Pebbling: ఆ పెంగ్విన్లలా ప్రేమించేద్దాం!

ప్రేమించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌! కొందరు విలువైన కానుకలిచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తే.. మరికొందరు ఎదుటివారికి నచ్చిన పని చేస్తూ వారిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంటారు. ఇంకొందరు లగ్జరీ లైఫ్‌స్టైల్‌తోనే నచ్చిన వారి మనసు గెలుచుకోవచ్చనుకుంటారు. మరి, ప్రేమంటే విలువైన కానుకల్లోనే ఉందా? విలాసవంతమైన జీవన శైలి ద్వారా మాత్రమే ఎదుటివారి మనసు గెలుచుకోవచ్చా? అంటే.. కాదంటున్నారు నిపుణులు.

Published : 18 Jun 2024 21:23 IST

ప్రేమించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌! కొందరు విలువైన కానుకలిచ్చి తమ ప్రేమను వ్యక్తం చేస్తే.. మరికొందరు ఎదుటివారికి నచ్చిన పని చేస్తూ వారిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంటారు. ఇంకొందరు లగ్జరీ లైఫ్‌స్టైల్‌తోనే నచ్చిన వారి మనసు గెలుచుకోవచ్చనుకుంటారు. మరి, ప్రేమంటే విలువైన కానుకల్లోనే ఉందా? విలాసవంతమైన జీవన శైలి ద్వారా మాత్రమే ఎదుటివారి మనసు గెలుచుకోవచ్చా? అంటే.. కాదంటున్నారు నిపుణులు. ఇందుకు.. అడెలీ, జెంటూ జాతికి చెందిన పెంగ్విన్లనే ఉదాహరణగా చూపిస్తున్నారు! తాము మనసు పడ్డ ఆడ పెంగ్విన్లకు చిన్న చిన్న గులకరాళ్లను బహుమతిస్తూ.. వాటిపై ఉన్న ప్రేమను చాటుకుంటాయట ఈ జాతులకు చెందిన మగ పెంగ్విన్లు. ఇలా సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే ఈ పక్షుల ప్రేమనే ‘పెబ్లింగ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ని పాటించే జంటలు క్రమంగా పెరుగుతున్నాయంటున్నారు. మరి, ఇంతకీ ఏంటీ సరికొత్త లవ్‌ ట్రెండ్? నచ్చిన వారితో అనుబంధాన్ని పెంచుకోవాలంటే దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

గులకరాళ్లే.. ప్రేమ కానుకలు!

ప్రేమించాలంటే ఓ రేంజ్‌ ఉండాలనుకుంటారు కొందరు. కానీ భాగస్వామిని అర్థం చేసుకొనే మంచి మనసుంటే చాలని నిరూపిస్తున్నాయి అడెలీ, జెంటూ జాతికి చెందిన పెంగ్విన్లు. ‘ఒకదాని కోసం మరొకటి పుట్టాయేమో’ అన్నట్లుగా ప్రేమగా మెలిగే ఈ రెండింటికీ మధ్య ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంటుంది. ఇవి అంటార్కిటికాలో ఎక్కువగా కనిపిస్తాయి. మగ పెంగ్విన్‌ తన మనసుకు నచ్చిన ఆడ పెంగ్విన్‌ కనిపించగానే.. మృదువుగా ఉండే గులకరాళ్లను సేకరించి.. వాటిని ఆడ పెంగ్విన్‌కు అందిస్తూ తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తుంది.. దాని సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. ఒకవేళ ఈ ప్రేమ ప్రతిపాదన ఆడ పెంగ్విన్‌కు నచ్చితే ఆ గులకరాళ్లను స్వీకరిస్తుంది. ఆపై వాటితో తన ఆవాసాన్ని నిర్మించుకుంటుంది. అందులోనే ఈ పెంగ్విన్ల జంట కాపురం పెడతాయి. ఆపై ఆడ పెంగ్విన్‌ అందులోనే గుడ్లు పెడుతుంది. ఇలా ఈ పెంగ్విన్ల ప్రేమ నిరాడంబరతకు, అనుబంధంలోని నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తుంది. అంతేకాదు.. భాగస్వామిపై తమకున్న కేరింగ్‌, బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ జంట పక్షుల ప్రేమ. ఇలా ప్రేమంటే విలువైన వస్తువులు, కానుకల్లో లేదని.. ఒకరినొకరు అర్ధం చేసుకుని మెలగడంలోనే ఉందని తెలిపే ఈ పక్షుల ప్రేమను ‘పెబ్లింగ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు.


ఇదీ అనురాగమే!

ప్రేమికులైనా, భార్యాభర్తలైనా.. తమ మనసులోని ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడంలో ఈ పక్షుల్ని స్ఫూర్తిగా తీసుకుంటే.. తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో విలువైన కానుకలే కాదు.. వివిధ రూపాల్లోనూ తమ మనసులో దాగున్న ప్రేమను వ్యక్తం చేయచ్చంటున్నారు. అదెలాగంటే..!

⚛ మెచ్చిన రంగు పువ్వులు, నచ్చిన ఫ్లేవర్‌ చాక్లెట్లు ఇచ్చినా.. ఎదుటివారి మనసు సంతోషపడుతుంది. మీ మనసులో ఉన్న ప్రేమా వారికి అర్థమవుతుంది.

⚛ సోషల్‌ మీడియా వచ్చినప్పట్నుంచి యువత మరింత సృజనాత్మకంగా తమ మనసులోని ప్రేమను భాగస్వామికి తెలియజేస్తున్నారు. రొమాంటిక్‌ సందేశాలు, మీమ్స్‌, ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు.. ఆలోచిస్తే ఇలాంటి ఐడియాలకు కొదవే లేదు. మీరూ ఇలా సింపుల్‌గా మీ భాగస్వామికి ప్రేమ ప్రతిపాదన చేయచ్చు.

⚛ ఎప్పుడైనా భాగస్వామితో కలిసి వెకేషన్‌కి వెడితే ఆ జ్ఞాపకాలు మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఈ క్రమంలో బీచ్‌కి వెళ్లిన వారిలో కొందరికి గవ్వలు, గులకరాళ్లు.. వంటివి సేకరించే అలవాటు ఉంటుంది. వాటినీ మీ భాగస్వామికి స్వీట్‌ మెమరీగా అందించచ్చు. వాటిని అలాగే కాకుండా.. వాటిపై వాళ్ల పేరు రాయించడం, ఫొటోలు ప్రచురించడం.. ఇలా కస్టమైజ్‌ చేయించి కూడా అందించచ్చు.

⚛ మీరిచ్చే కానుకల్లోనే కాదు.. మీ చేతల ద్వారా కూడా భాగస్వామిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయచ్చు. ఈ క్రమంలో వారికి ఇష్టమైన వంటకం తయారుచేసి సర్‌ప్రైజ్‌ చేయడం, మీరే స్వయంగా తినిపించడం, వాళ్లకు నచ్చిన ప్రదేశాలకు టూర్‌ ప్లాన్‌ చేసుకోవడం.. వంటివి చేయచ్చు. ఇవీ వారిపై ఉన్న అనురాగానికి ప్రతీకలే!

⚛ బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా ఈ రోజుల్లో చాలా జంటలకు ఏకాంతంగా సమయం గడిపే అవకాశం దొరకట్లేదు. కానీ వీలు చూసుకొని రోజూ ఒకరికొకరు కాసేపు సమయం కేటాయించుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు. ఇదీ ‘పెబ్లింగ్‌’ ట్రెండ్‌లో ఓ భాగమేనని చెబుతున్నారు. భాగస్వామిపై తమ మనసు లోతుల్లో ఉన్న ప్రేమను ఇలా పరోక్షంగా వ్యక్తం చేయచ్చంటున్నారు.

⚛ పని ఒత్తిడితో అలసిపోయిన భాగస్వామిని ఆ ఒత్తిడిలో నుంచి బయట పడేయడం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం కూడా.. భాగస్వామిపై తమకున్న కేరింగ్‌ను, ప్రేమను తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్