చేతులకంటిన ఫుడ్‌కలర్‌ని పోగొడదామిలా..

ఆహారపదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడానికి మనలో చాలామంది ఫుడ్‌కలర్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే పొరపాటున చేతులు తడిగా ఉన్నప్పుడు ఈ రంగులని తాకితే అది చర్మానికి అంటుకుపోతుంది. ఆపై దాన్ని శుభ్రం చేయడం కష్టమవుతుంది.

Published : 30 Jul 2021 20:40 IST

ఆహారపదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడానికి మనలో చాలామంది ఫుడ్‌కలర్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే పొరపాటున చేతులు తడిగా ఉన్నప్పుడు ఈ రంగులని తాకితే అది చర్మానికి అంటుకుపోతుంది. ఆపై దాన్ని శుభ్రం చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఈ రకమైన రంగులన్నీ రసాయనాలతో తయారైనవే కాబట్టి.. వాటి వల్ల చర్మానికి హాని జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే వెంటనే దాని ప్రభావాన్ని తొలగించుకోవడం అవసరమంటున్నారు నిపుణులు. మరి, చర్మానికి అంటుకుపోయిన ఫుడ్‌కలర్‌ని తొలగించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందామా..

టూత్‌పేస్ట్‌తో..

చేతిపై అంటుకున్న ఫుడ్‌కలర్‌ని టూత్‌పేస్ట్ ఉపయోగించి సులువుగా పోగొట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా గోరువెచ్చని నీటితో సబ్బును ఉపయోగించి చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆ వెంటనే కొద్దిగా టూత్‌పేస్ట్ తీసుకొని రంగు అంటిన చోట రాసి రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగి చేతులను శుభ్రం చేసుకోవాలి. టూత్‌పేస్ట్‌లో కొద్ది మోతాదులో ఉండే బేకింగ్‌సోడా ఫుడ్‌కలర్‌ని తొలగిస్తుంది. అయితే దీనికోసం జెల్ టూత్‌పేస్ట్‌ని ఉపయోగించకూడదు.

వైట్ వెనిగర్‌తో..

చిన్న పిల్లలు తమ చేతికి ఏ వస్తువు దొరికితే దానితోనే ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా వారి చేతికి ఫుడ్‌కలర్ దొరికితే ఒళ్లంతా పూసుకుంటారు కూడా! ఈ క్రమంలో దాన్ని శుభ్రం చేసేటప్పుడు వారి చర్మం ఎలాంటి రసాయనాల ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి. దీనికోసం ముందుగా నీటిసాయంతో చిన్నారుల చర్మం నుంచి ఎంతవరకు ఆ రంగును తొలగించగలమో అంతవరకూ వాటిని పోగొట్టాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రం లేదా పేపర్ టవల్‌ని తీసుకొని వైట్‌వెనిగర్‌లో ముంచాలి. దీంతో ఫుడ్ కలర్ అంటుకున్న చోట మృదువుగా తుడవాలి. ఇలా రంగు పూర్తిగా పోయేంతవరకు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే మరోసారి వెనిగర్‌లో ముంచి తుడుచుకోవాలి.

ఒకవేళ మీరు దీనికోసం వస్త్రాన్ని ఉపయోగిస్తున్నట్త్లెతే.. వెనిగర్‌లో ముంచిన ప్రతిసారి తుడిచిన తర్వాత దాన్ని నీటిలో పిండుకోవాలి. అయినా రంగు వదలకపోతే.. బేకింగ్‌సోడాలో నీరు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని అప్త్లె చేసుకొనే ముందు ఓసారి చర్మాన్ని నీటితో కడిగి వెనిగర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత బేకింగ్‌సోడా పేస్ట్‌ని అప్త్లె చేసి మృదువుగా రుద్దుకొని నీటితో శుభ్రం చేసుకోవాలి. అనంతరం మరోసారి వైట్‌వెనిగర్‌లో ముంచిన వస్త్రంతో తుడుచుకుంటే సరిపోతుంది.

బేకింగ్ సోడాతో..

బేకింగ్‌సోడాను నీటిలో కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ఫుడ్‌కలర్ అంటిన చోట రాసుకోవాలి. ఐదు నిమిషాల పాటు గట్టిగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. అవసరమనుకుంటే మరోసారి ఈ పద్ధతిని రిపీట్ చేయాల్సి ఉంటుంది.

మౌత్‌వాష్‌తో..

మౌత్‌వాష్ సైతం చర్మానికి అంటుకున్న ఫుడ్‌కలర్‌ని తొలగించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనికోసం కొన్ని చుక్కల మౌత్‌వాష్‌ని ఫుడ్‌కలర్ అంటుకున్నచోట వేసి కాసేపు రుద్దుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మరక కొద్దికొద్దిగా పోవడం ప్రారంభిస్తుంది. పూర్తిగా పోయిన తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. దుస్తులపై ఏర్పడిన ఫుడ్‌కలర్ మరకని కూడా ఈ చిట్కా పాటించి తొలగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్