Published : 29/05/2022 11:10 IST

Period Friendly Office: ఈ సౌకర్యాలు దక్కుతున్నాయా?

నెలసరి అంటేనే శారీరక, మానసిక సమస్యలతో కూడుకున్నది. మూడ్‌ స్వింగ్స్‌, శారీరక నొప్పులు, అధిక రక్తస్రావం.. ఇవన్నీ ఈ సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. మరి, ఇలాంటప్పుడు ఇంట్లోనే ఏ పనీ చేయలేం. అలాంటిది.. గంటల తరబడి ఆఫీస్‌లో కూర్చోగలమా? అయినా బాధను భరిస్తూ ఆ ఐదు రోజులూ క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నారు చాలామంది మహిళలు. అయితే ఇలాంటి అసౌకర్యంతో పనిచేయడం వల్ల దాని ప్రభావం చేసే పనిపై పడుతుందని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. అందుకే దీన్ని అధిగమించాలంటే పిరియడ్స్‌ సమయంలో మహిళల సౌకర్యానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చేలా కంపెనీలు వారి కోసం పలు సౌలభ్యాలు సమకూర్చాలని సూచిస్తున్నాయి.

వృత్తి ఉద్యోగాల రీత్యా ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలామంది మహిళలు గడిపేది ఆఫీసుల్లోనే..! కాబట్టి ఇంట్లో తరహా సౌకర్యవంతమైన వాతావరణాన్నే ఆఫీస్‌లోనూ ఏర్పాటుచేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇక నెలసరి సమయంలోనూ కంపెనీలు తమ అవసరాలు, సమస్యలు అర్థం చేసుకొని పలు వెసులుబాట్లు కల్పించాలని కోరుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఉద్యోగికి సంస్థ పిరియడ్‌ ఫ్రెండ్లీగా ఉంటే వారు అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా రాణించగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.

అకస్మాత్తుగా వచ్చినా.. అందుబాటులో!

చాలామంది మహిళల హ్యాండ్‌బ్యాగ్‌లో ఉండే అత్యవసర వస్తువుల్లో శ్యానిటరీ న్యాప్‌కిన్లు కూడా ఒకటి. అయితే ఒక్కోసారి ఇవి నిండుకోవడం, బయట తీసుకోవాలనుకొని మర్చిపోవడం, అకస్మాత్తుగా నెలసరి రావడం.. ఇలా కారణమేదైనా ఆ సమయంలో మన వద్ద ప్యాడ్‌ లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సిందే! ఒకవేళ ఆన్‌లైన్లో బుక్‌ చేసినా అది డెలివరీ అయ్యే వరకు వేచి చూడడం కుదరకపోవచ్చు. ఇలాంటప్పుడు సమస్య లేకుండా ఉండాలంటే ఆఫీస్‌లో ఓ ఫెమినైన్‌ స్టోర్‌ తప్పకుండా ఏర్పాటు చేయాలంటున్నారు నిపుణులు. ఇందులో శ్యానిటరీ ఉత్పత్తులు, ఈ సమయంలో తలెత్తే దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి హాట్‌ ప్యాక్స్‌, అలాగే వాడిన ప్యాడ్స్‌ని పడేయడానికి వీలుగా ప్యాడ్‌ డిస్పెన్సర్‌ మెషీన్‌.. వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తే.. మహిళలకు భరోసా ఉంటుంది. తద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా చేసే పనులపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు. అయితే మరి, ఇలాంటి స్టోర్స్‌ ప్రతి కంపెనీలో ఉన్నాయా.. అంటే? చాలా అరుదనే చెప్పాలి.

పిరియడ్‌ లీవ్‌.. అందుకే!

నెలసరి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఈ క్రమంలో కొంతమందిలో ఇవి తీవ్రంగా ఉంటే.. మరికొంతమంది మేనేజ్‌ చేసుకోగలుగుతారు. ఏదేమైనా ఈ సమయంలో ఎంతో కొంత అసౌకర్యం కలగడం మాట వాస్తవం. దీన్ని అధిగమించడానికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగినులకు పిరియడ్‌ లీవ్‌ ఇస్తున్నాయి. అయితే నెలసరి సెలవు ఇవ్వకపోయినా.. కంపెనీలు ఈ సమయంలో వాళ్ల సౌకర్యార్థం పలు చర్యలు చేపట్టచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే.. పిరియడ్‌ ప్రభావం అధికంగా ఉండే మొదటి మూడు రోజులు పని మధ్యలో కాస్త ఎక్కువ సమయం బ్రేక్‌ తీసుకునేలా ప్రోత్సహించచ్చు. నెలసరి నొప్పుల్ని అధిగమించడానికి.. నిపుణుల ఆధ్వర్యంలో యోగా, మెడిటేషన్‌.. వంటి ప్రత్యేక తరగతుల్ని ఆఫీస్‌లోనే ఏర్పాటుచేయచ్చు. ఇలా ఈ సమయంలో పని ఒత్తిడి కాస్త తగ్గించి.. వారి ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చేలా చొరవ చూపితే.. ఏ ఉద్యోగినికైనా తమ కంపెనీపై గౌరవం పెరుగుతుంది. అంతిమంగా ఇది వాళ్లు చేసే పనిపై సానుకూల ప్రభావం చూపుతుంది.

ఆ ప్రోత్సాహం కావాలి!

చాలామంది మహిళలు నెలసరి సమయంలో సౌకర్యంగా ఉండే పనులు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలో ఆఫీస్‌ పనుల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లలేకపోతుంటారు. అలాగే గెట్‌-టు-గెదర్‌, ఆఫీస్‌ పార్టీలు, బిజినెస్‌ మీటింగ్స్‌, ఆటలు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటే అసౌకర్యంగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే వారిలో ఉన్న ఇలాంటి ఆలోచనల్ని దూరం చేయడానికి కంపెనీలు చొరవ చూపాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో నెలసరి, దానికి సంబంధించిన అంశాలపై నిపుణులతో ప్రత్యేక సెషన్స్‌ ఏర్పాటు చేయడం, తద్వారా దీనిపై ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేయడం, ఈ సమయంలో ఉద్యోగినులు ఒకరికొకరు అండగా నిలిచేలా ప్రోత్సహించడం.. వంటివి చేస్తే వాళ్లు వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగా, సామాజిక పరంగానూ రాణించగలుగుతారు.

వీటితో పాటు పరిశుభ్రమైన టాయిలెట్‌ సదుపాయం ఏర్పాటు చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత నిపుణుల్ని సంప్రదించి చికిత్స అందేలా చూడడం, ఆరోగ్య బీమా పాలసీల్లో నెలసరి సమస్యలు కూడా కవరయ్యేలా చూడడం.. వంటివీ ముఖ్యమే!
మరి, పిరియడ్‌ ఫ్రెండ్లీ ఆఫీస్‌పై మీ అభిప్రాయమేంటి? ఈ సౌకర్యాలన్నీ ఉద్యోగినులకు దక్కుతున్నాయంటారా? Contactus@vasundhara.net వేదికగా మీ మనోభావాలకు అక్షర రూపమివ్వండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని