...ఈ గెలుపు వెనక!

ఈరోజే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి... గెలిచేది ఎవరైనా ఆ గెలుపుని నిర్ణయించడంలో మహిళలూ కీలకంగా మారారు. దేశవ్యాప్తంగా 31.2 కోట్ల మంది స్త్రీలు ఓటు హక్కుని వాడుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే అద్భుతమిది. భారతదేశంలాంటి పురుషాధిక్య సమాజంలో ఉండీ బాధ్యతగా ఓటువేసి తమలోని చైతన్యాన్ని చాటుకున్నారు..! 

Updated : 04 Jun 2024 08:27 IST

ఈరోజే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి... గెలిచేది ఎవరైనా ఆ గెలుపుని నిర్ణయించడంలో మహిళలూ కీలకంగా మారారు. దేశవ్యాప్తంగా 31.2 కోట్ల మంది స్త్రీలు ఓటు హక్కుని వాడుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే అద్భుతమిది. భారతదేశంలాంటి పురుషాధిక్య సమాజంలో ఉండీ బాధ్యతగా ఓటువేసి తమలోని చైతన్యాన్ని చాటుకున్నారు..! 

అది 1910.... లండన్‌ పార్లమెంటు ఎదురుగా మహిళలకూ ఓటు హక్కు కావాలని ఉద్యమకారులు ధర్నా చేస్తున్నారు. శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం కాస్తా...తీవ్రమై అరెస్టుల వరకూ వెళ్లింది. ఆ రోజు 119 మంది మహిళా ఉద్యమకారుల్ని అరెస్ట్‌ చేస్తే, అందులో యువరాణి సోఫియాదులీప్‌సింగ్‌ ఒకరు. ఆఖరి సిక్కు మహారాజు సర్‌దులీప్‌సింగ్‌ కుమార్తె అయిన సోఫియా... విక్టోరియా రాణి దగ్గర పెరిగింది. రాజభోగాల్ని కాదని, జీవితాంతం ప్రజాస్వామ్యానికి మూలమైన ఓటుహక్కు కోసం పోరాడింది. ‘నో ఓట్‌... నో ట్యాక్స్‌’ అంటూ నినదించింది. చివరికి ఆమె నగలూ, ఆస్తులూ జప్తుచేసినా వెనక్కి తగ్గలేదు. మాతృదేశం భారత్‌కు నాలుగుసార్లే వచ్చినా... వచ్చిన ప్రతిసారీ మిథాన్‌లామ్, అనిబిసెంట్, సరోజినీనాయుడు వంటివారిని కలిసి మనదేశంలోనూ మహిళా ఓటుహక్కు ఉద్యమానికి ఊపిరిలూదింది. అలా వారందరి కృషితో దేశానికి స్వాతంత్య్రం రావడంతోపాటే మనకి ఓటు హక్కూ వచ్చింది. వాస్తవానికి అదే ఓటు హక్కు కోసం.. అమెరికా, బ్రిటన్‌ మహిళలు వంద ఏళ్లకు పైగా పోరాడారు. మనకి ఓటు హక్కు అయితే వచ్చింది కానీ.. మనదేశ రాజకీయాల్లో పురుషులకున్న ప్రాధాన్యం మహిళా ఓటర్లకి ఉండేది కాదు. కారణం... దేశ జనాభాలో సగం ఉన్నా మనం ఓటు హక్కుని సంపూర్ణంగా వినియోగించుకున్నది తక్కువే. 

కథ మారింది అప్పుడే...

ఇప్పటివరకూ ఎన్నో సార్వత్రిక ఎన్నికలు జరిగినా... 2019 ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల్లో 67.18 శాతం మహిళలు ఓటేస్తే, మగవాళ్లు 67.02 శాతం మాత్రమే ఓటుహక్కుని వినియోగించుకున్నారు. జెండర్‌గ్యాప్‌ని తిరగరాసిన సందర్భం ఇది. రాజకీయ నిపుణులు దీనిని సైలెంట్‌ రెవల్యూషన్‌గా అభివర్ణించారు. ఈ 0.16 శాతమే ఎన్నికల కథని తిరగరాసి.. పార్టీలు మహిళాశక్తిని దృష్టిలో పెట్టుకుని ఎజెండాలు తయారుచేసేలా చేసింది. ఇక తాజా ఎన్నికల విషయానికొస్తే... 2019లో 54.3 కోట్లమంది ఓటుని వినియోగించుకొంటే, ఈసారి 64.2 కోట్లమంది ఓటు వేశారు. అందులో 31.2 కోట్లమంది మహిళలు ఓటుని వినియోగించుకుని రికార్డు సృష్టించారు. గత ఎన్నికలతో పోలిస్తే విశాఖపట్నంలో... 8.4 లక్షలమంది మహిళలు అధికంగా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జార్ఖండ్, పశ్చిమ్‌బంగ, బిహార్‌లలో మగవాళ్లకంటే మహిళలే అత్యధికంగా ఓట్లు వేశారు. 

స్త్రీలల్లో వస్తున్న చైతన్యానికి ఇదో నిదర్శనం. ఇన్నాళ్లూ మనం ఓటుని వినియోగించుకోకపోవడానికి పురుషాధిక్య భావజాలం, నిరక్షరాస్యత వంటివీ కారణాలే. మహిళా సాధికారత పెరగడంతో పాటు ఓటర్‌ ఎడ్యుకేషనల్‌ క్యాంపులు, ఇంటర్‌నెట్‌ వంటివి ఓటుహక్కు వినియోగంపై క్రమంగా అవగాహన తీసుకొచ్చాయి. ఒకప్పుడు మహిళలు వంటచేయడానికీ, నీళ్లు మోసుకురావడానికీ, కుటుంబ పనుల కోసమే రోజంతా కేటాయించేవారు. అంటే గుర్తింపులేని పనిలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఇంత చేస్తే వాళ్లపేరిట ఒక రేషన్‌ కార్డుకానీ, ఇల్లు కానీ ఉండేవి కాదు. కానీ వంటపనిని తేలిక చేసిన ఎల్‌పీజీ సిలిండర్లు, ఇంటింటికీ కుళాయిలూ, ప్రతి ఇంటికీ విద్యుత్‌ సదుపాయం వచ్చాక ఆడవాళ్ల సమయం గణనీయంగా మిగులుతోంది. ఆ విలువైన సమయాన్ని ఉత్పాదకతలోకి మార్చి... ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. తమకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ప్రభుత్వాలవైపు మొగ్గుచూపిస్తున్నారు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసే స్వయం సహాయక సంఘాల మహిళలూ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూ రాజకీయాలని ప్రభావితం చేసే బలమైన శక్తిగా మారారు. మరోవైపు రాజకీయ పార్టీలూ మహిళా శక్తిని గ్రహించాయి. కాబట్టే వాళ్ల మెప్పు పొందాలని ఉచిత బస్సులు, గ్యాస్‌ సిలిండర్లపై రాయితీలు, శానిటరీ న్యాప్కిన్ల పంపకం, నగదు పంపిణీ... ఆడవాళ్ల ఆత్మగౌరవాన్ని పెంచే టాయిలెట్ల నిర్మాణం వంటివాటికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. ‘ఆదాయం తీసుకొచ్చే మగవాళ్లకి అండగా ఉండటం, అణిగిమణిగి ఉండటం కంటే ఆ ఆదాయమేదో మనమే సంపాదిద్దాం అనే ఆలోచనా ధోరణి మహిళల్లో పెరిగింది. 96.8 కోట్ల ఓటర్లలో 47.1 కోట్లమంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారంతా తమ ఓటుని సంపూర్ణంగా వినియోగించుకోవడం మొదలుపెడితే ప్రభుత్వాల ఆలోచనా తీరుమారి మహిళల్ని దృష్టిలో పెట్టుకుని పాలసీలు తయారుచేస్తాయి’ అంటారు ఆర్థికవేత్త అయిన డాక్టర్‌ షామికా రవి. ఒకప్పుడు బస్సుల్లో మహిళల కోసం అంటూ ప్రత్యేకంగా సీట్లు ఉండేవి. తక్కినవన్నీ మగవాళ్లవే. తెలంగాణా సహా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడా పరిస్థితి లేదు. మగవాళ్లకే కొన్ని సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళా ఓటు బ్యాంకు పెరిగితే భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే! 


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్