Published : 06/01/2022 18:41 IST

కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే..

ముఖానికి కళ్లు అందాన్నిస్తే.. వాటికి వన్నె తెచ్చేవి కనురెప్పలు. అవి అందంగా కనిపించడం కోసం ఐలాష్ వంటివి ఉపయోగిస్తూ ఉంటాం. ఇటీవలి కాలంలో అయితే కృత్రిమ కనురెప్పలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి పద్ధతుల జోలికి వెళ్లకుండా సహజమైన చిట్కాలను ఉపయోగించడం ద్వారా కూడా కనురెప్పలను ఒత్తుగా, అందంగా, కర్వీగా కనిపించేలా చేయచ్చు. దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మన వంటగదిలో మన చేతికి అందుబాటులో ఉండే పదార్థాలతోనే కనురెప్పలు ఒత్తుగా పెరిగేలా చేయచ్చు. మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకొందామా..

* ఆముదంలో కనురెప్పలను అందంగా తీర్చిదిద్దే గుణాలున్నాయి. ఈ ఫలితాన్ని పొందడానికి శుభ్రమైన బ్రష్ లేదా దూదిని తీసుకొని దాన్ని ఆముదంలో ముంచి నిద్రపోయే ముందు కనురెప్పలకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నెలల పాటు పాటిస్తే.. ఒత్తయిన కనురెప్పలు మీ సొంతమవుతాయి. అయితే ఈ చిట్కాను పాటించేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆముదం వల్ల కొందరిలో దద్దుర్లు, ఇతర ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిట్కాను పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి.

* ఐలాషెస్ ఒత్తుగా, పొడవుగా పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఉండే బయోటిన్, విటమిన్ బి కూడా వాటి పెరుగుదలకు సహకరించడంతో పాటు అవి నల్లగా ఉండేందుకు తోడ్పడతాయి. దీనికోసం గిన్నెలో గుడ్డును పగలగొట్టి వేయాలి. దీనికి టేబుల్‌స్పూన్ గ్లిజరిన్‌ను కూడా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు బీటర్ సాయంతో కలుపుకోవాలి. ఆ తర్వాత దూది ఉండను ఈ మిశ్రమంలో ముంచి కనురెప్పల వెంట్రుకలకు రాసుకొని పావుగంట సమయం ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.  వారంలో మూడు రోజుల పాటు ఈ చిట్కాను పాటిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

* గ్రీన్‌టీలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి. వేడి నీటిలో గ్రీన్‌టీ బ్యాగ్‌ను ఉంచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత టీ బ్యాగ్‌ను బయటకు తీసేయాలి. ఈ నీటిలో దూది ఉండను ముంచి బాగా పిండాలి. దాంతో కనురెప్పల వెంట్రుకలకు మొదళ్ల నుంచి చివరి దాకా రాయాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను రోజుకి రెండు సార్లు చొప్పున వరుసగా మూడు నెలల పాటు పాటిస్తే.. చక్కటి ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ చిట్కాను పాటించే క్రమంలో గ్రీన్‌టీ కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

* కొబ్బరి పాలలో దూదిని ముంచి ఐలాషెస్‌కు రాసుకొని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను రోజూ పాటించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరిపాలలో ఉండే కొవ్వులు ఐలాషెస్‌ను ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

* కొబ్బరి పాలే కాదు.. కొబ్బరి నూనె కూడా కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. దీనిలో ఉండే సహజకొవ్వులు, ప్రొటీన్లు, లారిక్ ఆమ్లం, విటమిన్ ఇ, ఐరన్ వంటివి కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తాయి. రోజూ కనురెప్పలకు ఈ నూనె రాసుకొని కాసేపు మర్దన చేసుకొంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

ఇవి గుర్తు పెట్టుకోవాలి..

* పై చిట్కాలను పాటించేటప్పుడు మీరు ఉపయోగించే మిశ్రమం కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. దీనికోసం వాటిని అప్త్లె చేసుకోవడానికి ఉపయోగించే దూదిని బాగా పిండి ఆ తర్వాత మాత్రమే రెప్పలకు రాసుకోవాలి.

* కొంతమందికి పదేపదే కళ్లను నలుపుకొనే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే కనురెప్పల వెంట్రుకలు రాలిపోయి.. కళ్ల అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అలవాటును మానడం మంచిది.

* గాలిలోని దుమ్ము, ధూళి, ఇతర మలిన పదార్థాలు ఐలాషెస్‌పై చేరి వాటి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా అవి రాలిపోయేలా చేస్తాయి. అందుకే రోజూ ఐలాష్ బ్రష్ ఉపయోగించి వాటిని ఐదు నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి.

* రసాయనాలతో తయారైన మస్కారా, ఐలైనర్‌లను ప్రత్యేక సందర్భాల్లో మినహా రోజూ ఉపయోగించడం మానుకోవాలి.

* కొందరికి తమ వృత్తిరీత్యా ఐ మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారు నిద్రపోయే ముందు దాన్ని తొలగించుకోవాలి.

* కొంతమంది తమ కళ్లు అందంగా కనిపించడానికి ఐలాషెస్‌ను కర్లింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కనురెప్పల వెంట్రుకలు బలహీనంగా తయారై రాలిపోతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. మస్కారా రాసుకొన్న తర్వాత కర్లింగ్ చేసుకోకూడదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని