మా తోడి కోడలిని ఎలా మార్చాలి?
నాకు పెళ్లై మూడేళ్లవుతోంది. పీజీ చదివి టీచర్‌గా జాబ్ చేస్తున్నా. మా అత్తమామలు, మా వారి అన్న కుటుంబంతో కలిసి ఉంటున్నాం. మాది ప్రేమ వివాహం కావడంతో కట్న కానుకలు ఏమీ తేలేదు. మాది కులాంతర వివాహం కూడా. నా సమస్యంతా నా తోడి కోడలితోనే. తను కుటుంబ ఫంక్షన్లలో....
నాకు పెళ్లై మూడేళ్లవుతోంది. పీజీ చదివి టీచర్‌గా జాబ్ చేస్తున్నా. మా అత్తమామలు, మా వారి అన్న కుటుంబంతో కలిసి ఉంటున్నాం. మాది ప్రేమ వివాహం కావడంతో కట్న కానుకలు ఏమీ తేలేదు. మాది కులాంతర వివాహం కూడా. నా సమస్యంతా నా తోడి కోడలితోనే. తను కుటుంబ ఫంక్షన్లలో ఏదో ఒక రకంగా నన్ను అవమానిస్తోంది. మాది పేద కుటుంబం, కులం వేరని అందరికీ గుర్తు చేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆమె కారణంగా చాలాసార్లు బాధపడ్డాను. మా అత్తమామలు నన్ను బాగా చూసుకుంటున్నారు. వారు బాధపడతారని వేరు కాపురం పెట్టలేకపోతున్నాం. కానీ, మా తోడి కోడలి వల్ల నాలో కంగారు, భయం, ఆందోళన పెరిగిపోతున్నాయి. నా విషయాల్లో ఆమె జోక్యం చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. ఉమ్మడి కుటుంబంలో అందరి మనస్తత్వాలు ఒకేవిధంగా ఉండే అవకాశం తక్కువ. అలాగే తోడి కోడళ్ల మధ్య విభేదాలు, సూటిపోటి మాటలు అనుకోవడం చాలామందిలో జరుగుతుంటుంది. ఎక్కడైనా సరే- ఇతరులతో సమస్య ఏర్పడినప్పుడు వారి స్వభావాన్ని మార్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి, పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. ఈ క్రమంలో- మీ తోడి కోడలితో మీరు పడుతున్న బాధను తనతో చెబితే అర్థం చేసుకుంటుందా? అనేది ఆలోచించండి. లేదంటే కుటుంబ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఇందులో మీరు పడుతున్న ఇబ్బందులను, ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు చేస్తున్న ప్రయత్నాలను వివరించి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయండి. కొంతమంది ఆవేశంలో ఎదుటివారితో గొడవ పడుతుంటారు. కొంతమంది వాళ్లలో వారు ఆలోచించుకుని మథనపడుతుంటారు. మీ స్వభావాన్ని బట్టి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ తీసుకుంటే బాగుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.