హెయిర్ టోనర్ ఇంట్లోనే ఇలా...

సౌందర్య పరిరక్షణ విషయంలో చర్మానికి ఎంత ప్రాధాన్యమిస్తామో.. కురుల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరిస్తుంటాం. మేనిఛాయను పరిరక్షించుకోవడానికి ఉపయోగించినట్లే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా కొంతమంది టోనర్‌ని ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టుకి పోషణనివ్వడం మాత్రమే కాకుండా ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది.

Published : 27 Aug 2021 17:35 IST

సౌందర్య పరిరక్షణ విషయంలో చర్మానికి ఎంత ప్రాధాన్యమిస్తామో.. కురుల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరిస్తుంటాం. మేనిఛాయను పరిరక్షించుకోవడానికి ఉపయోగించినట్లే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా కొంతమంది టోనర్‌ని ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టుకి పోషణనివ్వడం మాత్రమే కాకుండా ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. ముఖ్యంగా హెయిర్‌డైలు వేసుకొనే అలవాటు ఉన్నవారు వీటిని ఉపయోగించడం ద్వారా ఆ రంగు మరింత సహజంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులను కాకుండా ఇంట్లోనే తయారుచేసుకొని ఉపయోగించుకోవడం మంచిది.

టోనర్ అవసరం ఏంటి?

ఇటీవలి కాలంలో జుట్టుకి వివిధ రంగుల్లో ఉండే హెయిర్‌డైలు వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నేటి యువతులు. అయితే ఇవి మొదట బాగానే ఉన్నప్పటికీ కొన్ని రోజులయ్యేసరికి వెలసిపోయినట్లుగా తయారవుతుంటాయి. ఇలా కాకుండా.. ఎక్కువ రోజుల వరకు ఆ రంగు నిలిచి ఉండేలా చేయడానికే హెయిర్ టోనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే వీటికోసం పార్లర్‌కి వెళ్లినా.. లేదా మార్కెట్లో దొరికే హెయిర్‌టోనర్లను కొందామన్నా.. దానికి చెల్లించాల్సిన మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఇంట్లోనే తక్కువ ఖర్చులో.. కాస్త సమయంలోనే మనం కొన్ని రకాల హెయిర్ టోనర్లను తయారుచేసుకోవచ్చు. ఇవి హెయిర్‌డై ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేయడం మాత్రమే కాకుండా.. వాటిలోని రసాయనాల ప్రభావం కురులపై పడకుండా కాపాడతాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

యాపిల్ సిడర్ వెనిగర్‌తో..

సౌందర్య పరిరక్షణలో యాపిల్ సిడర్ వెనిగర్‌ది ప్రత్యేకమైన స్థానం. దీన్ని ఉపయోగించి తయారుచేసిన హెయిర్‌టోనర్ డై వేసుకొన్న తర్వాత రంగు మారిపోకుండా చూస్తుంది. దీనికోసం నాలుగు టేబుల్‌స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్, రెండు టేబుల్‌స్పూన్ల నీటిని తీసుకోవాలి. ఈ రెండింటిని గిన్నెలో వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీంతో జుట్టుని తడి చేసుకోవాలి. పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది. అయితే ఈ మిశ్రమాన్ని నెలకు మూడు సార్ల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. ఎందుకంటే యాపిల్ సిడర్ వెనిగర్ వల్ల జుట్టు పొడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది.

నిమ్మరసంతో..

పావు కప్పు నిమ్మరసం, ముప్పావు కప్పు నీరు, రెండు టేబుల్‌స్పూన్ల తేనె తీసుకోవాలి. వీటిని ఒక స్ప్రేబాటిల్‌లో వేసి బాగా గిలకొట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుపై స్ప్రే చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమం మాడుకి తగలకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆ తర్వాత రెండు గంటల పాటు అలా వదిలేయాలి. ఆపై సల్ఫేట్ లేని షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ అప్త్లె చేసుకొంటే సరిపోతుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కారణంగా అది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుకి పోషణనిచ్చి.. హెయిర్‌డై రంగుని కాస్త లైట్ షేడ్‌లోకి మారుస్తుంది. హెయిర్ డై రంగు మరీ డార్క్‌గా ఉందని భావించే వారు.. ఈ చిట్కాను పాటిస్తే చక్కటి ఫలితం దక్కుతుంది. దీన్ని నెలలో మూడుసార్లకి మించి ఉపయోగించకూడదు.

బ్లాక్ టీతో..

బ్లాక్ టీ జుట్టుకి సహజసిద్ధమైన హెయిర్‌డైగా పనిచేస్తుంది. అయితే మనం కురులకు వేసిన కృత్రిమ హెయిర్‌డైని మరింత సహజంగా కనిపించేలా చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. దీనికోసం మనం చేయాల్సిందల్లా బాగా వేడిగా ఉన్న నీటిని కప్పులో తీసుకొని అందులో నాలుగైదు టీ బ్యాగులు వేయాలి. నీరు పూర్తిగా ముదురు రంగులోకి మారేంత వరకు టీ బ్యాగులను ఉంచి ఆ తర్వాత వాటిని తొలగించాలి. ఇప్పుడు ఈ నీటిని బాగా చల్లారనిచ్చి ఓ స్ప్రే బాటిల్‌లో పోయాలి. దీని సాయంతో టీ మిశ్రమాన్ని జుట్టుపై స్ప్రే చేసి 40-45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా జుట్టు షైనీగా, సహజసిద్ధంగా కనిపిస్తుంది.

హెయిర్ కండిషనర్‌తో..

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపించడానికి హెయిర్ కండిషనర్‌ని ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే దీన్ని హెయిర్‌డై మరింత అందంగా కనిపించేలా చేయడం కోసం కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం హెయిర్ కండిషనర్‌ని గిన్నెలో తీసుకొని కొద్దిగా నీటిని కలిపి మరీ చిక్కగా లేదా మరీ పలుచగా కాకుండా మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీనిలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్త్లె చేసుకొని అరగంట సమయం ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే జుట్టుకి పోషణ అందడం మాత్రమే కాకుండా.. హెయిర్‌డై సహజసిద్ధంగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్