నాణ్యమైన పుచ్చకాయని గుర్తించేదెలా?

నోరూరించే, ఆరోగ్యాన్ని పంచే సమ్మర్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో పుచ్చకాయ ఒకటి. దాదాపు 95 శాతం నీటితో ఉండే ఈ పండును వేసవిలో రోజూ తింటుంటాం.. తద్వారా వేసవి వేడిని దూరం చేసుకొని....

Published : 04 May 2023 12:23 IST

నోరూరించే, ఆరోగ్యాన్ని పంచే సమ్మర్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో పుచ్చకాయ ఒకటి. దాదాపు 95 శాతం నీటితో ఉండే ఈ పండును వేసవిలో రోజూ తింటుంటాం.. తద్వారా వేసవి వేడిని దూరం చేసుకొని, శరీరానికి చల్లదనాన్ని అందిస్తాం. అంతేకాదు.. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవడానికీ ఈ పండును మించింది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ పండును కొనేటప్పుడు ఏది పడితే అది కాకుండా.. కొనేముందు కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుంటే.. పండు రుచిని ఆస్వాదించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి...

పెద్దదే మంచిదా?

పుచ్చకాయల్ని కొనేటప్పుడు చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే.. పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత నాణ్యమైందని, గుజ్జు ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు. అలాగని మరీ చిన్నగా ఉన్నవి కూడా రుచిగా ఉంటాయని చెప్పలేం. కాయ ఏ పరిమాణంలో ఉన్నా.. చేతిలో పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. అప్పుడే లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నట్లు అర్థం. అందుకే పుచ్చకాయ బరువును బట్టి, సాధారణ పరిమాణంలో ఉన్న పుచ్చకాయలను ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు.

రంగుని బట్టి..

కొంతమంది పుచ్చకాయ పచ్చగా, నిగనిగలాడుతూ కనిపించేసరికి కాయ తాజాగా ఉందని కొనేస్తుంటారు. తీరా ఇంటికెళ్లి చూస్తే కాయ పూర్తిగా పండకపోవడం, చప్పగా ఉండడం, గుజ్జు తక్కువగా ఉండడం.. వంటివి గమనిస్తుంటారు. వాస్తవానికి పూర్తిగా పండిన కాయ ఎప్పుడూ బాగా ముదురు రంగులోనే ఉంటుందట. కాబట్టి పైకి కనిపించడానికి తాజాగా ఉందా, లేదా అన్న విషయం పక్కన పెట్టి ముదురు వర్ణంలో ఉన్న కాయని ఎంపిక చేసుకోవాలి.

మచ్చలుంటే..

కొన్ని పుచ్చకాయల్లో ఒకవైపు తెలుపు లేదంటే గోధుమ రంగులో మచ్చలుంటాయి. పండించేటప్పుడు పుచ్చకాయలు నేలకి ఆనుకుని ఉండడం వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయట! అయితే ఈ మచ్చలు ఎంతటి ముదురు రంగులో ఉంటే ఆ కాయలు అంత మంచివంటారు నిపుణులు. ముఖ్యంగా గోధుమ రంగు మచ్చలున్న పుచ్చకాయలను నిరభ్యంతరంగా కొనచ్చుట.

తొడిమను బట్టి..

తొడిమను బట్టి కూడా పుచ్చకాయ పక్వానికి వచ్చిందో లేదో తెలుసుకోవచ్చట. ఒకవేళ తొడిమ ఎండిపోయి ఉంటే కాయ బాగా పండినట్లు, అలా కాకుండా తొడిమ కాస్త పచ్చిగా ఉంటే.. ఇంకా పక్వానికి రానట్లు భావించాలి.

వాసనను బట్టి కూడా!

మామిడి పండుకు పదడుగుల దూరంలో ఉన్నా కూడా సువాసన గుప్పుమంటూ నోరూరిస్తుంది. దీనంత కాకపోయినా పుచ్చకాయని కూడా వాసనను బట్టి పండిందో, లేదో గుర్తించచ్చు. పండిన పుచ్చకాయను ముక్కుకు దగ్గరగా పెట్టుకుని వాసన చూస్తే తియ్యటి వాసన వస్తుంది. ఒకవేళ మరీ ఎక్కువ తీపి వాసన వస్తే తీసుకోకపోవడం మంచిది.. ఎందుకంటే అది కుళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లే లెక్క!

టక్ టక్..

కొంతమంది పుచ్చకాయని చేతిలోకి తీసుకుని వేలితో కొట్టి పరీక్షించడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా కొట్టినప్పుడు టక్ టక్ అనే శబ్దం వినిపిస్తే కాయ బాగా పండినట్టన్నమాట! అలా కాకుండా చప్పుడేమీ రాకుండా ఉంటే అదింకా పండలేదని అర్థం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్