ఇలా నమ్మించి వంచించే వారుంటారు.. జాగ్రత్త!
ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.ప్రేమిస్తున్నానని నమ్మించి.. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో బాధిత యువతి ప్రియుడి ఇంటి నిరసనకు దిగింది.ఇలాంటి సంఘటనల్ని నిత్యం చూస్తుంటాం.. చదువుతుంటాం.. అయితే ఇలాంటి మాయగాళ్లను కనిపెట్టడం తేలికే....
ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.
ప్రేమిస్తున్నానని నమ్మించి.. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో బాధిత యువతి ప్రియుడి ఇంటి నిరసనకు దిగింది.
ఇలాంటి సంఘటనల్ని నిత్యం చూస్తుంటాం.. చదువుతుంటాం.. అయితే ఇలాంటి మాయగాళ్లను కనిపెట్టడం తేలికే! వారి నుంచి తప్పించుకోవడం ఇంకా తేలిక అంటున్నారు మానసిక నిపుణులు. అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే ఉందంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..
మాటల తాంత్రికులు..
జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితుల్లో.. ఈ మాటల తాంత్రికుల ఉచ్చులో పడే ప్రమాదం ఎక్కువగా ఉందంటారు మానసిక నిపుణులు. ముఖంలో కనిపించే భావాలను డీకోడింగ్ చేసి.. ఎవరికి ఎలా ఎరవేయాలో బాగా తెలిసిన వాళ్లుంటారు. ఇంట్లో ఆప్యాయత అడుగంటిన వారిని ఒకలా పలకరిస్తారు. ఒంటరి మహిళలను మరోలా టార్గెట్ చేస్తారు. చెప్పలేనంత ప్రేమ కురిపించేస్తుంటారు. అయోమయస్థితిలో మాయోపాయంతో దగ్గరవుతారు. ‘అతను నా పక్కనుంటే ఎంత బాగుంటుంది’ అనే స్థితికి తీసుకొస్తారు. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే.. నలుగురిలో తలదించుకోకూడదంటే.. వాళ్లలోని స్వార్థాన్ని ముందే పసిగట్టాలి. మోసాన్ని మొగ్గలోనే తుంచేయాలి.
ధైర్యంగా అడుగెయ్..
* ఇరుగు పొరుగు వారితో, పనిచేస్తున్న చోట వ్యక్తిగత విషయాలన్నీ పంచుకోవద్దు. వ్యక్తిగత విషయాల్లో మూడో వంతు మన దగ్గరే దాచుకోవాలి. దగ్గరి స్నేహితులతోనూ కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలి.
* సహోద్యోగులతో ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. తరచూ సందేశాలు పంపుతుండటం, కలుస్తుండటం వంటివి చేయకపోవడమే ఉత్తమం.
* అనవసర సాయాలు ఆశించొద్దు. అవతలి వ్యక్తి సాయం చేశాడంటే.. ఏదో ఆశిస్తున్నాడని శంకించాల్సిందే!
* ఒకవేళ డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నా.. అంతా లీగల్‌గా జరగాలి.
* చిన్న చిన్న సాయాలు చేయడానికి అత్యుత్సాహం కనబరుస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సున్నితంగా తిరస్కరించాలి. అయినా వైఖరి మార్చుకోకపోతే మొహమాటం లేకుండా ఇంట్లోవాళ్ల సాయంతో హెచ్చరించాలి. వినకపోతే పోలీసులను, విమెన్ లీగల్ సెల్‌ని ఆశ్రయించాలి.
* సమాజంలో జరుగుతున్న ఘోరాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితులు మనకు ఎదురుకావు అనే గుడ్డి నమ్మకం వద్దు. అలాగని అనుమానించాల్సిన అవసరమూ లేదు. పాత్ర ఎరిగి ప్రవర్తించడం విజ్ఞత అనిపించుకుంటుంది.
లక్ష్యం వీళ్లే..
ఒంటరి స్త్రీలు, పెళ్లి కాని మహిళలు, కుటుంబ భారం మోస్తున్న ఇంతులు.. వీరినే లక్ష్యంగా ఎంచుకుంటారు మోసగాళ్లు. బాధలో ఉన్నవారిపై జాలి చూపుతారు. చిన్న చిన్న సాయాలు చేస్తుంటారు. సానుభూతి చూపుతున్నారని కొందరు తమ కష్టాలన్నీ చెప్పుకొంటారు. వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటారు. వీటినే ఎదుటివారు బలహీనతగా మార్చుకుంటారు. కృతజ్ఞత చూపేలా తెలివిగా వ్యవహరిస్తారు. బలహీన క్షణంలో లోబరుచుకొని.. సాగినంత కాలం గడిపేస్తారు. మాయలు పసిగట్టి, మృగాన్ని కనిపెట్టి మహిళ ఎదురు తిరిగినప్పుడు తప్పించుకునే దారులు వెతుక్కుంటారు. అప్పుడు ఆమె వ్యక్తిత్వాన్ని పలుచన చేస్తారు. జీవితాన్ని రభస చేస్తారు. మానసికంగా వేధిస్తారు. బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. తమ దారికి అడ్డుగా ఉన్నారని భావిస్తే.. ఎంతకైనా తెగిస్తారు.
కొందరితో కాస్త చనువుగా ఉన్నా.. అతిగా వ్యవహరిస్తారు. ‘నువ్వు లేకపోతే చచ్చిపోతా!’ అన్నట్టు బెదిరిస్తారు. ఇలాంటి సందర్భాల్లో మనోధైర్యంతో నిలబడాలి. లోలోపల భయాలున్నా.. బయటపడకుండా జాగ్రత్తపడాలి. స్నేహితులు, ఇంట్లో వాళ్ల సాయంతో ఇబ్బందిని అధిగమించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.