close
Published : 29/10/2021 16:00 IST

మెంటార్‌గా మీ టీమ్‌ని ఎలా గైడ్ చేస్తున్నారు?

స్వప్న ఓ కార్పొరేట్‌ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో నాలుగైదు టీమ్స్‌కి బాధ్యత వహిస్తోన్న ఆమె తన కొలీగ్స్‌తో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతుంటుంది.

ఓ కంపెనీకి బాస్ అయిన పూర్ణ.. తానెంత క్రమశిక్షణతో మెలుగుతుందో.. తన కింది స్థాయి ఉద్యోగులతో అంతకంటే ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఇది నచ్చని కొందరు సహోద్యోగులు ఆమెది పొగరనుకుంటారు.

ఉద్యోగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా ఇలాగే ఉండకపోవచ్చు.  కొంతమంది హోదాను ప్రదర్శించచ్చు.. మరికొంతమంది పొగరుగా, అన్నీ నాకే తెలుసన్నట్లుగా వ్యవహరించచ్చు. అయితే ఇలాంటి అతి విశ్వాసాన్ని పక్కన పెట్టి.. కింది స్థాయి ఉద్యోగులకు మీ అనుభవాలే స్ఫూర్తి పాఠాలు కావాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరే వారికి మెంటార్‌గా వ్యవహరిస్తూ వారిని తీర్చిదిద్దాలంటున్నారు. తద్వారా అటు వారు లబ్ధి పొందుతూనే.. ఇటు మీరూ కెరీర్‌లో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించచ్చు. మరి, ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులకు మెంటార్‌గా వ్యవహరించాలంటే వాళ్లేం చేయాలో తెలుసుకుందాం రండి..

మీ అనుభవం.. వారికి పాఠం!

కెరీర్‌లో ఉన్నత స్థానాల్ని అధిరోహించాలంటే మాటలు కాదు. ఈ క్రమంలో ఎన్నో బాధ్యతల్ని భుజాలకెత్తుకోవాల్సి ఉంటుంది. మరెన్నో సవాళ్లను దాటాల్సి వస్తుంది. అందులోనూ మీకు కొన్ని మంచి జ్ఞాపకాలను అందిస్తే.. మరికొన్ని చేదు అనుభవాలుగా మిగిలిపోవచ్చు. అయితే కొంతమంది కెరీర్‌లో తమకు కలిసొచ్చిన సందర్భాలు, మంచి అనుభవాలను మాత్రమే సహోద్యోగులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. చేదు జ్ఞాపకాలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు తమ కింది స్థాయి ఉద్యోగులతో చర్చిస్తే.. తామెక్కడ లోకువైపోతామోనన్న ఫీలింగ్‌తో వాటి గురించి చెప్పనే చెప్పరు. కానీ ఓ ఉన్నతోద్యోగిగా మీరు మీ కింది స్థాయి ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపాలనుకుంటే మాత్రం.. కెరీర్‌లో మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్నీ వారితో పంచుకోవడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారికి అందించే బాధ్యత కూడా మీదే! ఇలా కెరీర్‌లో ఉండే ఒడిదొడుకులు, మంచి చెడుల గురించి వారికి ముందే ఓ అవగాహన ఉంటే.. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా సంసిద్ధులవుతారు. ఓ మెంటార్‌గా మీరు వారితో వేయించే తొలి అడుగు ఇది!

తలపడనివ్వండి!

కింది స్థాయి ఉద్యోగుల బాధ్యత తీసుకోవడమంటే.. పనులన్నీ మీరే అరటి పండు ఒలిచిపెట్టినట్లుగా విడమరచి చెప్పమని కాదు.. వారికీ సవాళ్లతో కూడిన కొన్ని టాస్కులు అప్పగించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారికి అనుభవం లేని అంశాలకు సంబంధించిన పనులు చేయమని పురమాయించడంలో తప్పు లేదు. నిజానికి దీనివల్ల ఇటు మీకు, అటు వాళ్లకు కాస్త అసౌకర్యం కలుగుతుందన్న మాట వాస్తవమే అయినా.. వారు అన్ని విషయాల్లోనూ రాటుదేలేలా మీరు వారిని గైడ్‌ చేస్తున్నారన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో ఇలా కఠినంగా ఉంటేనే పనులు జరుగుతాయి. ఈ ధోరణి కెరీర్‌లో మిమ్మల్నే కాదు.. మీరు గైడ్‌ చేసే ఉద్యోగుల్నీ ఉన్నత స్థానాలు అధిరోహించేలా చేస్తుంది.

మౌనం వీడండి!

పని ప్రదేశంలో ఉద్యోగులందరూ ఒకేలా ఉండాలని లేదు. ఒకరు సౌమ్యంగా ఉండచ్చు.. మరొకరు దూకుడుగా వ్యవహరించచ్చు.. ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఇంకొందరు ఉంటారు.. తోటి ఉద్యోగులను లైంగికంగా వేధించేవారూ ఉండచ్చు. అయితే ఇలాంటి వారి వల్ల మీ కింది స్థాయి ఉద్యోగుల్లో ఎవరికైనా సమస్య ఎదురుకావచ్చు. అలాంటప్పుడు వారి సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తే.. సమస్య నాది కాదు కదా అని మౌనం వహించకుండా.. దాన్ని సంస్థ నిర్వాహకులు/మీ పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ క్రమంలో మరోసారి ఈ తప్పు చేయకుండా వారిని ఎలా అదుపు చేయాలి, బాధితులకు మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి.. వంటివన్నీ మీరే బాధ్యత తీసుకొని అధికారులతో మాట్లాడచ్చు. ఇలా సందర్భం వచ్చినప్పుడే కాదు.. మీరు మెంటార్‌గా వ్యవహరించే మీ బృందంలోని ఉద్యోగులతో తరచూ మాట్లాడడం, వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవడం.. వల్ల కూడా ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం పెరుగుతుంది. సంస్థ అభివృద్ధి చెందాలంటే ఉద్యోగుల మధ్య ఉండాల్సింది కూడా ఇలాంటి అనుబంధమే!

తప్పు.. చేస్తే తప్పేంటి?

ఈ సృష్టిలో ఎవరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌ కారు. పని ప్రదేశంలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. అనుభవజ్ఞులు, నైపుణ్యాలున్న వారు, ఉన్నత స్థానాల్లో ఉండే వారు కూడా తమ పనులు నిర్వర్తించే క్రమంలో ఏదో ఒక పొరపాటు దొర్లడం సహజమే! అలాంటిది అప్పుడే కొత్తగా చేరిన ఉద్యోగులు పని విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే వారిని మందలించడం, అన్నీ నాకే తెలుసన్నట్లుగా హోదా ప్రదర్శించడం కూడదంటున్నారు నిపుణులు. అలాంటి సమయంలో ఓ మెంటార్‌గా మీరు వారి తప్పుల్ని ఓపికతో సరిదిద్దాలంటున్నారు. ఈ క్రమంలో పొరపాటు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలో వారికి వివరించాల్సి ఉంటుంది. ఇలా మీరు బాధ్యతగా వ్యవహరించే తీరు కెరీర్‌లో ఇటు మీకూ ప్లస్‌ అవుతుంది.. అటు మీ కింది స్థాయి ఉద్యోగుల ఉన్నతికీ దోహదం చేస్తుంది.

వారికీ అవకాశమివ్వండి!

కింది స్థాయి ఉద్యోగులకు మెంటార్‌గా వ్యవహరించే క్రమంలో.. ఎప్పుడూ మీరు చెప్తే వారు వినడం, పనులు పురమాయించడం కాకుండా.. అప్పుడప్పుడూ పాత్రలు మార్చమంటున్నారు నిపుణులు. అంటే మీ మెంటార్‌షిప్‌ మీ కింది స్థాయి ఉద్యోగులకు ఇచ్చి.. మీరు సాధారణ ఉద్యోగిగా వ్యవహరించడమన్నమాట! దీన్నే ‘రివర్స్‌ మానిటరింగ్‌’ అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల్లోని నైపుణ్యాలను బయటికి లాగడానికి ఇలాంటి వ్యూహాన్నే అనుసరిస్తుంటాయట! నిజానికి ఇలా చేయడం వల్ల వారిలోని నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సమర్థత, సవాళ్లు ఎదుర్కొనే నైజం, వృత్తి నైపుణ్యాలు వంటివన్నీ బయటపడతాయి. వాటితో ఓ రిపోర్ట్‌ రూపొందించి మీరు మీ పై అధికారులకు అందించచ్చు. తద్వారా ఇటు మీకు, అటు మీ మెంటార్‌ గ్రూప్‌కి కెరీర్‌ విషయంలో ఇక తిరుగుండదు.

మరి, ఓ ఉన్నతోద్యోగిగా మీరు మీ కింది స్థాయి ఉద్యోగుల్ని ఎలా గైడ్‌ చేస్తున్నారు? ఆ చిట్కాలేవో మాతో పంచుకోండి!


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి