Published : 05/11/2022 18:08 IST

పెళ్లికి ముందు ఆ విషయాన్ని దాచాడు.. ఎటూ తేల్చుకోలేకపోతున్నా..!

మాది ప్రేమ వివాహం. అతను బంధువుల పెళ్లిలో పరిచయమయ్యాడు. దూరపు చుట్టరికం కూడా ఉంది. దాంతో మా ఇద్దరి పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే తను పెళ్లికి ముందు చాలా అబద్ధాలు చెప్పాడు. ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. కానీ తనకు ఉద్యోగం లేదు. అసలు ఏ పనీ చేయడు. చాలా బద్ధకస్తుడు. వాళ్ల పేరెంట్సే తనను పోషిస్తున్నారు. వాళ్లు కూడా విసుగు చెంది అతనికి చెప్పడం మానేశారు. నాకు కూడా చాలా విరక్తిగా అనిపిస్తోంది. ఇక నేను జాబ్‌ చేయడం తప్ప మరో దారి లేదు. అయితే ఉద్యోగం చేసి అతన్ని కూర్చోబెట్టి పోషించాలా? లేదంటే పుట్టింటికి వెళ్లాలా? అనేది తేల్చుకోలేకపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి.

జ. సాధారణంగా వివాహం చేసుకునే క్రమంలో ముందుగానే అవతలి వ్యక్తికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మీ ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ జాబ్ విషయంలో అతను అబద్ధం చెప్పాడంటున్నారు. ఇప్పుడు ఆ అంశాల గురించి బాధపడకుండా మీ వంతుగా సమస్యను ఎలా పరిష్కరించుకోగలరో ఆలోచించండి.

మీరు అతని గురించి చెబుతోన్న అంశాల్లో ‘బద్ధకస్తుడు, ఉద్యోగం లేదు, ఏ పనీ చేయడు’ అన్న విషయాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు ఎక్కడా అతనికి చెడు అలవాట్లు ఉన్నాయని, అతని ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్నారని చెప్పలేదు. కాబట్టి, అతను ఉద్యోగం చేసేవిధంగా ప్రోత్సహించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించండి. మొదటగా ఉద్యోగం చేయకపోతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయో అతనికి వివరించండి. ప్రస్తుతం తల్లిదండ్రులే అతన్ని పోషిస్తున్నారని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ వారిని పోషించాల్సిన పరిస్థితులు వస్తే.. ఆ బాధ్యత తన మీదే ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయండి. అలాగే తనలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి ఏదైనా పని చేసే విధంగా అతన్ని ప్రోత్సహించే అంశాలను పరిశీలించండి. ఈ ప్రయత్నాలతో తనలో మార్పు వస్తుందేమో గమనించండి. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టును సంప్రదించండి. వారు వివరాలు తెలుసుకుని తనలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తారు.

ఇకపోతే- మీరు ఉద్యోగం చేస్తానంటున్నారు. మీకు మీరు ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఉద్యోగం చేయడం మంచిదే. అయితే మీరు జాబ్ చేస్తూ అతన్ని కూర్చోబెట్టి పోషించడం వల్ల అతనికి బద్ధకం మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, అతను చిన్నదో, పెద్దదో ఉద్యోగం చేయడం ప్రారంభించిన తర్వాత మీరూ ఉద్యోగం చేయడం మంచిదేమో ఆలోచించండి. తద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇద్దరూ ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు సార్ధకత ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని