Updated : 18/02/2023 07:29 IST

దాంపత్యానికి అర్ధం చెప్పారు!

కొండలరాజు బంగారు కొండ.. పార్వతి! భార్య మనసెరిగిన మంచుకొండల స్వామి.. శివుడు! ఈ ఆది దంపతులు అనాదిగా చెబుతున్న దాంపత్య పాఠాలు అందరికీ స్ఫూర్తిదాయకమే! భార్యాభర్తల మధ్య అలకలు కాస్తా కిలకిలలుగా మారడానికి ఈ అర్ధనారీశ్వరులు చెబుతున్న అనుబంధ పాఠాలేంటో చూద్దాం...

పార్వతీ పరమేశ్వరుల దాంపత్య వైభవం ఈనాటికీ ఆదర్శప్రాయమే! తపించి వివాహం చేసుకున్న వారి ప్రేమ నానాటికీ ముదిరి పాకాన పడిందే గానీ ఇద్దరి మధ్యా పొరపొచ్చాలకు తావివ్వలేదు. ఒకరి అభిరుచులని, అభిప్రాయాలని మరొకరు గౌరవించటమే దానికి కారణం. ప్రతి అనుబంధంలోనూ ముఖ్యంగా దాంపత్య బంధానికి ఇది చాలా అవసరం. నిజమైన ప్రేమ అంటే అదే మరి. నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలని కాక నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అన్నట్టు ఉండాలి. వీలైతే ఎదుటివారికి నచ్చినట్టు తాను మారుతూ ఉండొచ్చు. అది కూడా ఐచ్ఛికంగా జరగాలి. బలవంతంగా కాదు.

మాటకి విలువ..

తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు వెడదాం అంటుంది సతీదేవి. ‘పిలవలేదు కదా!’ అంటాడు శివుడు. ఆహ్వానం లేకుండా వెళ్లదగిన ప్రదేశాల్లో యజ్ఞం కూడా ఒకటి కదా, వెళ్లవచ్చు అంటుంది సతీదేవి. ఆమె మాట కాదనలేక ‘నీ ఇష్టం’ అంటాడు శివుడు. అంతేకానీ నన్ను పిలవలేదు కాబట్టి, నువ్వూ వెళ్లటానికి వీల్లేదని నిర్బంధించలేదు. పుట్టింటికి కదా.. ఆవిడేమో సరదాగా వెళ్లిపోయింది. తీరా పలకరింపులు లేక అవమాన భారంతో యాగాగ్నిలో శరీరాన్ని వదిలింది. తాను రాకుండా వెళ్లినందుకు తగిన శాస్తి జరిగిందనుకోలేదు పరమేశ్వరుడు. ఎంతో వేదన చెందాడు. రుద్రుడై యజ్ఞధ్వంసం చేశాడు. భార్య దేహాన్ని భుజాన వేసుకుని తాండవం చేశాడు. ఆపై తపస్సు చేసుకోవటానికి వెళ్లాడే కానీ మరో వివాహం చేసుకునే ప్రయత్నం చేయలేదు.

ఒకరి కోసం ఒకరు..

శివుడు మన్మథుణ్ణి భస్మం చేస్తే పార్వతీదేవి రతీదేవి కళ్లకి మాత్రం అతను కనపడే వరమిచ్చింది. భర్త మాటని వమ్ము చేయకుండానే రతీమన్మథులకి మేలు చేసింది. శివుడు కూడా ఇది నన్ను అవమానించినట్టు కాదా? అని కోపం తెచ్చుకోలేదు. అమ్మవారికి ‘శివదూతి’ అనే నామం ఉంది. అంటే శివుణ్ణి తన దూతగా చేసుకుందని అర్థం. నీకు నేను దూతగా ఉండాలా అని ఆత్మన్యూనతా భావం పొందలేదు శివుడు.. ఆనందంగా ఆ కార్యం నిర్వర్తించాడు. సౌందర్యలహరి అంతా శివుడు పార్వతిని కీర్తించినదే. అందులోనే అమ్మవారి నాలుక శివుడి ఘనకార్యాలను కీర్తించటం వల్ల ఎర్రగా మారింది అని వర్ణించారు. ఒకరంటే ఒకరికి అంత ఇష్టం.  

ఇద్దరి అభిరుచులు కూడా వేర్వేరు. అలాగని బలవంతంగా మార్చుకోలేదు. శివుడి వాహనం నంది. అమ్మవారి వాహనం సింహం. కానీ శివపార్వతుల వద్ద అవి రెండు జాతి వైరాన్ని మరచి సన్నిహితంగా మెలగుతాయి. కుమారుల వాహనాలూ అంతే. వినాయకుడి వాహనమైన ఎలుక, శివుడి ఆభరణాలైన సర్పాలు, కుమారస్వామి వాహనమైన నెమలి సహజ వైరాన్ని మరచి సయోధ్యగా ఉంటాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే, పరివారమంతా చక్కగా ఉంటుందనడానికి మచ్చుకే ఇది!

పార్వతీపరమేశ్వరులు తపస్సు చేసి తపఃఫలంగా ఒకరినొకరు పొందారు. ఈ భార్యాభర్తలకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో! ఎంతగా తపించారంటే చిక్కి, సగమై పోయారు. ఇద్దరూ కలిస్తే గానీ పూర్ణత్వం రాలేదు. శివుడు స్థాణువై పోయాడు. పార్వతి రాలిన ఆకులు కూడా తినకుండా కోరికలు చిగురించకుండా మోడువారి పోయి తపస్సు చేసింది. ఇలాంటి అపురూపమైన గుణాలు ఇద్దరిలోనూ సమానంగా ఉండటం విశేషం. అందుకే వారి దాంపత్యం దివ్యం. అటువంటి వారికి నా నమస్సులు అంటారు జగద్గురువులైన శంకరులు.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని