Published : 30/11/2022 14:28 IST

అమెరికాలో సెటిలవుదామంటే వద్దంటున్నారు.. ఎలా ఒప్పించాలి?

నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆరేళ్లు అమెరికాలో ఉండి ఈ మధ్యనే ఇండియా వచ్చాం. మా అత్తగారు చనిపోయిన తర్వాత మా మామగారు ఒంటరిగా ఉంటున్నారు. ఆయన కోసం నా భర్త ఈ నిర్ణయం తీసుకున్నారు. కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇలా వచ్చేయడం నాకు నచ్చలేదు. చాలా బాధగా ఉంది. మా మామగారిని మా పేరెంట్స్‌ చూసుకుంటారన్నా.. మా వారు అమెరికా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఈ విషయంలో ఆయన్ని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. తల్లిదండ్రుల బాధ్యతను ఎప్పుడూ వారి పిల్లలే తీసుకోవాలి. పిల్లలు చూసుకున్నట్లుగా వేరేవారు చూసుకోలేరు. అలాగే వారు కూడా తమ పిల్లలతో మాట్లాడినట్లుగా వేరేవారితో మాట్లాడలేరు. మీ అత్తగారు లేరు కాబట్టి, మీ మామగారికి ఒక తోడు అవసరం. అది తన పిల్లలు లేదా ఇతర దగ్గరి కుటుంబ సభ్యుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈ పరిస్థితుల్లో మీ ముందు రెండు మార్గాలున్నాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రయాణం చేయగలిగిన, అక్కడకొచ్చి మీతో ఉండగలిగిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ మామగారిని మీతో పాటు అమెరికా తీసుకెళ్లడం. లేదంటే మీరు ఇక్కడే ఉండడం.

అంతేతప్ప మీ మామగారిని మీ పేరెంట్స్‌ దగ్గర ఉంచడం మాత్రం అంత సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఒకవేళ ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది లేదు.. ఇక్కడైనా  మంచి ఉద్యోగం చేసుకోవచ్చు.. అనుకుంటే ఇక్కడే ఉండి మీ మామగారి బాగోగులు చూసుకోవడం మంచి నిర్ణయమవుతుంది. వృద్ధాప్యంలో కొడుకు కుటుంబంతో కలిసి ఉన్నానన్న తృప్తి ఆయనకు దక్కుతుంది. తండ్రికి అండగా ఉన్నానన్న ఆనందం మీ వారికీ లభిస్తుంది.

అయితే ఈ విషయంలో అసలు మీ మామగారి ఉద్దేశం ఎలా ఉందో కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ కాలంలో ఎంతోమంది పెద్దవాళ్లు చాలా అడ్వాన్డ్స్‌గా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించి ఒంటరిగానే తనంతట తను మేనేజ్ చేసుకోగలను అనుకుంటే మీరనుకుంటున్నట్లు మీరు మరికొంత కాలం అమెరికాలో ఉండి రావచ్చు. ఒంటరిగా ఉండే వృద్ధుల ఆవాసం, సంరక్షణ కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ప్రత్యేక కమ్యూనిటీలు (వృద్ధాశ్రమాలు కాదు) కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకొస్తున్నాయి. ఆయనకు ఇష్టమైతే అలాంటి వాటి గురించి కూడా ఆలోచించవచ్చు.

అయితే- ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే పెద్దల్ని చూసుకోవడం పిల్లల బాధ్యత అని మాత్రం మరిచిపోవద్దు. ఎవరి స్వార్ధం వాళ్లు చూసుకుని వెళ్లిపోతున్న ఈ రోజుల్లో- మీ వారు తన తండ్రి కోసం అమెరికా వదిలి ఇక్కడే ఉండిపోవాలనుకోవడం అభినందనీయం. ఈ క్రమంలో మీరు కూడా ఆయనకు ఏ విధంగా సహకరించగలరో ఆలోచించండి. ఏ నిర్ణయమైనా సరే- ఇటు మీ వారికి, అటు మీ మామగారికి సంతోషం కలిగించే విధంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ క్రమంలో- ఒకవేళ మీ వారు ఇక్కడే ఉండడం కరెక్టని భావిస్తే అందుకు మీరు తప్పనిసరిగా సహకరించడం అవసరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని