ఇంటర్వ్యూలో ఇలా ఉంటే ఉద్యోగం కష్టమే..!

ఆన్‌లైన్.. ఆఫ్లైన్.. ఏ పద్ధతిలో జరిగినా ఇంటర్వ్యూ అనేది చాలా కీలకమైనది. దీని ద్వారా అభ్యర్థిలో శక్తిసామర్థ్యాలు ఎంత మేర ఉన్నాయి? ఎంత వరకు శ్రమించగలుగుతున్నారు? విధి నిర్వహణలో ఎంత నిజాయతీగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలపై ఓ అంచనాకి వస్తారు.

Updated : 31 Jan 2022 20:10 IST

ఆన్‌లైన్.. ఆఫ్లైన్.. ఏ పద్ధతిలో జరిగినా ఇంటర్వ్యూ అనేది చాలా కీలకమైనది. దీని ద్వారా అభ్యర్థిలో శక్తిసామర్థ్యాలు ఎంత మేర ఉన్నాయి? ఎంత వరకు శ్రమించగలుగుతున్నారు? విధి నిర్వహణలో ఎంత నిజాయతీగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలపై ఓ అంచనాకి వస్తారు. దాని ఆధారంగా ఉద్యోగం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకొంటారు. అందుకే ఉద్యోగ వేటలో ఉన్నవారు ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గానే పరిగణిస్తారు. ఇంటర్వ్యూలో ప్యానెల్ సభ్యులు అడిగే ప్రశ్నలకు వీలైనంత వరకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. చేతికి చిక్కిన అవకాశాన్ని చేజార్చుకున్నట్లవుతుందని చెబుతున్నారు కెరీర్ నిపుణులు.

అసౌకర్యంగా అనిపించడం..

ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో కొందరు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. సాధారణంగా ఇది తొలి ఇంటర్వ్యూకు హాజరయ్యే వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తరచూ ఇంటర్వ్యూలకు వెళ్లే వారిలో సైతం ఈ లక్షణాన్ని మనం గమనించవచ్చు. దీనికి వివిధ కారణాలు ఉండొచ్చు. సరైన సమాధానం తెలియకపోవడం, ఇంటర్వ్యూ కోసం మానసికంగా సన్నద్ధం కాలేకపోవడం లేదా ఇంటర్వ్యూలో అడుగుతున్న అంశాలపై మీకు పూర్తి స్థాయిలో పట్టులేకపోవడం వంటి కారణాలేవైనా కావచ్చు. వీటి వల్ల కొందరు ఇంటర్వ్యూలో అసౌకర్యంగా ఫీలవడం లేదా భయపడుతున్నట్లుగా కనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఫలితంగా మీలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవేమోననే భావన వారిలో కలుగుతుంది. ఇలా మన చేతి వరకు వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మన బలహీనతను సైతం బలంగా ఉపయోగించుకొనే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే.. 'నన్ను క్షమించండి. ఇంటర్వ్యూలో నేను కాస్త అసౌకర్యంగా ఫీలయ్యాను. నా పరిస్థితి మీరు అర్థం చేసుకొంటారని భావిస్తున్నా'నని చెప్పడం మంచిది.

డీలా పడిపోకూడదు..

సాధారణంగా ఇంటర్వ్యూలనగానే.. సరైన సమయంలోనే వెళ్లినప్పటికీ కొన్ని సందర్భాల్లో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇప్పుడు చాలావరకు ఇంటర్వ్యూలు ఆన్లైన్ లోనే జరుగుతున్నప్పటికీ, ప్రత్యేకించి ప్రత్యక్షంగా జరిగే ఇంటర్వ్యూల విషయంలో మాత్రం ఇది బాగా వర్తిస్తుంది. ఇలాంటప్పుడు అభ్యర్థులు కాస్త బోర్ ఫీలవ్వడం సహజం. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్వ్యూలో కనిపించనీయకూడదు. ఎందుకంటే అభ్యర్థిలో సహనం ఎంతవరకు ఉందని పరీక్షించడానికి కొన్ని సంస్థలు ఒక్కోసారి ఇలా చేసే అవకాశముంటుంది. కాబట్టి డీలా పడిపోయినట్లుగా కనిపించకూడదు.. సమాధానాలు ఇవ్వకూడదు. అందరికంటే చివరన మిమ్మల్ని లోనికి పిలిచినా ఉత్సాహంగానే కనిపించాలి. అది మీ సమాధానాల్లో కూడా ప్రతిఫలించాలి. అప్పుడే మీపై హైరింగ్ మేనేజర్‌కు గురి కుదురుతుంది. ఒకవేళ మీరు చెబుతున్న సమాధానం సరైనదే అయినప్పటికీ మీ మాటల్లో నీరసం, ముఖంలో నిస్సత్తువ కనిపిస్తే ఉద్యోగంపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. 

అతి విశ్వాసంతో..

ఆత్మవిశ్వాసం మనకెప్పుడూ మేలే చేస్తుంది. కానీ అది అతి విశ్వాసంగా మారిపోతేనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సూత్రం కెరీర్ విషయంలోనూ వర్తిస్తుంది. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగులోనూ ఆత్మవిశ్వాసం కనిపించాలి. మనం మాట్లాడే ప్రతి మాటలోనూ అది గోచరించాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో అభ్యర్థిలో ఆత్మవిశ్వాసం ఉందా? లేదా? అనే విషయాన్ని ప్రత్యేకంగా గమనిస్తారు. అలాంటి వారిని సంస్థలోకి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలా కాకుండా మనం చెప్పే సమాధానాల్లో ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువగా కనిపిస్తే.. లేదా కొన్ని విషయాల్లో అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందిస్తే.. సమాధానం చెప్పేటప్పుడు మరీ గట్టిగా చెబితే.. ఇలా మీ ప్రవర్తన ఉన్నట్లయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకొనే విషయంలో కాస్త ఆలోచిస్తుంటారు. 

అలాగే.. కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ రౌండ్‌లోనే సంస్థలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుందో తెలియజేస్తారు. అది కూడా మీకు ఓ పరీక్ష లాంటిదే. ఈ విషయంలో నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించడం సరైనదే. కానీ ఆ చెప్పే విషయాన్ని కాస్త నిదానంగా.. సహేతుకంగా వివరించడం మంచిది. అలా కాకుండా.. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్లన్నట్లు వ్యవహరించడం అంత మంచిది కాదు. అలాగే మీ గురించి మీరు చెప్పుకొనే సందర్భంలో అతిశయోక్తులకు పోవడం కూడా సరికాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని