Published : 27/12/2022 20:04 IST

ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్‌ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

నేను నాలుగు నెలల గర్భిణిని. నాకు ఇంతవరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయితే గర్భధారణ సమయంలో కొంతమందిలో బీపీ, షుగర్‌ సమస్యలు వస్తాయని విన్నాను. ఇవి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీరు చెప్పినట్టుగా గర్భధారణ సమయంలో కొంతమందిలో బీపీ, షుగర్‌ సమస్యలు కనిపిస్తుంటాయి. ఈమధ్య కాలంలో ఇలాంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముందు వీటికి దారితీసే పరిస్థితులను అర్థం చేసుకుంటే వాటికి తగిన పరిష్కారాలను అన్వేషించవచ్చు.

జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల చాలామందిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రెగ్నెన్సీలో రక్తపోటు, మధుమేహం రావడానికి ఇది కూడా ఒక కారణమే. ఒత్తిడికి లోనవ్వడం, రాత్రి వేళల్లో పని చేయడం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, ఈ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు పోషకాహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి రెండు, మూడు గంటలకు ఏదో ఒక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విధంగా డైట్‌ని రూపొందించుకోవాలి. పాలు, నట్స్, పండ్లు, కూరగాయలు.. ఇలా మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్‌, ఫైబర్‌ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఈ సమయంలో శరీరానికి వ్యాయామం కూడా ఎంతో అవసరం. ఇందుకోసం తేలికపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. ఇక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయచ్చు. బరువు తగ్గినా, ఎక్కువగా పెరిగినా రెండూ నష్టమే. కాబట్టి, ఎప్పటికప్పుడు శరీర బరువును కూడా గమనిస్తుండాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రెగ్నెన్సీలో సాధ్యమైనంత వరకు బీపీ, షుగర్‌ని నియంత్రించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని