Updated : 24/09/2021 18:26 IST

స్పై కెమెరాని కనిపెట్టండిలా..!

రోజురోజుకీ అభివృద్ధి చెందుతోన్న సాంకేతికత ద్వారా మనకు కలిగే ప్రయోజనాలే కాదు.. పరిణమించే ముప్పు శాతం కూడా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ ద్వారా మన ప్రమేయం లేకుండానే మనకు సంబంధించిన సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లిపోతోంది. ఈ తరహా టెక్నాలజీలో స్పై కెమెరాలు కూడా ఒక భాగమే. 

తాజాగా హైదరాబాదులోని ఓ హోటల్లో మహిళల బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌తో రహస్య చిత్రీకరణ జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాత్‌రూమ్ క్లీనర్‌గా పని చేసే బాలుడు ఫోన్ కెమెరా అమర్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిజానికి ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 

గతంలో- ఓ హాస్టల్‌లో స్నానాల గదితో పాటు వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు ఉంచి వీడియో రికార్డ్ చేసినందుకు గాను చెన్నై పోలీసులు ఓ హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. 

అలాగే న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో బస చేసినప్పుడు ఓ ఆగంతకుడు తన బాత్రూంలో రహస్య కెమెరా ఉంచి.. తాను స్నానం చేస్తుండగా రికార్డ్ చేసిన వీడియోని అశ్లీల వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశాడని.. డబ్బు కోసం తనని బెదిరిస్తున్నాడని షికాగోకి చెందిన ఓ మహిళ ప్రముఖ హోటల్ గ్రూప్‌పై దాదాపు 700 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. 

ఇలా ఎక్కడ చూసినా మహిళలకు కనీస రక్షణ కరవైన ఈ పరిస్థితుల్లో హాస్టల్, హోటల్, షాపింగ్ మాల్‌లో ట్రయల్ రూమ్.. ఇలా వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో.. లేదో.. తెలుసుకోవడం చాలా ముఖ్యమైపోయింది. మరి, మీరు వెళ్లే పరిసరాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో.. లేవో ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా? అందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు..

చుట్టూ గమనించారా?

స్పై కెమెరాలు కేవలం షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్లో, హోటల్ గదుల్లో, హాస్టళ్లలోనే ఉంటాయని భావించాల్సిన అవసరం లేదు. ఏ ప్రదేశంలోనైనా ఇలాంటివి ఉండే అవకాశాలు లేకపోలేవు. అందుకే మనకు తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎంతో అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ఈ క్రమంలో ముందుగా మీరు వెళ్లిన ప్రాంతంలోని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గోడలు, స్విచ్‌బోర్డులు.. మొదలైన వాటికి ఎక్కడైనా చిన్న రంధ్రాలు, నల్లని డాట్స్ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. సాధారణంగా స్పై కెమెరాలను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ఏసీలు, వాల్ పెయింటింగ్స్, పుస్తకాలు, మొక్కలు, బొమ్మలు, లైట్లు, కుషన్లు, అలమరాలు, టిష్యూ బాక్స్‌లు వంటి వాటిలో దాచే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటివి ఉన్నాయా? లేదా? అని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే మంచిది. అలాగే ఏవైనా అవసరం లేని వైర్లు, అడాప్టర్లు వంటివి కనిపిస్తే వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తే సరిపోతుంది.

ఫోన్ చేసి చూడండి..

స్పై కెమెరాలను గుర్తించేందుకు అత్యంత సులువైన ఉపాయం మీ ఫోన్‌ని ఉపయోగించడం.. మీరు ట్రయల్ రూమ్‌కి వెళ్లినప్పుడు గానీ, లేదా ఏదైనా కొత్త హోటల్ గదిలో దిగినప్పుడు గానీ అక్కడ రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారో.. లేదో తెలుసుకునేందుకు అక్కడి నుంచి మీ సన్నిహితులకు ఓసారి ఫోన్ చేసి చూడండి. సాధారణంగా స్పై కెమెరాలు ఒక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల మీరు ఫోన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ సమస్య ఎదురవ్వచ్చు.. లేదా ఫోన్ మాట్లాడుతుంటే గరగరమంటూ శబ్దం వినిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురవుతోందంటే అక్కడ రహస్య కెమెరా ఉన్నట్లు అనుమానించాల్సిందే. ఈ తరహా కెమెరాలను గుర్తించేందుకు కొన్ని రకాల యాప్స్‌ని కూడా ఉపయోగించవచ్చు. వైర్‌లెస్ కెమెరా డిటెక్టర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ వంటివి అందులో కొన్ని.. వీటి ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న వైర్‌లెస్ డివైజెస్ సమాచారం మొత్తం మీ ఫోన్‌లో కనిపిస్తుంది. ఒకవేళ స్పై కెమెరా ఉన్నట్లయితే మీరు అక్కడినుంచి వెళ్లిపోయే వీలుంటుంది.

అద్దం ఇలా ఉండాలి..

చాలామంది స్పై కెమెరాలను అద్దం వెనుక పెడుతుంటారు. దీన్ని గుర్తించడం కాస్త కష్టమే. అందుకే చాలామంది స్పై కెమెరాలను ఉపయోగించేటప్పుడు అద్దం వెనుక వాటిని పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు.. సాధారణ అద్దాలకు బదులుగా టూవే మిర్రర్స్‌ని కూడా కొన్ని ప్రదేశాల్లో అమర్చుతుంటారు. ఇవి మనకు అద్దంలానే కనిపించినప్పటికీ వాటి వెనుక భాగం వైపు ఉన్నవారికి మనం చాలా స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏ తరహా అద్దాలు ఉన్నాయో కూడా ఓసారి సరిచూసుకోవడం మంచిది. ఆ తర్వాతే అక్కడ స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయడం శ్రేయస్కరం. ఇంతకీ ఈ తరహా అద్దాన్ని ఎలా పరీక్షించాలో మీకు తెలుసా?? 

మీ చేతివేలితోనే అది సాధారణమైన అద్దమా?? లేక టూవే మిర్రర్ ఉందా?? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. మీ చూపుడువేలు కొసను అద్దానికి ఆనించి ఉంచండి. ఇలా ఉంచినప్పుడు మీ వేలికి అద్దంలో కనిపించే మీ వేలి ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తే అది నిజమైన అద్దం.. అలాకాకుండా మీ వేలికి, దాని ప్రతిబింబానికి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా రెండూ పరస్పరం తాకుతున్నట్లు కనిపిస్తే అది టూవే మిర్రర్ అయి ఉండచ్చని భావించాలి. అలాగే ఆ అద్దం వెనుక ఎవరైనా స్పై కెమెరా కూడా పెట్టి ఉండచ్చు. కాబట్టి వెంటనే హోటల్ లేదా షాపింగ్‌మాల్ యాజమాన్యానికి దాని గురించి ఫిర్యాదు చేయడం మంచిది.

ఫ్లాష్‌లైట్ వాడితే..

సాధారణంగా స్పై కెమెరాలన్నీ నైట్ విజన్ మోడ్‌వే అయి ఉంటాయి. చీకట్లోనూ రికార్డ్ చేసేందుకు వీలుగా ఉన్నవాటిని ఉపయోగిస్తుంటారు. అందుకే వీటి నుంచి ఓ చిన్న లైట్‌లాంటిది వస్తుంది. అందుకే మీ గదిలో పూర్తిగా ఏమాత్రం లైట్ లేకుండా చీకటిగా చేయాలి. దీనికోసం కేవలం లైట్లు ఆపేయడమే కాదు.. ఏమాత్రం వెలుతురు రాకుండా కర్టెన్లను కూడా మూసేయాలి. ఎక్కడినుంచైనా చిన్న ఆకుపచ్చ లేదా ఎరుపు లైట్లు వస్తున్నాయేమో అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా వస్తే లైట్లు ఆన్ చేసి అక్కడ స్పై కెమెరా ఉందేమోనని చెక్ చేస్తే సరిపోతుంది. అలాగే మొబైల్లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా కూడా రహస్య కెమెరాలు ఉన్నాయో.. లేవో.. తెలుసుకోవచ్చు. లేదా ఫోన్‌లో కెమెరాని ఆన్ చేసి గది మొత్తం నిశితంగా పరిశీలించండి. అవసరమైతే జూమ్ చేసి మరీ చూడండి. ఈ క్రమంలో రహస్య కెమెరాలకు ఉండే ఎల్ఈడీ లైట్లు మన కంటికి చిక్కే వీలు ఉంటుంది. ఒకవేళ ఇలా పరీక్షించడం కాస్త ఇబ్బందని అనిపిస్తే ఫ్లాష్‌లైట్ సాయంతో గదిలో ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయేమో పరీక్షించవచ్చు. ఇందుకోసం ఒక ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి అనుమానాస్పదంగా అనిపించిన ప్రతి ప్రదేశంలోనూ దానిని వేసి చూడండి. సాధారణంగా గోడలు వంటి ఉపరితలాలపై ఈ లైట్ వేసినప్పుడు దాని ప్రతిబింబం మన వెనుక కనిపిస్తుంది. కానీ ఫ్లాష్‌లైట్ ప్రతిబింబం మనకు కనిపించకుండా దాని వెలుతురు వస్తువుకు అవతలి వైపు ప్రసరిస్తున్నట్లు కనిపిస్తే తప్పకుండా దాని వెనుక కెమెరా ఉందని అనుమానించవచ్చు. వెంటనే లైట్స్ ఆన్ చేసి అక్కడ ఏముందో ఒకసారి పరీక్షించుకోవాలి.

మీరున్న ప్రదేశంలో స్పై కెమెరాలు ఉన్నాయని మీకు అనిపిస్తే వెంటనే పై విధానాల ద్వారా వాటిని ఒకసారి గుర్తించడానికి ప్రయత్నించండి. ఏవైనా రహస్య కెమెరాలు మీ దృష్టికి వచ్చినట్త్లెతే వెంటనే సంబంధిత యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతోపాటు మీరు కూడా వాటిని మీ మొబైల్లో ఫొటో తీసి, పోలీసులకు కూడా విషయం తెలియజేసి, ఫిర్యాదు ఇవ్వండి. ఫలితంగా ఇంకెవరూ వాటి బారిన పడి ఇబ్బందులపాలు కాకుండా ఉంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి