వ్యసనాల భర్త.. విడిపోతానంటే పిల్లలు వద్దంటున్నారు..!

నా వయసు 39 సంవత్సరాలు. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాను. నా భర్తకు మొదటి నుంచి కుటుంబం అంటే బాధ్యత లేదు. మాకు ఇద్దరు పిల్లలు. నా పుట్టింటి సహాయంతో పిల్లల చదువులు, బాధ్యతలు అన్నీ నేనే....

Published : 12 Jul 2023 12:40 IST

నా వయసు 39 సంవత్సరాలు. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాను. నా భర్తకు మొదటి నుంచి కుటుంబం అంటే బాధ్యత లేదు. మాకు ఇద్దరు పిల్లలు. నా పుట్టింటి సహాయంతో పిల్లల చదువులు, బాధ్యతలు అన్నీ నేనే మోస్తున్నాను. తన వ్యసనాల వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అతని నుండి విడిపోయి బతకాలని ఉంది. కానీ, పిల్లలు తండ్రితో కలిసుందామని అంటున్నారు. నేను ఎంతగా చెప్పినా వాళ్లు ఒప్పుకోవడం లేదు. కౌన్సెలింగ్‌తో పిల్లల అభిప్రాయం మారుతుందా? వాళ్లు నన్ను అర్థం చేసుకుంటారా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఈ సమస్యకు రెండు రకాల పరిష్కార మార్గాలున్నాయి. ఒకటి- వ్యసనాల బారిన పడ్డ భర్తను కౌన్సెలింగ్‌ ద్వారా లేదా చికిత్స ద్వారా మార్చుకోవడం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని ఆలోచనా విధానం, వ్యక్తిత్వం మారదని భావిస్తే రెండో మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అంటే మీరు అనుకున్నట్టుగా పిల్లల అభిప్రాయాన్ని కౌన్సెలింగ్‌ ద్వారా మార్చడం.

అయితే మీరు రెండో మార్గం కంటే మొదటి మార్గాన్ని అనుసరించడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పిల్లల ఆలోచన, మీ అభిప్రాయం వేరుగా ఉంటే.. విడాకులు తీసుకున్న తర్వాత మీరు సంతోషంగా ఉండే అవకాశం తక్కువ. అలాగే మీ భర్త, పిల్లలు కూడా సంతోషంగా ఉండలేరు. కాబట్టి, అందరికీ అనుకూలంగా ఉండాలంటే మొదటి మార్గాన్ని అనుసరించడమే మేలనేది నా అభిప్రాయం. ఇందుకోసం ముందుగా మీరిద్దరూ కౌన్సెలింగ్‌ తీసుకోండి. అతను ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు? ఒకవేళ మీలో ఏవైనా లోపాలున్నాయా? ఏవైనా తెలియని తప్పిదాలు చేస్తున్నారా? లేదంటే తప్పంతా అతనిలోనే ఉందా..? అతనొక్కడే మారాల్సిన అవసరం ఉందా? అసలు అతను మారడానికి అవకాశం ఉందా? వంటి అంశాల గురించి ఒక సైకియాట్రిస్ట్‌ వద్ద కౌన్సెలింగ్‌ తీసుకోండి. ఆ తర్వాత పిల్లల మనసు ఎలా మార్చాలి? అన్న విషయం గురించి ఆలోచించండి.. ఈ క్రమంలో భార్యాభర్తలుగా మీరిద్దరూ పడుతున్న ఇబ్బందులకు కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు మాత్రమే కాకుండా అందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని