నిశ్చితార్థం తర్వాత బంధం దృఢమవ్వాలంటే..!
నిశ్చితార్థం.. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుక ప్రతి జంటకూ ఎంతో అపురూపం. ఈ వేడుక తర్వాతే కాబోయే దంపతులు ఒకరికొకరు సమయం కేటాయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. నిజానికి పెళ్లికి ముందు కాబోయే జీవిత భాగస్వామితో గడిపే ఈ సమయం....
నిశ్చితార్థం.. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుక ప్రతి జంటకూ ఎంతో అపురూపం. ఈ వేడుక తర్వాతే కాబోయే దంపతులు ఒకరికొకరు సమయం కేటాయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. నిజానికి పెళ్లికి ముందు కాబోయే జీవిత భాగస్వామితో గడిపే ఈ సమయం చాలా అమూల్యమైనదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మధుర జ్ఞాపకాల్ని మూటగట్టుకోవడమే కాదు.. మీ అనుబంధాన్నీ మరింత దృఢం చేసుకోవచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందామా?!
వీలైనంత ఎక్కువ సమయం..
నిశ్చితార్థం తర్వాత షాపింగ్, పెళ్లి పనులు అంటూ క్షణం తీరిక లేకుండా సమయం గడపడాల్సి వస్తుంది. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఒకరికోసం మరొకరు సమయాన్ని కేటాయించడం మర్చిపోవద్దు. వీలైనంత ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుకోవడం, అభిరుచులు పంచుకోవడం, ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం.. వల్ల భాగస్వామితో ఎలా నడుచుకోవాలో అవగాహన వస్తుంది. అలాగే భాగస్వామికి నచ్చిన పనులు చేయడం, ప్రత్యేక బహుమతులివ్వడం, మంచి పనులు చేస్తే ప్రశంసించడం.. ఇలాంటివన్నీ ఇద్దరి మధ్య దూరాన్ని క్రమంగా చెరిపేస్తాయి. దీంతో పాటు మీ పెళ్లి, పెళ్లి తర్వాత లక్ష్యాలు, హనీమూన్ ప్లానింగ్.. వంటివన్నీ ఇద్దరూ కలిసి ప్రణాళికలు వేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
భవిష్యత్తు ప్రణాళికలతో..
పెళ్లి కాబోయే ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తుకి సంబంధించి కొన్ని ఆలోచనలుంటాయి. కొంతమంది వివాహమైన వెంటనే పిల్లలు కావాలనుకుంటే.. మరికొందరు కొన్ని రోజులు ఆగాలనుకుంటారు. కొందరు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడితే.. మరికొందరు భవిష్యత్తు కోసం కొంత మొత్తం వెనకేసుకోవాలనుకొంటారు. ఇలాంటి ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. అప్పుడే ఇద్దరి అభిప్రాయాలకనుగుణంగా అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. ఈ క్రమంలో ఆలోచనలు కలవకపోతే గొడవ పెట్టుకోవడం కాకుండా మీరు చెబుతున్న విషయం ఎందుకు సరైందో అర్థమయ్యేలా ఎదుటివారికి వివరించాలి. అలాగే మీకు కాబోయే జీవితభాగస్వామి చెబుతున్న అంశాలను సైతం మీరు ఓపికగా వినాలి. తద్వారా ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి భవిష్యత్తుపై స్పష్టత ఏర్పడుతుంది. దానికనుగుణంగా ముందుకెళ్లడం ద్వారా వైవాహిక జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టవచ్చు.
స్నేహితులను కలుపుకోండి..
అమ్మాయైనా.. అబ్బాయైనా.. స్నేహితుల గ్యాంగ్ కచ్చితంగా ఉంటుంది. పెళ్లి ముందు వరకు ఎక్కువగా స్నేహితులతో గడిపిన వారు ఆ తర్వాత జీవిత భాగస్వామితోనే గడుపుతుంటారు. అలాంటి సందర్భాల్లో పెళ్లి తర్వాత ఫ్రెండ్స్‌ని మిస్సవుతున్నామనే భావన కొందరిలో ఉంటుంది. ఇంకొన్ని జంటల్లో ఒకరి స్నేహితులపై మరొకరికి సదభిప్రాయం ఉండదు. ఫలితంగా కొన్ని మనస్పర్థలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లోకి మీకు కాబోయే భాగస్వామిని కూడా ఆహ్వానించండి. సరదాగా అందరితో కలిసి టూర్ ప్లాన్ చేయండి. ఇలా కాబోయే భర్త స్నేహితులతో భార్య, భార్యామణి ఫ్రెండ్స్‌తో భర్త చెలిమి చేస్తే ఒకరి గురించి మరొకరికి మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఫలితంగా మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది.
సర్‌ప్రైజ్ చేయండి..
సర్‌ప్రైజ్‌లంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి?! మరి, మీకు కాబోయే భాగస్వామికి కూడా ఇలా ఏదో ఒక కానుకిచ్చి సర్‌ప్రైజ్ చేస్తే.. ఆ క్షణం వారికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కాబట్టి వారి మనసుకి నచ్చే వస్తువుని గిఫ్ట్‌గా అందించడం, వారికి నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం, ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టడం, తన ఆత్మీయులను పిలిచి పార్టీ ఇవ్వడం.. వంటివన్నీ వారి మనసులో మీ స్థానాన్ని మరింత పదిలపరిచేవే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.