అలా ప్రేమబాటన సాగుతున్నారు!

ప్రేమంటే.. ఇష్టాన్ని తెలుపుకోవడమే కాదు. ఒకరికొకరు అండగా నిలవాలి. ముందుకు నడిచే ధైర్యమివ్వాలి. అలా సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారీ జంటలు. వాళ్ల కథలను మీరూ చదివేయండి.

Published : 14 Feb 2023 00:23 IST

ప్రేమంటే.. ఇష్టాన్ని తెలుపుకోవడమే కాదు. ఒకరికొకరు అండగా నిలవాలి. ముందుకు నడిచే ధైర్యమివ్వాలి. అలా సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారీ జంటలు. వాళ్ల కథలను మీరూ చదివేయండి.


రెండు దశాబ్దాల ప్రయాణం..

తనేమో సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయి. అతనిదేమో రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం. పైగా భిన్న మతాలు. కలిసుండటం కష్టమే అనుకున్నారంతా. కానీ జెనీలియా, రితేశ్‌ల పదేళ్ల వైవాహిక జీవితమేకాదు.. మునుపు దశాబ్ద కాలం ప్రేమ కూడా ఆదర్శమే!

2012లో అగ్రతారగా రాణిస్తున్నప్పుడే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది జెనీలియా. సినిమాలకూ దూరమైంది. ‘పలుకుబడి ఉన్న కుటుంబంలోకి వెళితే అంతే!’ అన్నారంతా. తనేమో ‘ఏడాదంతా షూటింగే! అలసిపోయా. ఇక నా సమయమంతా కుటుంబానికే కేటాయించాలనుకున్నా’ నంటుంది. 2003లో తొలిసినిమా ‘తుజే మేరీ కసమ్‌’ సినిమా షూటింగ్‌లో రితేష్‌ని కలిసింది. రితేష్‌ తండ్రి విలాస్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌ అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ‘బాగా డబ్బు, పలుకుబడి ఉన్న కుటుంబం. కాబట్టి, పొగరుంటుం’దని జెనీలియా దూరంగా ఉండేదట. దానికి భిన్నంగా రితేష్‌ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోవడం చూసి స్నేహం చేసింది. ప్రాణస్నేహితులు కాస్తా ప్రేమికులయ్యారు. ఎప్పుడూ ఒకరికొకరు ప్రేమిస్తున్న విషయాన్నే చెప్పుకోలేదట. పదేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతూ పెద్దల్ని కష్టపడి ఒప్పించి 2013లో పెళ్లి చేసుకున్నారు. ‘మా అమ్మతో నాకంటే జెనీలియానే ఎక్కువ ప్రేమగా ఉంటుంది. ఆర్ట్‌పై ఆసక్తి లేకపోయినా నాకోసం ఎగ్జిబిషన్లు, మ్యూజియాలకు వస్తుంది. పిల్లల బాధ్యతా తనదే. దర్శకత్వంపై నాకున్న ఆసక్తిని గ్రహించి, ప్రోత్సహించడమే కాదు నాకోసం నిర్మాతగానూ మారింది. తను దొరకడం నా అదృష్ట’మంటాడు రితేష్‌. ‘20 ఏళ్ల పరిచయం. పెళ్లయ్యాక ‘మంచి నటివి. ఆ ప్రతిభను వృథా చేసుకోకం’టూ రితేష్‌ ప్రోత్సహించేవాడు. పిల్లల గురించి ఆలోచించి నేనే వెనకడుగు వేసేదాన్ని. నాకంటూ సమయం ఉండాలని వారంలో కొన్నిరోజులు పిల్లల బాధ్యత తీసుకుంటాడు. తను దర్శకత్వం వహించిన ‘వేడ్‌’తో తిరిగి నటనపై దృష్టిపెట్టానంటే రితేషే కారణమం’టుంది జెనీలియా. ఒకరికొకరు స్వేచ్ఛనివ్వడం, అండగా నిలవడం, అనవసర విషయాలను పక్కన పెట్టేయడం వంటివే తమ అన్యోన్య దాంపత్యానికి కారణమంటారు వీళ్లు. అందుకే ఆదర్శ జంట అనిపించుకుంటున్నారు.


అభిమాని.. అర్ధాంగైంది..

అభిమానుల స్పందన తెలుసుకోవడానికి సినిమా బృందమంతా థియేటర్‌కి వెళ్లింది. కొత్త డైరెక్టర్‌ కావడంతో ఎవరూ గుర్తుపట్టలేదు. అందరూ హీరో, హీరోయిన్ల చుట్టూ చేరినవారే. ఓ మూలగా నిల్చొన్న అతన్ని గుర్తుపట్టి, తన అభిమానినని పరిచయం చేసుకుంది. కట్‌ చేస్తే రెండేళ్లలో భాగస్వామిగా అతని పక్కన నిల్చొంది. కాంతార హీరో రిషబ్‌, ప్రగతి శెట్టిల ప్రేమకథ ఇది!

2015.. తీసింది కొన్నే అయినా విజయవంతమైన డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్‌ శెట్టి. కానీ అది చూడగానే గుర్తించేంత మాత్రం కాదు. సినిమా రిలీజ్‌ రోజు ఓ మూలగా నిల్చొన్న ఆయనకి ‘అదిగో ఆయనే డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి. ఈ సినిమా తీసింది తనే. ముందు ఆయన్ని కలుద్దాం రండ’ంటూ స్నేహితులను తీసుకొస్తున్న ఓ అమ్మాయి మాటలు చెవిన పడ్డాయి. తలెత్తితే ఆమెని ఎక్కడో చూసిన భావన కలిగిందతనికి. ఆ బృందానికి ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు ఇచ్చి పంపాడు. కానీ ఆలోచన మొత్తం ఆమె చుట్టూనే. ఇంటికెళ్లి ఫేస్‌బుక్‌ తెరిస్తే ఏడాది క్రితం పంపిన ఆమె ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ కనిపించింది. వెంటనే ఓకే చేశాడు. అలా మొదలైన చాటింగ్‌ ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ‘ప్రగతి చూపే ప్రేమ, ప్రోత్సాహమే వైఫల్యాల్లో నేను ముందుకు సాగడానికి కారణమయ్యాయి. తనో ఐటీ ఉద్యోగి. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అస్థిరమైన నా కెరియర్‌ చూసి వాళ్లింట్లోవాళ్లు ఒప్పుకోలేదు. తన పట్టుదల చూసి దిగి వచ్చారు. పెళ్లయ్యాక కుటుంబం కోసం తన ఉద్యోగం వదిలేసింది. ఎవరు వేలెత్తి చూపినా.. తను మాత్రం నేను సాధించగలననే నమ్మింది. రెండోసారి గర్భం దాల్చినపుడు నేను తనతో సమయం గడిపిందీ తక్కువే. అయినా అర్థం చేసుకుంది. అంతేకాదు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సినిమాల్లోనూ సాయపడుతోంది. అందుకే నా ప్రతి విజయంలో నా భార్యకీ అర్ధభాగం దక్కుతుంది’ అంటాడు రిషబ్‌. ‘రిషబ్‌ నమ్మకం, ప్రోత్సాహమే కొత్తరంగంలో గుర్తింపు పొందే బలాన్నిస్తోందం’టుంది ప్రగతి. వీళ్ల ప్రేమకథ గూగుల్‌లో ట్రెండ్‌ అయ్యింది కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్