Weight Loss: బరువు తగ్గాలంటే.. తూకం వేసుకుని తినాలట!

అధిక బరువు.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్య ఇది. అయితే బరువు తగ్గే క్రమంలో ఆహార నియమాలు, ఆహార పద్ధతులు, వ్యాయామాలు.. వీటిపైనే దృష్టి పెడతాం.. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతాం. అదే.. ఎంత తింటున్నామనేది! చాలామంది బరువు తగ్గకపోవడానికి ఈ నిర్లక్ష్యమే కారణమంటున్నారు నిపుణులు.

Published : 19 Jun 2024 22:05 IST

అధిక బరువు.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్య ఇది. అయితే బరువు తగ్గే క్రమంలో ఆహార నియమాలు, ఆహార పద్ధతులు, వ్యాయామాలు.. వీటిపైనే దృష్టి పెడతాం.. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతాం. అదే.. ఎంత తింటున్నామనేది! చాలామంది బరువు తగ్గకపోవడానికి ఈ నిర్లక్ష్యమే కారణమంటున్నారు నిపుణులు. అదే సమతులాహారాన్ని తూకం వేసుకొని తీసుకుంటే.. అధిక బరువు నుంచి త్వరలోనే విముక్తి పొందచ్చంటున్నారు. చాలామంది సెలబ్రిటీలు బరువు తగ్గి నాజూగ్గా మారేందుకు ఈ పద్ధతినే పాటిస్తున్నట్లు చెబుతున్నారు. మరి, ఏంటీ తూకం పద్ధతి? తెలుసుకుందామా?!

బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు.. అన్ని పోషకాలున్న సమతులాహారం తీసుకుంటారు. అయితే దీన్ని అమితంగా కాకుండా కొలతల ప్రకారం తీసుకుంటే త్వరగా, ప్రభావవంతంగా లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇలా తూకం వేసుకొని ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో పెట్టుకోవడమే కాదు.. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచీ విముక్తి పొందచ్చంటున్నారు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయంటున్నారు.

తూకం.. అందుకేనట!

⚛ సమతులాహారమే అయినా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. ఇవి కొవ్వుగా రూపాంతరం చెంది.. శారీరక బరువును పెంచుతాయి. అదే తూకం వేసుకొని వీటిని తీసుకుంటే బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ వ్యక్తిగత బరువు, వయసు, ఎత్తు, జీర్ణక్రియ పనితీరు, ఆడ-మగ, వ్యాయామం చేసే వారు-చేయని వారు.. క్యాలరీలు తీసుకునే విషయంలో ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, నిపుణుల సలహా మేరకు కావాల్సినన్ని క్యాలరీలు మాత్రమే తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

⚛ శరీరానికి కావాల్సిన అత్యవసర పోషకాలు, సూక్ష్మ పోషకాల అవసరమూ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కాబట్టి వీటికి అనుగుణంగా ఆయా పోషకాలు లభించే పదార్థాల్ని కొలతల ప్రకారం తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా పోషకాహార లోపం తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ మధుమేహంతో బాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయుల్ని బ్యాలన్స్‌ చేసుకోవడం ముఖ్యం. ఈ క్రమంలో కార్బోహైడ్రేట్లపై దృష్టి సారించడం ముఖ్యం. తమ చక్కెర స్థాయులకు అనుగుణంగా వీటినీ తూకం వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది.

⚛ ఆహారాన్ని తూకం వేసుకొని తీసుకోవడం వల్ల మనసు పెట్టి తినే అలవాటు పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందుతాయి.. మనసూ తృప్తి పడుతుంది. ఈ రెండూ పరోక్షంగా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.


ఎలా కొలుచుకోవాలి?

ఆహారాన్ని కొలుచుకొని తీసుకునే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

⚛ వ్యక్తిగత బరువు, అవసరాల్ని బట్టి ఎంత ఆహారాన్ని తీసుకోవాలో కొలుచుకోవడానికి మెషీన్, స్కేల్‌, స్పూన్లు, డిజిటల్‌ స్పూన్లు.. వంటివి మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని ఎంచుకుంటే సరైన మోతాదులో ఆహారం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.

⚛ భోజనం చేసే ప్లేట్‌ పెద్దగా ఉంటే.. అందులో ఎంత ఆహారం పెట్టుకున్నా తక్కువగానే కనిపిస్తుంది. ఇది ఆహారం ఇంకా తీసుకోవాలన్న కోరికను పెంచుతుంది. తద్వారా ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అందుకే భోజనం చేసే ప్లేట్‌, గ్లాస్‌ చిన్నవి ఎంచుకోమంటున్నారు నిపుణులు.

⚛ మీ శరీరానికి కావాల్సిన పోషకాల అవసరాన్ని బట్టి ప్లేట్‌లో ఆహారాన్ని సమాన భాగాలుగా వడ్డించుకోవడం వల్ల కూడా సరైన మోతాదులో ఆహార తూకాన్ని పాటించచ్చంటున్నారు నిపుణులు.

⚛ ఆహారాన్ని తూకం వేయడానికి ఎలాంటి మెషీన్లు, స్కేల్స్‌ లేకపోయినా.. అరచేతితో కొలిచి తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మహిళలు తమ అరచేతిలో పట్టేంత పరిమాణంలో ప్రొటీన్లు, గుప్పెడు పరిమాణంలో సలాడ్స్‌, కప్‌-హ్యాండ్‌ పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, బొటన వేలంత కొవ్వులున్న ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. అదే పురుషులు దీనికి రెట్టింపు తూకం వేసి తీసుకోవాల్సి ఉంటుందట!

⚛ రెస్టరంట్లకు వెళ్లినప్పుడు సాధారణంగానే ఎక్కువ ఆహారం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడా తూకం పాటించాలనుకునే వారు.. ప్రతి ఆర్డర్‌లో సగానికి కుదించి ఆర్డర్‌ చేయడం మంచిదట! ఇక బఫే తరహా భోజనాలు, అపరిమితంగా భోజనం వడ్డించే రెస్టరంట్ల జోలికి అస్సలు పోకూడదట!

⚛ భోజనానికి అరగంట ముందు గ్లాసు మంచి నీళ్లు తాగడం వల్ల తక్కువ ఆకలేసి.. మితంగా ఆహారం తీసుకునే వీలుంటుంది.

⚛ గబగబా తినేయడం వల్ల కూడా ఎక్కువగా తినే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఫోన్లు, టీవీలు, ఇతర గ్యాడ్జెట్లన్నీ పక్కన పెట్టి.. నెమ్మదిగా నములుతూ, ఆస్వాదిస్తూ ఆహారం తీసుకుంటే మితంగా తీసుకోవచ్చంటున్నారు.

⚛ కొన్ని ఆహార పదార్థాల ఫుడ్‌ లేబుల్స్‌పై సర్వింగ్‌ సైజుల్ని పొందుపరుస్తారు. అయితే చాలామంది వీటిని పట్టించుకోకుండా తమకు నచ్చినంత వండుకొని తీసుకుంటారు. అలాకాకుండా సర్వింగ్‌ సైజుల్ని బట్టి తీసుకోవడం కూడా తూకం వేసుకొని తీసుకున్న దాంతో సమానమంటున్నారు నిపుణులు.

⚛ రోజూ మనం తూకం వేసుకొని తీసుకునే పోషకాల పరిమాణాన్ని ఎప్పటికప్పుడు నోట్‌ చేసుకోవడం వల్ల కూడా.. మనం ఎంత తీసుకుంటున్నాం.. ఇంకెంత తీసుకోవాలి అన్న విషయాలు అర్థమవుతాయి. ఇది కూడా అమితంగా ఆహారం తీసుకోకుండా అడ్డుకట్ట వేస్తుంది.

కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సరైన మోతాదులో ఆహారం తీసుకోవడం మంచిది. తద్వారా బరువు తగ్గడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయి. ఒకవేళ ఈ క్రమంలో ఎలాంటి సందేహాలు ఎదురైనా నిపుణుల సలహాలు తీసుకొని పాటిస్తే.. మరింత మేలు జరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్