Published : 13/02/2023 15:25 IST

మా పాపలో ఎలా మార్పు తీసుకురావాలి?

మా అమ్మాయికి పదేళ్లు. తను ఏది చెప్పినా వినదు. ఎదురు సమాధానం చెబుతుంటుంది. గట్టిగా అరుస్తుంది. అప్పుడప్పుడు నన్ను దెప్పిపొడిచినట్లు కూడా మాట్లాడుతుంది. చిన్న వయసే అయినా.. ఇలా మాట్లాడడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. నా భర్తకు చెబితే ‘నువ్వే ఇలా తయారు చేశావు’ అంటున్నారు. మా పాపలో ఎలా మార్పు తీసుకురావాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీ పాప వయసు పదేళ్లని చెబుతున్నారు. కాబట్టి, తన ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు కుటుంబ సభ్యులు కూడా కారణమే. వారు ఏది అడిగినా- ‘సరే’ అని అతిగా గారాబం చేయడం వల్ల వారిలో మొండితనం పెరుగుతుంది. దాంతో అబద్ధాలు చెప్పడం, కోపతాపాలు ప్రదర్శించడం, రుబాబు చేయడం, దుర్భాషలాడటం లాంటి అవలక్షణాలు వస్తుంటాయి. అలాగని వారు తప్పు చేసినప్పుడు తిట్టడం, కొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీరితో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది.

మీ పాప విషయానికి వస్తే తను ఎదురు సమాధానం చెప్పినప్పుడు ‘ఇలాంటి సమాధానం చెప్తే నువ్వు చెప్పిన మాట నేను వినను. సారీ చెప్పి మర్యాదగా మాట్లాడితే నీతో చర్చిస్తాను’ అని చెప్పాలి. అయితే ఇది మీరు మాత్రమే కాకుండా మీ భర్తతో పాటు ఇంట్లోని పెద్దవాళ్లు కూడా పాటించాలి. అలాగే క్రమశిక్షణతో మెలగడం అలవాటు చేయాలి. తద్వారా పాపలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

పిల్లలు ఇది ఒప్పు, ఇది తప్పు అనేది మన మాటలు, ప్రవర్తనను బట్టే నేర్చుకుంటారు. వారు ఎప్పుడూ మన ప్రతిస్పందనలను గమనిస్తుంటారు. ఒకవేళ మీ పాప ఎదురు సమాధానం చెప్పినప్పుడు ఊరుకుని తనకు కావాల్సిన పనులు చేసి పెట్టారనుకోండి. తను అది ఒప్పుగానే భావించే అవకాశం ఉంటుంది. అలాగే తప్పు చేసినప్పుడు మీరు మందలిస్తే తన తప్పును గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి, తన ప్రవర్తనలో ఎప్పుడు తేడా గమనించినా వెంటనే స్పందించండి. ‘ఇలా మాట్లాడకూడదు.. మర్యాదగా సమాధానం చెప్పాలి’ అని ప్రతిసారీ చెప్పడం ద్వారా ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా తమ ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని