మా మధ్య ప్రేమ లేదు.. కలిసుండాలా? విడిపోవాలా?

మాకు పెళ్లై పదేళ్లవుతోంది. ఒక బాబు, పాప. మాది ప్రేమ వివాహం. అయితే గత కొంతకాలంగా మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీనికి స్పష్టమైన కారణమంటూ లేదు. ప్రస్తుతం మేము ఒకే గదిలో అపరిచితుల్లాగా జీవిస్తున్నాం. సమస్యను పరిష్కరించుకోవడానికి కొంతమంది రిలేషన్‌షిప్‌ నిపుణులను సంప్రదించాం.

Published : 01 Jul 2024 12:05 IST

మాకు పెళ్లై పదేళ్లవుతోంది. ఒక బాబు, పాప. మాది ప్రేమ వివాహం. అయితే గత కొంతకాలంగా మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీనికి స్పష్టమైన కారణమంటూ లేదు. ప్రస్తుతం మేము ఒకే గదిలో అపరిచితుల్లాగా జీవిస్తున్నాం. సమస్యను పరిష్కరించుకోవడానికి కొంతమంది రిలేషన్‌షిప్‌ నిపుణులను సంప్రదించాం. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం పిల్లల కోసమే కలిసి ఉంటున్నాం. అలాగని నాకు, నా భర్తకు ఇతరులతో సంబంధాలు లేవు. ఎలాంటి కారణం లేకుండానే మా మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? పిల్లల కోసం ప్రేమ లేని సంబంధాన్ని కొనసాగించాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పెళ్లనేది దీర్ఘకాలిక అనుబంధం. ఈ క్రమంలో ప్రతి దశను ఇద్దరూ కలిసికట్టుగా దాటుకుని ముందుకు సాగాలి. అయితే ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించిన మీరు తర్వాతి దశలు దాటడానికి సిద్ధంగా లేరు. మీది ప్రేమ వివాహమైనప్పటికీ ఒకే ఇంట్లో అపరిచితుల్లాగా జీవిస్తున్నారంటున్నారు. ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి రిలేషన్‌షిప్‌ నిపుణులను సంప్రదించినా ప్రయోజనం లేదని అంటున్నారు. అదే సమయంలో సమస్యకు గల కారణాన్ని చెప్పలేకపోతున్నారు. గతం జరిగిపోయింది. దాన్ని ఎలాగూ మార్చలేం. కాబట్టి ప్రస్తుతం గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. దాంపత్య బంధాన్ని కాపాడుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించండి.

మీ బంధంలో ప్రేమ లేదని అంటున్నారు. కొంతమంది ప్రేమకు సొంత నిర్వచనం ఇచ్చి ఆ చట్రంలోనే జీవిస్తుంటారు. ఎప్పుడైతే అవతలి వ్యక్తి నుంచి దానిని పొందలేకపోతారో అప్పుడు ఒంటరిగా భావిస్తుంటారు. కాబట్టి, అసలు మీ భర్త నుంచి ఎలాంటి ప్రేమను పొందాలనుకుంటున్నారు? అతని నుంచి ఏం ఆశిస్తున్నారో ఒక నిర్ణయానికి రండి. ఆ తర్వాత మీ అభిప్రాయాలను మీ భర్తతో చర్చించండి. అలాగే అతను మీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి. వాటికి తగ్గట్టుగా మీ అభిప్రాయాలు/అలవాట్లలో ఏవైనా మార్పులు చేసుకోగలుగుతారేమో పరిశీలించుకోండి. దానిని బట్టి మీ దాంపత్య బంధాన్ని కొనసాగించాలా? లేదా? అన్న నిర్ణయానికి రావచ్చు.

ఒకవేళ మీ దాంపత్య బంధాన్ని కొనసాగించాలనుకుంటే దాన్ని దృఢపరచుకోవడానికి వీలైన అన్ని మార్గాల ద్వారా ప్రయత్నించండి. ఇందుకోసం చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేయండి. ఉదాహరణకు విహార యాత్రకు వెళ్లడం, ఇంతకు ముందు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్న పనులను పూర్తి చేయడం వంటివి చేయండి. ఆ తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకుని బంధాన్ని బలపరచుకునే ప్రయత్నం చేయండి.

ఒకవేళ మీరు విడిపోవాలనుకుంటే పంచుకోవాల్సిన బాధ్యతల గురించి కూడా ఆలోచించండి. మీరు దంపతులుగా విడిపోవచ్చు. కానీ, పిల్లలకు తల్లిదండ్రులుగా మాత్రం విడిపోలేరు. కాబట్టి కలిసున్నా, విడిపోయినా వచ్చే పర్యవసానాల గురించి జాగ్రత్తగా ఆలోచించి తగిన నిర్ణయానికి రావడం మంచిదేమో ఆలోచించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్