Published : 27/12/2022 13:24 IST

మా కోడలు నా గురించి చెడుగా చెబుతోంది.. ఎలా మార్చాలి?

మాకు ఇద్దరబ్బాయిలు.. ఇద్దరమ్మాయిలు. పెద్దబ్బాయికి పెళ్లి చేశాం. వాళ్లిద్దరూ మాతోనే ఉంటున్నారు. మా కోడల్ని మేము బాగానే చూసుకుంటున్నాం. కానీ, తను మాతో సరిగా ఉండడం లేదు. మా అబ్బాయితో తప్ప ఇంట్లో ఎవరితోనూ మాట్లాడదు. ఇదే కాకుండా మా దగ్గరి బంధువులందరికీ నా గురించి, మా అమ్మాయిల గురించి చెడుగా చెబుతోంది. అలాగే ఆమె వల్ల ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం బయటకు వెళ్లిపోతుంది. తనకు నచ్చచెప్పాలని ప్రయత్నించినా నా మాట పట్టించుకోవడం లేదు. మా అబ్బాయితో ఈ విషయాలు చెబితే ఎలా తీసుకుంటాడోనని భయంగా ఉంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీ కోడలి గురించి చెబితే మీ అబ్బాయి ఎలా తీసుకుంటాడోనని భయంగా ఉందని అంటున్నారు. అయితే సాధ్యమైనంతవరకు మీ సమస్యను మీ అబ్బాయి ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదేమో ఆలోచించండి. ఈ క్రమంలో మొదట మీ భయాలను పక్కన పెట్టి మీ కోడలి గురించి ఫిర్యాదులా కాకుండా సూచన లాగా ఎలా చెప్పచ్చో ఆలోచించండి. ప్రతి ఒక్కరిలో నెగెటివ్‌ అంశాలతో పాటు మంచి విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి, ముందుగా మీ కోడలి గురించి కొన్ని మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత తన వల్ల మీరు ఇబ్బంది పడుతోన్న విషయాల గురించి చర్చించండి. ఈ క్రమంలో ‘నువ్వు ఖచ్చితంగా ఆమెతో మాట్లాడాలి’ అనే ధోరణిలో కాకుండా ‘ఈ విషయాల గురించి నువ్వు కూడా ఒకసారి గమనించు. తర్వాత నిర్ణయం తీసుకో’ అనేవిధంగా మాట్లాడండి. ఇలా చెప్పడం వల్ల అవతలి వ్యక్తికి మీరు చెబుతోన్న విషయాలు ఫిర్యాదులు కావు.. సూచనలు అన్న విషయం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటికీ మీరు ఆశించిన ఫలితం రాకపోతే నిపుణుల కౌన్సెలింగ్ ద్వారా మార్పు వస్తుందేమో ఆలోచించచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని