ఈ చిట్కాలతో పెళ్లి తర్వాత కూడా కళగా..!

ప్రతి అమ్మాయి జీవితంలోనూ వివాహం అతి ముఖ్యమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో నవవధువుగా అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు. తినే ఆహారం దగ్గరి నుంచి మేకప్ ఉత్పత్తుల....

Updated : 27 May 2022 21:10 IST

ప్రతి అమ్మాయి జీవితంలోనూ వివాహం అతి ముఖ్యమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో నవవధువుగా అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు. తినే ఆహారం దగ్గరి నుంచి మేకప్ ఉత్పత్తుల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు. బ్యూటీపార్లర్‌లో ప్రత్యేకంగా మసాజ్, ఫేషియల్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ లాంటివి కూడా చేయించుకొంటారు. దీంతో పెళ్లికూతురు మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చాలామంది వివాహమైన తర్వాత కూడా ఆ మెరుపును కొనసాగించడంలో విఫలమవుతుంటారు. దీంతో వారి అందం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇలా కాకుండా.. వివాహమైన తర్వాత కూడా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకొందామా..

తేమనందించే ఫేషియల్స్..

వివాహ సమయంలో వధువు అందం రెట్టింపయ్యేలా చేయడంలో ఫేషియల్స్‌దే కీలకపాత్ర. అయితే పెళ్లి సమయంలో వేసుకొన్న మేకప్, చర్మంపై పడిన లైట్ల కాంతి ప్రభావం కారణంగా చర్మం కాస్త దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో ముఖం పొడిబారినట్లుగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే చర్మానికి తేమనందించే ఫేషియల్స్ వేసుకోవడం మంచిది. ఇవి చర్మానికి పోషణనివ్వడంతో పాటు.. మీ ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపించేలా చేస్తాయి. దీనికోసం రెండు టీస్పూన్ల చొప్పున గంధం పొడి, శెనగపిండి తీసుకోవాలి. వీటికి చిటికెడు పసుపు, టీస్పూను పాలు, కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకొని పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇది నిద్రలేమితో అలసిన చర్మాన్ని సేదతీర్చడంతో పాటు తేమను అందిస్తుంది.

బ్యూటీ రొటీన్ పాటించాల్సిందే..

పెళ్లి రోజు అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బ్యూటీ రొటీన్‌ను అనుసరించే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఆ సమయంలో క్రమం తప్పకుడా క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్‌ఫోలియేషన్ లాంటివి చేసుకొంటారు. దీనివల్ల చర్మంపై మృతకణాలు, మురికి తొలగిపోయి.. తాజాగా కనిపిస్తుంది. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే వివాహమైన తర్వాత మాత్రం ఈ రొటీన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసే వారే ఎక్కువమంది కనిపిస్తారు. దీనివల్ల అప్పటి వరకు ఉన్న మెరుపు కాస్తా.. క్రమంగా తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. పెళ్లికి ముందు మీరు ప్రత్యేకంగా అనుసరించిన ప్రణాళికను ఆ తర్వాత కూడా కొనసాగించాల్సి ఉంటుంది.

ఆహారం విషయంలో..

చర్మానికి పోషణనందించే ఆహార పదార్థాలను తినడం ద్వారా వివాహమైన తర్వాత కూడా పెళ్లి కళను కొనసాగించవచ్చు. దీనికోసం విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఈ క్రమంలో పెరుగు, మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాలు, వెన్న తీసిన పాలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే రోజూ తప్పనిసరిగా రెండు లీటర్ల నీరు తాగాలి. ఎందుకంటే ఒక్క రోజు సరిపడినంత నీరు తాగకపోయినా.. చర్మం కాస్త కళ తప్పినట్లుగా కనిపిస్తుంది. అలాగే పండ్ల రసాలు, కాయగూరల రసాలు, మజ్జిగ.. వంటివి తీసుకోవడం వల్ల చర్మం తేమను కోల్పోకుండా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

సరిపడినంత నిద్ర..

పెళ్లికి ముందు తీరిక లేకుండా చేసే పనులు, పెళ్లయిన తర్వాత జరిగే పార్టీలు, ఇతర కార్యక్రమాల వల్ల నిద్రపోవడానికి సరైన సమయం దొరక్కపోవచ్చు. ఇది కూడా మన సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల చర్మం సైతం అలసినట్లుగా తయారవుతుంది. ముఖం నీరసంగా, పీక్కుపోయినట్లు కనిపిస్తుంది. దీంతో ఎంత చక్కగా అలంకరించుకొన్నా.. అంత అందంగా కనిపించకపోవచ్చు. అందుకే ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ నిద్రకు తగినంత సమయం కేటాయించాలి. ఫలితంగా శరీరం రిలాక్స్‌ అవుతుంది. కోల్పోయిన ఉత్సాహాన్నీ తిరిగి పొందచ్చు. అలాగే మన సౌందర్యమూ రెట్టింపవుతుందన్నమాట!

తక్కువ మేకప్‌తో..

పెళ్లి సమయంలో అందరిలోనూ ప్రత్యేకంగా, అందంగా కనిపించాలనే ఉద్దేశంతో మేకప్ ఎక్కువగా వేసుకోవడానికి ప్రాధాన్యమిస్తాం. అయితే వివాహమైన తర్వాత కూడా అదే స్థాయిలో మేకప్ వేసుకోవడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల చర్మం రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే వివాహమైన మరుసటి రోజు నుంచి మరీ అవసరమైతే తప్ప తేలికపాటి మేకప్ ఉత్పత్తులను ఉపయోగించాలి. అంతేకాదు వేసుకొన్న మేకప్‌ని తొలగించుకొనేటప్పుడు సైతం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో లభించే మేకప్ రిమూవర్లకు బదులుగా.. సహజసిద్ధమైన వాటిని ఉపయోగించాలి. దీనికోసం బాదం నూనె, జొజొబా నూనెలను ఉపయోగించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్