Updated : 13/10/2022 14:07 IST

ఆలుమగల అనుబంధాన్ని పెంచే ‘కర్వాచౌత్’!

భర్త, కుటుంబ క్షేమాన్ని కోరుతూ మహిళలు ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తుంటారు. కర్వాచౌత్ కూడా అలాంటిదే! ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకొనే ఈ పండగను ఇప్పుడు దక్షిణాదిన కూడా కొంతమంది జరుపుకొంటున్నారు. రోజంతా ఉపవాసం చేసి.. సాయంత్రం జల్లెడలో చంద్రుడిని చూసి.. ఆపై భర్త ముఖాన్ని చూసి దీక్ష విరమిస్తారు అతివలు. ఇటు ఆనందాన్ని, అటు ఆధ్యాత్మికతను పంచే ఈ పండగ.. ఆలుమగల మధ్య అనుబంధాన్నీ దృఢం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..!

ఆ నిబద్ధతే జీవితాంతం..!

కర్వాచౌత్ పండగలో భాగంగా మహిళలు తమ భర్త క్షేమాన్ని, కుటుంబ శ్రేయస్సును కాంక్షించి రోజంతా ఉపవాస దీక్ష చేస్తుంటారు. ఇక భార్యలు తమ కోసం అంత చేస్తున్నప్పుడు.. వారికోసం మేమూ ఉపవాసం ఉంటామంటూ ఈ రోజుల్లో చాలామంది భర్తలు కూడా ఆ రోజు ఉపవాసం చేయడం చూస్తున్నాం. ఇక సాయంత్రం వెన్నెల వెలుగుల్లో ఇద్దరూ జల్లెడలో ఒకరినొకరు చూసుకొని.. ఒకరి చేతుల మీదుగా మరొకరు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. నిజానికి ఇలా ఈ రోజు ఒకరి కోసం మరొకరు పడే ఆరాటం ఆలుమగలిద్దరి మధ్య ప్రేమను, అనుబంధాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. అలాగని ఈ ఒక్కరోజుతోనే వదిలేయకుండా.. ప్రతి విషయంలోనూ ఈ నిబద్ధతను దంపతులిద్దరూ జీవితాంతం కొనసాగిస్తే అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకోవచ్చంటున్నారు.

మూన్‌లైట్‌ డిన్నర్..!

వృత్తిఉద్యోగ బాధ్యతల్ని భార్యాభర్తలిద్దరూ సమానంగా పంచుకుంటోన్న ఈ రోజుల్లో ఇంటి పనుల్నీ కలిసే చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఒకరికి ఇష్టమైన వంటకాల్ని మరొకరు తయారుచేసి సర్‌ప్రైజ్‌ చేయడం పరిపాటిగా మారిపోయింది. కర్వాచౌత్ కూడా దంపతులకు అలాంటి అవకాశమే అందిస్తోంది. ఇందులో భాగంగా రోజంతా ఒకరి కోసం మరొకరు నిర్జల ఉపవాస దీక్షకు పూనుకున్నప్పుడు.. దీక్ష విరమణ కోసం తయారుచేసుకునే ప్రత్యేక వంటకాల్లో మీ పాకశాస్త్ర నైపుణ్యాల్ని ప్రదర్శించచ్చు.. ఇలా వంటకాలు సిద్ధమయ్యాక.. జల్లెడలో చంద్రుని చూసి.. ఒకరి ముఖం మరొకరు చూసుకున్నాక.. ఆ వెన్నెల వెలుగుల్లోనే క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటుచేసుకుంటే.. ఇష్టంగా తయారుచేసిన వంటకాల్ని ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటే..? భలే ఉంది కదా.. ఈ ఐడియా! ఆలస్యమెందుకు? అమలు చేసేయండి..! ఇలా గడిపిన ఏకాంత సమయం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

ఓ సారీ.. ఓ థ్యాంక్యూ!

భార్యాభర్తల మధ్య ప్రేమే కాదు.. అప్పుడప్పుడూ చిన్న చిన్న తగాదాలు చోటుచేసుకోవడం.. తిరిగి కలిసిపోవడం.. వంటివి ఉంటేనే అనుబంధం మరింత దృఢమవుతుందంటారు నిపుణులు. చిన్న చిన్న మాట పట్టింపులతో అప్పటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న దంపతులు కూడా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తిరిగి కలిసిపోవడం మామూలే. కర్వాచౌత్ పండగ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ క్రమంలో తనతో పాటు కుటుంబ క్షేమాన్ని కాంక్షించే భార్య కోసం భర్త కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్పు కానే కాదంటున్నారు నిపుణులు. అలాగే ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాల్ని పరిష్కరించుకోవడానికి.. తప్పైతే ఓ సారీ, ప్రశంసించాలనుకుంటే ఓ థ్యాంక్యూ చెప్పి దూరాన్ని దగ్గర చేసుకోవచ్చంటున్నారు. నిజానికి సాధారణ సమయాల్లో కంటే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ తమ సమస్యల్ని పరిష్కరించుకుంటే.. అది వారికి ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇక ఈ రోజు ఇద్దరూ కలిసి గడిపే సమయం.. అప్పటిదాకా ఒకరినొకరు మిస్సయిన ఫీలింగ్‌నీ దూరం చేస్తుంది.. కాబట్టి అనుబంధమూ దృఢమవుతుంది.

అత్తా-కోడళ్ల అనుబంధానికీ..!

కర్వాచౌత్ పండగ ఆలుమగల మధ్య ప్రేమను పెంచడమే కాదు.. కోడలికి-అత్తింటి వారికీ మధ్య ఉన్న అనురాగాన్నీ, అందులోనూ అత్తాకోడళ్ల మధ్య అనుబంధాన్నీ దృఢం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకొనే ఈ పండగ సందర్భంగా కోడలికి అత్తగారు ప్రత్యేకంగా ‘సర్గి’ తయారుచేసి అందించడం ఆనవాయితీ! దక్షిణాదిలో మనం జరుపుకొనే అట్లతద్దిలో మాదిరిగా కర్వాచౌత్ రోజున ఉపవాస దీక్ష తీసుకోబోయే కొన్ని గంటల ముందు ఆహారంగా తీసుకునే ప్రత్యేక థాలీ ఇది. స్వీట్లు, పండ్లు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్‌.. వంటి ప్రత్యేక పదార్థాలతో తయారుచేసిన ఈ సర్గిని అత్తగారి ఆశీర్వాదంతో పండగ రోజున సూర్యోదయానికి ముందే తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ రోజంతా ఉపవాస దీక్ష చేసినా అలసిపోకుండా ఉండచ్చు. ఇదేవిధంగా ఈ రోజున అత్తాకోడళ్లు పరస్పరం కొన్ని బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటన్నిటివల్ల ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని