లో వాళ్లని తీసుకొచ్చి అప్పుడప్పుడే మొలకెత్తుతున్న తన కలల చెట్లను వారికి చూపించాడు. వాటిని చూసిన ఆ రైతు తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయాడు.

అలా మొలకెత్తిన ఆ చెట్టు కొన్ని రోజుల్లోనే 5 అడుగులు పెరిగింది. తర్వాత 10, 20, 30, 40... అలా 90 అడుగుల వరకు పెరిగింది. ఇదంతా కేవలం ఆరు వారాల్లో అంటే 42 రోజుల్లోనే జరిగింది. ఎత్త్తెన ఆ చెట్ల గుండా రైతు నడుచుకొని వెళ్తూ చాలా సంతోషపడ్డాడు. ఐదేళ్లు కనీసం నేలని కూడా దాటని ఆ విత్తనం, ఆరు వారాల్లో 90 అడుగుల ఎత్తు పెరిగిందంటే చాలా అద్భుతమైన విషయం కదూ! అదే 'చైనీస్ బ్యాంబూ'!! మనం వెదురు చెట్టుగా చెప్పుకొనే ఆ చెట్టు నేల నుంచి అంత ఎత్తుకి ఎదగాలంటే ఆరు వారాలే పట్టినా, విత్తు నుంచి మొలకెత్తడానికి ఐదేళ్లు పడుతుంది. ఈ మధ్యలో దాని గురించి తెలుసుకోవడానికి గుంత తవ్వినా, నీళ్లు పోయకపోయినా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందన్న మాట!

నేర్చుకోవాల్సిన పాఠాలివే..!

ఇది కథ కాదు.. వాస్తవం.. దీన్నుంచి రైతు చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆయనతోపాటు మనమూ నేర్చుకోవాల్సిన పాఠాలు ఇందులో చాలానే ఉన్నాయి..

* మన కలని నెరవేర్చుకోడానికి ప్రయత్నం అనే విత్తనాన్ని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా నాటాలి.

* రోజూ మనం చేయాల్సిన పని చేస్తే, ఆలస్యమైనా ఫలితం మాత్రం కచ్చితంగా వస్తుంది.

* మనమేదైనా ప్రయత్నిస్తున్నపుడు పక్కవాళ్లు 'అది జరగదు.. సమయం వృథా..' అంటూ నిరుత్సాహపరచవచ్చు. అయినా సరే వాటిని పట్టించుకోకుండా ముందడుగు వేయాలి. మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడే విజయం సాధించే వీలు ఉంటుంది.

* గతాన్ని వదిలిపెట్టి చేయాల్సిన పని మీదే శ్రద్ధ పెట్టాలి.

* ఎదిగే చెట్టుకి నీరు ఎంత అవసరమో, మన అభివృద్ధికి కూడా సానుకూల ఆలోచనలు అంతే అవసరం.

* ఓర్పు వహిస్తే ఎంత కష్టమైన పనైనా పూర్తి చేసి విజయం సాధించవచ్చు. అదే ఆవేశంతో దాన్ని మధ్యలో ఆపేసినా, పట్టించుకోకపోయినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.

ఇలా ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. ఇంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తోన్న ఈ కథనం వీడియోను మీరూ ఒకసారి చూడండి..Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి